Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
6న మలేషియాలో రాష్ర్టావిర్భావ వేడుకలు

6న మలేషియాలో రాష్ర్టావిర్భావ వేడుకలు

  • ముఖ్య అతిథిగా వెళ్లనున్న కేటీఆర్‌
  • మైటా, బీఆర్‌ఎస్‌ పార్టీ మలేషియా విభాగం ఆధ్వర్యంలో ఉత్సవాలు
  • సంస్కృతిని చాటుతున్న ఎన్నారైలు
  • బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
  • హైదరాబాద్‌లో బ్రోచర్‌ ఆవిషరణ
  • ఇతర దేశాల్లోనూ వేడుకలు: మహేశ్‌

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): 'అమెరికాలోని డాలస్‌ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చూసి.. మిగతా దేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఇలాంటి వేడుకలు జరిపేందుకు ముందుకొస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా జూన్‌ 6న మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌ నగరంలో రాష్ట్ర ఆవిర్భా వేడుకలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి' అని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ (మైటా), బీఆర్‌ఎస్‌ మలేషియా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో మైటా, బీఆర్‌ఎస్‌ మలేషియా ప్రతినిధులతో కలిసి ఉత్సవాల బ్రోచర్‌ను జగదీశ్‌రెడ్డి ఆవిషరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దానికి పైగా ఎన్నారైలు తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో అద్భుతంగా నిలబెడుతున్నారని, వారి పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు. మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పదే పదే గుర్తు చేసుకొంటున్న ఏకైక పేరు కేసీఆర్‌ అని, తెలంగాణలో డిమా ండ్‌ ఉన్న నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో ప్రపంచమంతా గమనిస్తున్నదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కేసీఆర్‌ లేని లోటు రెండేండ్లుగా స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు ఇప్పటికే భావిస్తున్నారని చెప్పారు.

బాలిక ఘటనపై ట్వీట్‌ ఏది రాహుల్‌?
ప్రపంచంలో ఎకడ ఏం జరిగినా ట్విట్టర్‌ వేదికగా స్పందించే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో మైనర్‌ బాలికపై జరిగిన ఘోర ఘటనపై ఎందుకు ట్వీట్‌ చేయలేదని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొనే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు, మహిళలకు ఎల్లప్పుడూ బీఆర్‌ఎస్‌ పార్టీయే శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు.
ఖరీఫ్‌ ప్రారంభమవుతున్నా రైతులకు విత్తనాలు, ఎరువులు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. కనీసం యూరియా కూడా ఇవ్వలేని దీనస్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. రైతాంగాన్ని ముంచి, వ్యవసాయ సబ్సిడీలను దోచుకోవాలనే విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ఎజెండా ఒకటేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల రైతులకు భరోసా కరువైందని తెలిపారు.

డాలస్‌లాగా మరిన్ని వేడుకలు : మహేశ్‌ బిగాల
అమెరికాలోని డాలస్‌ నగరంలో నిరుడు చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించామని, అలాంటి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో నిర్వహిస్తామని బీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ బిగాల తెలిపారు. రాబోయే రోజుల్లో మిగతా దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మైటా ప్రెసిడెంట్‌ తిరుపతి, బీఆర్‌ఎస్‌ మలేషియా ప్రెసిడెంట్‌ చిట్టిబాబు, మైటా ఉమెన్స్‌వింగ్‌ ప్రతినిధి సుప్రియ, శివ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వంటెద్దు నరసింహరెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, పడాల సతీశ్‌, రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana