Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆకతాయిలకు సంస్కార్‌ కౌన్సెలింగ్‌

ఆకతాయిలకు సంస్కార్‌ కౌన్సెలింగ్‌

  • మహిళలు, చిన్నారులకు అండగా షీ టీమ్స్‌
  • మల్కాజిగిరి సీపీ సుమతి

మన్సూరాబాద్‌, మే 29: మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ పట్టుబడిన వారు తమ తప్పును సరిదిద్దుకునేందుకు షీటీమ్స్‌ ఒక్క అవకాశం ఇస్తుందని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి అన్నారు.

మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ పట్టుబడిన ఆకతాయిలకు శుక్రవారం షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నాగోల్‌లోని పీఎంఆర్‌ గార్డెన్‌లో సంస్కార్‌ పేరుతో మెగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ తప్పును సరిదిద్దుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మారకుండా తిరిగి మరోసారి అదే తప్పును పునరావృత్తం చేస్తే సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్కసారి కేసు నమోదు అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు లభించకపోవడంతో పాటు విదేశాల్లో చదువులకు వెళ్లే ఆస్కారం ఉండదన్నారు. పురుషులతో పాటు మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నా.. ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగడం శోచనీయమన్నారు.

ఈ సంవత్సరం జనవరి నుంచి మొదలుకుని మే 18 వరకు మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో షీటీమ్స్‌ 61 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 760 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో 236 పెటీ కేసులు ఉన్నాయన్నారు. షీటీమ్స్‌కు పట్టుబడిన వారిలో 137 మంది మైనర్లు ఉండటం బాధాకరమన్నారు. షీ టీమ్స్‌ ఇప్పటి వరకు 406 విద్యాసంస్థలు, పలు ప్రజా ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 53 వేల మందికి పైగా ప్రజలకు మహిళల భద్రత, సైబర్‌ సేఫ్టీ, పోక్సో చట్టం, సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana