Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్వితీయం వెనుక ఆ నలుగురు

అద్వితీయం వెనుక ఆ నలుగురు

  • ఆర్సీబీని తిరుగులేని శక్తిగా మార్చిన మాస్టర్‌మైండ్స్‌

ఐపీఎల్‌ ట్రోఫీలు కేవలం మైదానంలో తలపడే 11 మంది ఆటగాళ్లతోనో.. 20 ఓటర్ల ఆటతోనో సొంతం కావు. అందుకు లీగ్‌ను శాసించే ఒక తిరుగులేని సైన్యం అవసరం.

ఆ సైన్యాన్ని నిర్మించాలంటే తెరవెనుక ఓ బలమైన వ్యవస్థ ఉండాలి. ఆటగాళ్ల వేలం టేబుళ్ల వద్ద మొదలు వ్యూహాత్మక సమావేశాల్లో విజయానికి బాటలు పడాలి. ఆర్సీబీ రెండో ఏడాది ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించడం వెనుక కేవలం గ్రౌండ్‌లో కదిలిన ఆటగాళ్లకే కాదు వారిని నడిపించిన ఒక అజేయమైన శక్తి ఉంది. రజత్‌ పాటిదార్‌ కెప్టెన్సీలోని ఆర్సీబీ అద్వితీయ ప్రదర్శన చేయడం.. ఆ జట్టు ఓ విన్నింగ్‌ మెషిన్‌గా మారడంలో నలుగురు మాస్టర్‌ మైండ్స్‌ ఉన్నారు. వారెవరూ.. జట్టును తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఏమిటో ఓ లుక్కేద్దాం!

ఆండీ ఫ్లవర్‌ (హెడ్‌ కోచ్‌) ది లీడర్‌ఆర్సీబీ తలరాత మారడం సరిగ్గా 2024 సీజన్‌కు ముందు ఆండీ ఫ్లవర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించడంతోనే మొదలైంది. కేవలం మూడేండ్ల్ల కాలంలో ఫ్రాంచైజీకి అతను రెండు ఐపీఎల్‌ టైటిళ్లను అందించాడు. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా పేరుగాంచిన ఫ్లవర్‌ రికార్డు అసాధారణమైనది. గతంలో ఇంగ్ల్లండ్‌ జట్టును నంబర్‌ వన్‌గా మార్చడం, మూడు యాషెస్‌ సిరీస్‌లు గెలవడం, 2010లో ఇంగ్లిష్‌ టీమ్‌ తొలి టీ20 వరల్డ్‌ కప్‌ అందించడం వంటి ఎన్నో ఘనతలు ఫ్లవర్‌ సొంతం. 2025లో ఆర్సీబీకి తొలి ఐపీఎల్‌ కప్పు అందించిన అతను ఇప్పుడు దాన్ని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్‌ చేశాడు. 'నా దృష్టిలో ప్రస్తుతం ఉన్న కోచ్‌ల్లో ఫ్లవర్‌ అత్యుత్తమ గురువు. తుది జట్టులో ఆడేవారికే కాదు.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు, తమ మొదటి ఐపీఎల్‌ ఆడుతున్న యువ క్రికెటర్లకు కూడా ఆయన సమాన ప్రాధాన్యత ఇస్తూ జట్టును నడిపిస్తారు' అని ఫ్లవర్‌పై కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ప్రశంసలు కురిపించాడు.

మో బోబాట్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌) – దీర్ఘకాలిక ప్రణాళికల రూపశిల్పి
ఆర్సీబీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన 'బుల్లెట్‌ప్రూఫ్‌ టీమ్‌’ను నిర్మించిన ఘనత మో బోబాట్‌కు దక్కుతుంది. ఒకప్పుడు ఒక స్టార్‌ ప్లేయర్‌ గాయపడితే ఆర్సీబీ డీలా పడి ప్యానిక్‌ బటన్‌ నొక్కేసేది. కానీ బోబాట్‌ తెచ్చిన మార్పుతో.. ప్రతి స్థానానికి ఒక నాణ్యమైన రీప్లేస్‌మెంట్‌ను సిద్ధం చేశారు. ఫిలిప్‌ సాల్ట్‌ అందుబాటులో లేనప్పుడు జాకబ్‌ బెథెల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ లేనప్పుడు ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ జాకబ్‌ డఫీ వంటి నాణ్యమైన ఆటగాళ్లను బ్యాకప్‌గా ఉంచడం బోబాట్‌ వ్యూహాత్మక చాతుర్యానికి నిదర్శనం.

దినేశ్‌ కార్తీక్‌ (బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌) – ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌ మాస్టర్‌
గతంలో ఆటగాడిగా ఆర్సీబీకి సేవలందించిన దినేశ్‌ కార్తీక్‌ ఇప్పుడు మెంటార్‌గా, బ్యాటింగ్‌ కోచ్‌గా తెరవెనుక అద్భుతమైన పాత్ర పోషించాడు. ఆటగాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకోవడం, ఒత్తిడి సమయాల్లో వారిని ప్రశాంతంగా ఉంచడంలో కార్తీక్‌ అనుభవం జట్టుకు ఎంతో ప్లస్‌ అయింది. దీర్ఘకాలిక టోర్నమెంట్లలో గాయాలు, ఆటగాళ్ల వ్యక్తిగత కారణాల వల్ల వచ్చే మార్పులను తట్టుకుని జట్టు స్థిరంగా ఉండేలా ప్లాన్‌ చేయడంలో డీకే మేనేజ్‌మెంట్‌కు కీలక సలహాదారుడిగా నిలిచాడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీ ఆటగాడికి ఓ పెద్దన్నలా భరోసా కల్పించాడు. గతంలో ఆర్సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇదే లోటుగా ఉండేది.

మాలోలన్‌ రంగరాజన్‌-స్కౌటింగ్‌ హెడ్‌
ఆర్సీబీ అంటే కేవలం విరాట్‌ కోహ్లీ మాత్రమే కాదు..ఇప్పుడు రసిఖ్‌ సలామ్‌ దార్‌, సుయాష్‌ శర్మ వంటి యువ ఆటగాళ్లు మ్యాచ్‌ విన్నర్లుగా మారారంటే దానికి కారణం మాలోలన్‌ రంగరాజన్‌ నేతృత్వంలోని స్కౌటింగ్‌ టీమ్‌. దేశవాళీ క్రికెట్‌ నుంచి అద్భుతమైన ప్రతిభను గుర్తించి, వారిని ఆర్సీబీ అకాడమీ ద్వారా తీర్చిదిద్దడంలో రంగరాజన్‌ నెట్‌వర్క్‌ ఎంతో దోహదపడింది. ఈ యువ ఆటగాళ్లే కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి సీనియర్లకు అండగా నిలిచారు. ఈ నలుగురితో పాటు ఆర్సీబీ బౌలింగ్‌ కోచ్‌ ఓంకార్‌ సాల్వి పాత్ర కూడా అమోఘమైనది. ఒకప్పుడు కేవలం బ్యాటింగ్‌లోనే బలంగా ఉంటూ, బౌలింగ్‌ లోపాలతో ఇబ్బంది పడే ఆర్సీబీని.. బంతితోనూ ప్రత్యర్థులను భయపెట్టేలా మార్చింది సాల్వినే! ప్రతి ఒక్క బౌలర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, తగినంత సమయం వెచ్చించి అందరినీ మ్యాచ్‌ విన్నర్లుగా తయారు చేశాడు. మొత్తంగా వ్యక్తిగత గ్లామర్‌ చుట్టూ తిరిగే పాత ఆర్సీబీ సంస్కృతిని పూర్తిగా మార్చేసి.. పక్కా ప్రణాళికలతో ఒక తిరుగులేని వ్యవస్థను సృష్టించిన ఈ మాస్టర్‌మైండ్స్‌ వల్లే బెంగళూరు సరికొత్త శకానికి నాంది పలికింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana