Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
3,000 మంది గల్లంతు

3,000 మంది గల్లంతు

  • 699కి చేరిన మృతుల సంఖ్య
  • 800 మీటర్ల మంచుకొండ కూలడంతోనే నేపాల్‌లో విపత్తు
  • కొత్తగా రెండు సరస్సులు ఏర్పడటంతో తొలగని ముప్పు

కాఠ్మాండూ: నేపాల్‌, టిబెట్‌లలో సంభవించిన వరద విధ్వంసంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.

శనివారం నాటికి గల్లంతైన వారు మూడు వేలకు, మృతుల సంఖ్య 699కు చేరింది. గల్లంతైన వారిలో 320 మంది భారతీయులు ఉన్నారు. 400 మందికి పైగా టిబెట్‌లో చిక్కుకుపోయారు. విపత్తు సంభవించిన మూడు రోజులకు హిమానీనదం కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంచుకొండ కూలుతున్న సమయంలో టిబెట్‌లోని గైడ్‌ల బృందం ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించింది. ఓ భారీ మంచుకొండ నుంచి 800 మీటర్ల ముక్క విరిగి కింద లోయలో పడింది. దీంతో ఒక్కసారిగా లోయలోని నీటిపై ఒత్తిడి పెరిగి ఆ వేగానికి చుట్టుపక్కల ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి.

ఆ నీటి ప్రవాహం నదుల్లో కలిసి ఇంత భారీ విపత్తుకు కారణమైనట్టు తెలుస్తున్నది. వినాశకరమైన వరదలు, కొండచరియల విపత్తుల అనంతరం రెండు కొత్త సరస్సులు ఏర్పడటంతో నేపాల్‌కు ఇంకా ముప్పు తొలగిపోలేదు. ఒక సరస్సు నుంచి నీరు పొర్లుతుండగా, మరో సరస్సు పరిణామం పెరుగుతున్నది. దీంతో మళ్లీ వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం వినాశనం సృష్టించిన నేపాల్‌-చైనా సరిహద్దు వద్దే ఈ రెండు కొత్త సరస్సులు ఏర్పడ్డాయి. వేగంగా పెరుగుతున్న నీటి మట్టం కింది ప్రాంతాలకు భారీగా బురద నీరు, ఇసుక, చిన్న, పెద్ద రాళ్లను తీసుకుపోతున్నది.

తీగను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నా
ఆకస్మాత్తుగా వచ్చిన వరదల్లో కొట్టుకుపోతూ ఒక విద్యుత్తు తీగను 30 నిముషాల పాటు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నట్టు త్రిశూలి మార్కెట్‌లోని ఒక స్వీట్‌ షాపులో పనిచేస్తున్న రాంబచన్‌ షా తెలిపాడు. షాపులోని మహిళ, ఆమె కుమారుడు, మరో వ్యక్తి వరదల్లో గల్లంతయ్యారని ఆయన పేర్కొన్నాడు.

త్రుటిలో మృత్యువు నుంచి బయటపడ్డాం
వరద విధ్వంసంలో త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నట్టు యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన భారత సంతతి దంపతులు అంజనా రాజా, పట్టాభిరామన్‌ వెంకటేశ్‌ తెలిపారు. రసువా జిల్లాలో తాము బస్సులో ప్రయాణిస్తుండగా భారీ వరద ప్రవాహం తమ బస్‌వైపు దూసుకువస్తున్న విషయాన్ని గమనించామని అంజనా రాజా తెలిపారు. వెంటనే బస్సులోంచి దూకి పక్కనే ఉన్న 500 మెట్లను క్షణాల్లో ఎక్కి ఇద్దరం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు చెప్పారు.

వరదలో కొట్టుకొచ్చిన బ్యాంక్‌ లాకర్‌
భారీ వరదల్లో ఏకంగా బ్యాంక్‌ లాకరే కొట్టుకుని వచ్చింది. దీంతో కొందరు దానిని బద్దలు కొట్టి అందులోని సొమ్మును అపహరించారు. రంగంలోకి దిగిన నేపాల్‌ పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రసువాలోని భోటెఖోషి ప్రాంతంలో వరదల వల్ల కొట్టుకుపోయన ఒక బ్యాంక్‌ సేఫ్‌ ఆ తర్వాత ధాడింగ్‌ జిల్లాలోని గల్చి రూరల్‌ మున్సిపాల్టీ-4 పరిధిలో గల బెల్టుఖోలా వద్ద త్రిశూలీ నదీ తీరంలో లభ్యమైనట్టు సమాచారం. స్థానికులు ఆ లాకర్‌ను బద్దలు కొట్టి అందులోని సొమ్మును అపహరించారు. ఇప్పటివరకు 29 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, వారి నుంచి రూ. 57 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

ఎలాంటి సాయానినైనా భారత్‌ సిద్ధం
భారీ వరదలు విధ్వంసం సృష్టించడం నేపాల్‌, భారతదేశం రెండింటికీ ఆందోళన కలిగించే విషయమని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. నేపాల్‌కు ఎలాంటి సహాయం అవసరమైన అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని, ఇప్పటికే నేపాల్‌కు అవసరమైన సామగ్రిని విమానాల ద్వారా పంపుతున్నామని ఆయన తెలిపారు.

వరద ప్రాంతాల్లో భారీ వర్ష హెచ్చరిక
వరద ప్రభావిత ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని నేపాల్‌ వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు మంచు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే అక్కడ జరుగుతున్న విపత్తు సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 15 వేల మందికి పైగా సైనికులు సహాయ కార్యక్రమాల్లో ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖానల్‌ తెలిపారు. కొండ ప్రాంతాలైన ఖోషి, బాగ్‌మతి, గండకి, కర్నకిలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. వరదల వల్ల నేపాల్‌ జల విద్యుత్‌ రంగం తీవ్రంగా ప్రభావితమైందని అధికారులు తెలిపారు. బోటెఖోషి, త్రిశూలి లోయల్లో ఉన్న 14 జలవిద్యుత్తు ప్రాజెక్టులకు తీవ్రంగా నష్టం ఏర్పడిందని చెప్పారు. కాగా, అధికారులు రక్షించిన వారిలో తమ వారి పేర్లు ఉన్నాయేమోనని ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలను పెద్దసంఖ్యలో పౌరులు వెతుక్కుంటున్నారు. ప్రమాద ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లు, ఇతర ఆస్తులకు సంబంధించిన శిథిలాలను సైనికులు తొలగించి ట్రక్కుల ద్వారా పంపుతున్నారు.

కెమెరాలో నమోదైన విరిగిన మంచుకొండ

చైనాలోని జిజాంగ్‌ ప్రాంతంలో ఒక పర్యాటకుడు వరద విధ్వంసాల దృశ్యాన్ని తన కెమెరాలో చిత్రీకరించాడు. దీంతో విపత్తు మూలాలను అర్థం చేసుకోవడానికి అది సహాయపడుతున్నది. ఆ వీడియోలో కొండవాలు నుంచి మంచు, రాళ్లు, శిథిలాలు వేగంగా కిందకు జారుతూ కన్పించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ హిమానీనదం విరిగిపోవడమే నేపాల్‌-చైనా సరిహద్దులో విధ్వంసకరమైన వరదకు కారణమైంది. కొద్ది సమయంలోనే ఆ విధ్వంసం నేపాల్‌ నుంచి చైనాలోని గిరాంగ్‌ పోర్ట్‌ వరకు వ్యాపించింది. ఈ వరద విపత్తుకు గల మూలకారణానికి లభించిన ఆధారంగా ఈ వీడియోను గుర్తించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి, వరద ప్రభావానికి గురైన ప్రాంతానికి 20 కి.మీ దూరం ఉన్నప్పటికీ ఈ వరద, శిథిలాలు సెకనుకు 50 మీటర్ల వేగంతో కదిలాయని చైనా భూగర్భ నిపుణుడు గువో జావోచెంగ్‌ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana