Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆక్సిజన్‌కు ఎందుకింత కష్టం?

ఆక్సిజన్‌కు ఎందుకింత కష్టం?

  • దేశంలో పెరుగుతున్న మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత
  • డిమాండ్‌కు తగిన ఉత్పత్తి ఉన్నా.. వీడని కష్టాలు
  • ఆక్సిజన్‌ సరఫరాలో అసమానతలే ప్రధాన కారణం
  • ట్యాంకర్లు, సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు
  • పీఎస్‌ఏ ప్లాంట్లతో సమస్యకు చెక్‌ పెట్టొచ్చంటున్న నిపుణులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ (రెండో ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. కేసుల్లో అనూహ్య పెరుగుదలతో వైద్యవ్యవస్థపై పెను భారం పడుతున్నది. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోని దవాఖానలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఇప్పటికే ఎంతో మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతకు కారణాలు ఏమై ఉంటాయి?

దేశంలో రోజుకు 7 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నది. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ (రోజుకు) 5 వేల మెట్రిక్‌ టన్నులే. అయితే, ఆక్సిజన్‌ సరఫరాలో అసమానతల వల్లే కొన్ని రాష్ర్టాల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 'ప్రస్తుతం దేశంలో రోజుకు 7,200 మెట్రిక్‌ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. అయితే, ప్రస్తుత డిమాండ్‌ రోజుకు 5 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. రోజుకు సుమారు 2,200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, కొన్ని రాష్ర్టాల్లో కొరత ఏర్పడుతున్నది. దీనికి కారణం.. సరఫరాలో ఎదురవుతున్న సమస్యలే' అని ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రోడక్ట్స్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా ఆక్సిజన్‌ కొరత ఉన్నదని, కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇప్పుడిప్పుడే ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుందన్నారు. అంతగా డిమాండ్‌ లేని రాష్ర్టాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడంవల్లే ఈ సమస్య తలెత్తినట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అవసరాలకు తగిన ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని, అయితే, రోజుకు 2.50 లక్షలు-5 లక్షల కేసులు నమోదైతే సమస్యలు ఎదురుకావొచ్చని తెలిపారు.

ట్యాంకర్లు, సిలిండర్ల కొరత
ప్రాణవాయువును నిల్వ ఉంచేందుకు, సరఫరా చేసేందుకు అవసరమైన సిలిండర్లు, ట్యాంకులు వంటి లాజిస్టిక్‌ సమస్యల వల్ల కూడా ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌ను దవాఖానలకు తరలించేందుకు క్రయోజెనిక్‌ ట్యాంకర్లు అవసరం. అవి ప్రస్తుత డిమాండ్‌కు తగినట్టు అందుబాటులో లేవు. దీంతో తగినంతగా ఆక్సిజన్‌ ఉత్పత్తి జరిగినప్పటికీ, దవాఖానలకు సరఫరా కావడంలేదు. క్రయోజెనిక్‌ ట్యాంకర్లను కొత్తగా నిర్మించాలంటే 4 నెలల సమయం పడుతుందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు.

పరిష్కారమేంటి?
సుదూర ప్రాంతాల్లోని దవాఖానలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి రైళ్లను ఉపయోగిస్తే, కొరతను కొంతవరకు అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఆర్గాన్‌, నైట్రోజన్‌ ట్యాంకర్లలో ఆక్సిజన్‌ను సరఫరా చేయడం వల్ల డిమాండ్‌ను కొంత వరకు పూడ్చవచ్చన్నారు. దవాఖానల్లో ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్‌ప్షన్‌ (పీఎస్‌ఏ-పీడనం ద్వారా గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరు చేయడం) ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల ఆక్సిజన్‌ కొరత సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొంటున్నారు.

ఎగుమతుల వల్ల సంక్షోభం ఏర్పడిందా?
విదేశాలకు మెడికల్‌ ఆక్సిజన్‌ను ఎగుమతి చేయడం వల్లే దేశంలో కొరత ఏర్పడిందని కొందరు భావిస్తున్నారు. గణాంకాల ప్రకారం.. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 4,502 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఎగుమతి చేశారు. 2020-21 మొదటి 10 నెలల్లో 9,301 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఎగుమతి చేశారు. ప్రస్తుత కరోనా సెకండ్‌ వేవ్‌ సమయానికి ఆక్సిజన్‌ డిమాండ్‌ రోజుకి 5,000 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7 వేల మెట్రిక్‌ టన్నులకుపైగా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నది. దీన్ని బట్టి ఎగుమతుల వల్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందనడానికి ఆధారాలు లేవని అర్థమవుతున్నది.

ఇవీ కూడా చదవండి…

బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?

కైలాస దేశంలోకి భారతీయుల రాకపై నిత్యానంద నిషేధం

ఈ యాప్‌లు మీ మొబైల్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana