Wednesday, 03 Mar, 12.35 am నమస్తే తెలంగాణ

ఆధ్యాత్మికం
ఆదియోగియే ఆదిగురువు!

యోగ సంప్రదాయంలో శివుడిని దేవునిగా చూడరు. ఆయన ఈ నేలపై నడిచిన ఒక జీవి. ఆయనే యోగ సంస్కృతికి ఆదిమూలం. ఆయన ఆదియోగి, ఇంకా ఆదిగురువు కూడా. 'కాంతి సరోవరం' ఒడ్డునే తొలిసారిగా ఆయన యోగ శాస్ర్తాలను ప్రసాదించాడు. 'కాంతి సరోవరం' ఒక హిమసరస్సు. అది హిమాలయాలలోని కేదార్‌నాథ్‌కు కొంచెం పైన ఉన్నది. అక్కడ ఆదియోగి తన మొదటి ఏడుగురు శిష్యులకు అంతర్ముఖ విజ్ఞానానికి చెందిన క్రమబద్ధమైన వ్యాఖ్యానం అందించారు. ఆ శిష్యులనే 'సప్త ఋషులు'గా పూజిస్తున్నాం. పురాణాల ప్రకారమూ శివపార్వతులు ఆ సరోవరం ఒడ్డున నివసించారు. అక్కడ అనేకమంది యోగులుకూడా నివసించేవారు.

అక్కడ ఈ సరస్సు, దాని చుట్టూ మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలూ ఉన్నాయి. ప్రకృతి పరంగా ఇదెంతో మనోహరమైంది. ఈ పెద్ద సరస్సులోని నీరు నిశ్చలం. చుట్టూ ఎటువంటి చెట్లూ, చేమలూ లేవు. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఆ నీటిలో ప్రతిబింబిస్తుంటాయి. అదొక అద్భుత ప్రదేశం. నిజానికి 'కైలాసాన్ని' శివుని ఆవాసంగా పేర్కొంటారు. అంటే, దానర్థం ఆయన తన జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్త పరిచారని! ఆదియోగి జ్ఞానంలో సప్తర్షులు ప్రతి ఒక్కరూ ఒక భాగాన్ని గ్రహించారు. ఆ జ్ఞానంలోని మొత్తం ఏడు అంశాలూ గ్రహించగల ఏ ఇతర వ్యక్తీ ఆయనకు దొరకలేదు. అప్పుడిక ఆదియోగి, తన జ్ఞానాన్నంతా కైలాసంలో నిక్షిప్తం చేయ నిర్ణయించారు. అంటే, జీవితాన్ని నడిపే జ్ఞానానికి చెందిన ఆ అంశాలన్నీ ఒకేచోట, ఒకే భాండాగారంలో నిక్షిప్తమైనాయి. అందుకే, ఆ కైలాసమే ఈ భూమిమీద అతిగొప్ప 'మార్మిక గ్రంథాలయం' అయ్యింది. అదొక సజీవ గ్రంథాలయం కూడా.

ఒక వ్యక్తి ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు అతని గ్రహణశక్తి ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అతను గ్రహించింది తన చుట్టూ ఉన్న వ్యక్తులకు అందించడం అన్ని వేళలా కుదరదు. ఆయన అందుకున్న దానిలో కేవలం చిన్న భాగం మాత్రమే అతను బహుశా తన చుట్టూ ఉన్నవారికి అందించగలడు. తనకు తెలిసినదంతా అందించడానికి ఒక గురువుకు తగిన వ్యక్తి దొరకడమూ చాలా అరుదు. వేల సంవత్సరాలుగా ఆత్మజ్ఞానం పొందినవారు కైలాసానికి పయనమై తమ జ్ఞానాన్ని ఒక రకమైన శక్తి రూపంలో నిక్షిప్తం చేశారు. దానికి ఈ పర్వతాన్ని ఆధారంగా చేసుకున్నారు. అందువల్లే 'మార్మికతకు ఆదిపురుషుడైన అగస్త్యుడు కైలాస పర్వత దక్షిణముఖంలో నివసిస్తాడనీ' అంటారు. బౌద్ధులు తమ ప్రముఖ బుద్ధులలో ముగ్గురు, జైనులు తమ మొదటి తీర్థంకరుడైన 'ఋషభ దేవుడు' కైలాసంలోనే ఉంటారని భావిస్తారు.

ఆధ్యాత్మిక సాధకుడికి 'కైలాసం' అంటే భూమిమీద సర్వోన్నతమైన మూలస్థానాన్ని అందుకోవడం లాంటిది. మార్మికత తెలుసుకోవాలనుకునే వారికి ఇదే సరైన స్థలం. ఇటువంటి స్థలం మరొకటి లేదు. 'శివుడు' అనే మాటకు అర్థం ఏమిటంటే 'ఏది లేదో అది' అని. అంటే, 'లేని దానికి' దేవాలయాలు నిర్మితమైనాయి. 'ఉన్నది' అంటే భౌతికంగా ఉన్నవి అని. 'లేని దానికి' అంటే, అది భౌతికానికి అతీతం అని. 'ఏది లేదో' దానిలోకి ప్రవేశించడానికి దేవాలయం ఒక రంధ్రం లాంటిది. ఈ దేశంలో వేలాది శివాలయాలు ఉన్నాయి. వాటిలో ఏ విధమైన మూర్తి (విగ్రహ) రూపాలూ లేవు. వాటిలో ఉన్నది రూపానికి ప్రతీకగా భావించే ఒక 'లింగం' మాత్రమే.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top