Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా గేమ్స్‌కు నీరజ్‌ దూరం

ఆసియా గేమ్స్‌కు నీరజ్‌ దూరం

  • ప్రాక్టీస్‌లో కాలి మడమకు గాయం.. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ నుంచీ ఔట్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పతక వేట సాగించాలనుకున్న భారత అథ్లెటిక్స్‌ బృందానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

భారీ అంచనాలు పెట్టుకున్న జావెలిన్‌ స్టార్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా వచ్చే నెల జపాన్‌లో జరిగే మెగా గేమ్స్‌కు దూరమయ్యాడు. శిక్షణ సమయంలో కాలి మడమ లిగమెంట్‌ తీవ్రంగా దెబ్బతినడంతో ఆసియాడ్‌తో పాటు మిగిలిన సీజన్‌ మొత్తానికి అతడు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

ఇటీవల జరిగిన లాసాన్‌ డైమండః లీగ్‌ మీట్‌లో ఈ సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో తిరిగి పాత రిథమ్‌ అందుకున్న నీరజ్‌ ఆ తర్వాత ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడ్డాడు. వైద్యుల సలహా, తన కోచింగ్‌ బృందంతో చర్చించిన అనంతరం ఈ సీజన్‌లోని మిగిలిన పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా చోప్రా వెల్లడించాడు. సెప్టెంబర్‌ 5న బ్రస్సెల్స్‌లో జరగనున్న డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, ఈ గాయం వల్ల ఆ టోర్నీలోనూ పాల్గొనలేకపోతున్నాడు.

'లాసాన్‌ టోర్నీలో మంచి ప్రదర్శనతో ఇప్పుడే ఫామ్‌లోకి వస్తున్నానని భావించా. సరిగ్గా ఇలాంటి సమయంలో గాయపడటం తీవ్ర నిరాశ కలిగించింది. కానీ, క్రీడా జీవితంలో సవాళ్లు, అడ్డంకులు సహజమే. ప్రస్తుతం నా దృష్టంతా పూర్తిగా కోలుకుని, మళ్లీ మునుపటి కంటే బలంగా మైదానంలోకి దిగడంపైనే ఉంది' అని 28 ఏండ్ల నీరజ్‌ తెలిపాడు. ఈ ఎడిషన్‌ ఆసియా గేమ్స్‌లో కచ్చితంగా స్వర్ణం నెగ్గుతాడన్న అంచనాలున్న నీరజ్‌ లేకపోవడం భారత అథ్లెటిక్స్‌ జట్టుకు లోటు కానుంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక పసిడి, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌, 2023 బుడాపెస్ట్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచి ప్రపంచ జావెలిన్‌ రంగాన్ని ఏలుతున్నాడు. కాగా, ఆసియా గేమ్స్‌ వచ్చే నెల 19 నుంచి సెప్టెంబర్‌ వరకు జరగనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana