Friday, 24 Sep, 7.27 am నమస్తే తెలంగాణ

బిజినెస్‌
64వేల ఉద్యోగాలు మఠాష్‌

  • భారత్‌కు గుడ్‌బై చెప్తున్న విదేశీ ఆటో సంస్థలు
  • ఫోర్డ్‌, జీఎం, ఫియట్‌, హ్యార్లీ.. ఇలా ఎన్నో
  • రూ.2,485 కోట్ల పెట్టుబడుల్ని నష్టపోయిన డీలర్లు
  • కేంద్ర ప్రభుత్వానికి ఆటోమొబైల్‌ డీలర్ల సంఘం లేఖ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23: జనరల్‌ మోటర్స్‌, ఫియట్‌, హ్యార్లీ డేవిడ్సన్‌, ఫోర్డ్‌.. ఇలా చెప్తూపోతే గడిచిన ఐదేండ్లలో భారత్‌ను వీడిన విదేశీ ఆటోమొబైల్‌, ఆటోమోటివ్‌ సంస్థల జాబితా పెద్దగానే కనిపిస్తున్నది. 2017 నుంచి దేశీయ మార్కెట్‌కు ఒక్కటొక్కటిగా బహుళజాతి సంస్థలు దూరమవుతూనే ఉన్నాయి. దీనివల్ల ఏకంగా 64,000 ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ఆయా ఆటో సంస్థల డీలర్లు రూ.2,485 కోట్ల పెట్టుబడుల్ని నష్టపోయారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) పంచుకున్న వివరాలివి. కాదు..కాదు.. ఆందోళనతో సదరు శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకు ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్‌ గులాటీ రాసిన లేఖలోని నిజాలివి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇంకా వేలాది మందికి ఉపాధి కరువైపోతుందని, దేశ ఆర్థిక వ్యవస్థనూ ఇది తీవ్ర సంక్షోభానికి గురిచేయగలదన్న భయాలను ఎఫ్‌డీఏ ఈ సందర్భంగా వ్యక్తం చేయడం గమనార్హం. తాజా నిర్ణయంతో దేశంలోని రెండు ఫోర్డ్‌ ప్లాంట్లు మూతబడుతుండగా, ప్రత్యక్షంగా 4వేల మందికి ఉద్యోగాలు దూరమవుతున్నాయి. పరోక్షంగా మరెందరో నిరుద్యోగులవుతున్నారు.

షాకిచ్చిన 6 దిగ్గజాలు
వరుసగా దేశాన్ని వీడుతున్న విదేశీ ఆటో కంపెనీలు.. కేంద్రంలో మోదీ సర్కారు పాలనకు అద్దం పడుతున్నాయి. ఏకంగా 6 దిగ్గజ సంస్థలు వెళ్లిపోయాయి మరి. నిజానికి భారత్‌కు బైబై చెప్తున్న సంస్థలేవీ అనామక కంపెనీలు కావు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణను పొందుతున్నవే. అయినప్పటికీ దేశంలో మాత్రం మనుగడ సాగించలేపోతుండటం ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నది. ఇది సర్కారీ విధానాల్లోగల లోపాల్నీ ఎత్తిచూపుతున్నది.

డీలర్ల రక్షణకు చట్టాలు తేవాలి
భారత్‌కు దూరం కావడానికి విదేశీ ఆటో కంపెనీలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఆటో డీలర్ల హక్కుల రక్షణకు పార్లమెంట్‌లో చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎఫ్‌ఏడీఏ అభిప్రాయపడింది. ఈ మేరకు కృషి చేయాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. డీలర్‌షిప్‌లు మూతబడితే అందులో పనిచేస్తున్న సిబ్బంది నిరుద్యోగులవుతారని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికింది.

  • ఫోర్డ్‌, జనరల్‌ మోటర్స్‌, ఎంఏఎన్‌ ట్రక్స్‌, ఫియట్‌, హ్యార్లీ డేవిడ్సన్‌, యూఎం మోటర్‌సైకిల్స్‌ బైబై
  • విదేశీ సంస్థల నిష్క్రమణతో దేశవ్యాప్తంగా సుమారు 500 డీలర్లపై ప్రభావం
  • కరోనాతో అమ్మకాలు లేక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకు శరాఘాతం
  • ఇండస్ట్రీని వేధిస్తున్న అధిక పన్నులు, పెరుగుతున్న ఉత్పాదక వ్యయం
  • ఐషర్‌ పొలారీస్‌ జాయింట్‌ వెంచర్‌ అమ్మకాలు సైతం బంద్‌

'భారత్‌లో నిలదొక్కుకోవాలని ఏండ్ల తరబడి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇటీవలికాలంలో పరిస్థితి మరింత దిగజారింది. ఇకపై దేశంలో కొనసాగలేమని అర్థమైపోయింది. అందుకే ఇక్కడ తయారీని ఆపేస్తున్నాం. అమ్మకాలనూ దశలవారీగా నిలిపేస్తాం'
-ఈ నెల 9న ఫోర్డ్‌ ప్రకటన

'ఉన్నట్టుండి బహుళజాతి సంస్థలు మూతబడుతుండటం దేశీయ ఆటో రిటైల్‌ పరిశ్రమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నది. ఈ వరుస పరిణామాలు వ్యాపారం చేయాలన్న ఆశల్నే దెబ్బతీస్తున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి'
-వింకేశ్‌ గులాటీ, ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top