Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐడీబీఐ సేల్‌ స్పీడప్‌!

ఐడీబీఐ సేల్‌ స్పీడప్‌!

  • వ్యూహాత్మక వాటా విక్రయానికి కసరత్తు
  • ఫైనాన్షియల్‌ బిడ్లను పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • ఎల్‌ఐసీ, సర్కార్‌ కలిసి 60.72% సేల్‌కు సన్నాహాలు
  • పోటీపడుతున్న ఫెయిర్‌ఫాక్స్‌, ఎమిరేట్స్‌ ఎన్‌డీబీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25: ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నది. గత కొన్నేండ్ల నుంచి 6 దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఈ బ్యాంక్‌ను వదిలించుకోవాలని చూస్తున్న మోదీ సర్కార్‌.. 2019 జనవరిలో ఎలాగోలా ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి మెజారిటీ వాటా (51 శాతం)ను అంటగట్టి పంతం నెగ్గించుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్యాంక్‌లో ఇప్పటికీ దాదాపు 95 శాతం (94.72 శాతం) వాటా ప్రభుత్వానిదే. ఇందులో ప్రస్తుతం ఎల్‌ఐసీ చేతిలో 49.24 శాతం వాటా ఉంటే, కేంద్రం దగ్గర 45.48 శాతం వాటా ఉన్నది. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నమోదైనందున.. మరో 5.28 శాతం వాటా పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ (నాన్‌-ప్రమోటర్లు) పేరిట ఉన్నది. అయితే ఇప్పుడు ఎల్‌ఐసీ, కేంద్రం కలిసి బ్యాంక్‌ను ప్రైవేటీకరణ బాట పట్టించాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ వాటాల్లో 60.72 శాతాన్ని అమ్మేయాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆసక్తిగలవారు దాఖలు చేసిన ఫైనాన్షియల్‌ బిడ్లను ప్రభుత్వం మూల్యంకనం చేస్తున్నదని సర్కారీ వర్గాలు శుక్రవారం తెలియజేశాయి.

ఇదీ సంగతి..
ఈ ఏడాది జూలైలో బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ ప్రేమ్‌ వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌, దుబాయ్‌ ఆధారిత ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ.. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రతిపాదిత 60.72 శాతం వాటాను దక్కించుకునేందుకు సవరించి వేసిన బిడ్లను దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ బిడ్ల పరిశీలన ఇప్పుడు వేగంగా జరుగుతున్నదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఫెయిర్‌ఫాక్స్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ రెండింటికీ భారతీయ బ్యాంకింగ్‌ రంగంలో అనుభవం ఉన్నది. ప్రైవేట్‌ బ్యాంకుల్లో వీటికి భారీగా వాటాలున్నాయి. ఎమిరేట్స్‌ ఎన్‌బీడీకి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటా ఉంటే, ఫెయిర్‌ఫాక్స్‌కు సీఎస్‌బీ బ్యాంక్‌లో 40 శాతం వాటా ఉన్నది.

మరోవైపు కేంద్ర హోం అఫైర్స్‌ మినిస్ట్రీ నుంచి ఈ బిడ్డర్లకు ఇప్పటికే సెక్యూరిటీ క్లియరెన్స్‌లు కూడా వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి 'ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ అసెస్‌మెంట్‌ కూడా పూర్తయింది. నిజానికి ఫెయిర్‌ఫాక్స్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీలు ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కోసం గతంలోనే బిడ్లు వేసినా.. అవి పెట్టుబడుల ఉపసంహరణపై ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కార్యదర్శుల నేతృత్వంలో ఏర్పాటైన ఇంటర్‌-మినిస్టీరియల్‌ గ్రూప్‌ నిర్ణయించిన రిజర్వ్‌ ధర కంటే తక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా అమ్మకం ప్రక్రియను నిలుపుదల చేయాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) మళ్లీ సదరు ప్రక్రియ మొదలవగా.. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయా సంస్థలు తమ బిడ్లను సవరించి జూలై 13న మరోసారి దరఖాస్తు చేసుకున్నాయి. వీటినే ఇప్పుడు మోదీ సర్కార్‌ పరిశీలిస్తున్నదంటున్నారు. దీంతో త్వరలోనే ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ జరుగుతుందన్న అంచనాలు సర్వత్రా నెలకొన్నాయిప్పుడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana