Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐఏఎస్‌ల పిల్లలకూ రిజర్వేషన్లా?.. ఇలాగైతే మనం ఆ విధానం నుంచి బయటపడలేం: సుప్రీం

ఐఏఎస్‌ల పిల్లలకూ రిజర్వేషన్లా?.. ఇలాగైతే మనం ఆ విధానం నుంచి బయటపడలేం: సుప్రీం

  • ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత వాటిని వదులుకోవాలని సూచన

న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ల ప్రయోజనాలను కొనసాగించడం అవసరమా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.

రిజర్వేషన్ల విధానం ద్వారా సామాజిక పురోగతి సాధించిన కుటుంబాలు చివరకు రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి బయటకు రావాలని కోర్టు అభిప్రాయపడింది. వెనుకబడిన తరగతుల్లోని క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ల ప్రయోజనాల విషయమై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌.. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులుగా ఉన్న పిల్లలకు రిజర్వేషన్ల అవసరం ఏముందని ప్రశ్నించింది.

"వారిద్దరూ ఐఏఎస్‌ అధికారులు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. సామాజిక పురోగతి అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలాంటి వారందరినీ మినహాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి, కానీ వారు ఆ మినహాయింపును ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి" అని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. "విద్య, ఆర్థిక సాధికారతతో సామాజిక పురోగతి లభిస్తుంది. అలాంటప్పుడు వారి పిల్లలకు కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరితే మనం దీని నుంచి ఎప్పటికీ బయటపడలేము. ఇది మనం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం" అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

న్యాయవాది శశాంక్‌ రత్నూ వాదిస్తూ.. సంబంధిత వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా వారి హోదా ఆధారంగా మినహాయించారని, దీనిపై లోతైన పరిశీలన అవసరమని అన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీకి, క్రీమీలేయర్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా జస్టిస్‌ నాగరత్న.. లైవ్‌ లా నివేదిక ప్రకారం ఈడబ్ల్యూఎస్‌లో సామాజిక వెనుకబాటుతనం ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుందని అన్నారు.

తర్వాత రత్నూ వాదిస్తూ.. క్రీమీలేయర్‌ కోసం నిర్దేశించే నిబంధనలు ఈడబ్ల్యూఎస్‌ కంటే చాలా సరళంగా ఉండాలని, రెండింటినీ ఒకేలా చూస్తే వాటి మధ్య తేడా లేకుండా పోతుందని అన్నారు. దీనిపై జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ కొంత సమతుల్యత ఉండాలని అన్నారు. ఒక వ్యక్తి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండవచ్చని, కానీ రిజర్వేషన్‌ ప్రయోజనాలను ఉపయోగించుకొని తల్లిదండ్రులు ఒక నిర్దిష్ట ఉన్నత స్థాయికి చేరుకున్నాక ఆ పరిస్థితి మారుతుందని పేర్కొన్నారు. ఈ వాదనలను విన్న అనంతరం కోర్టు ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ సంబంధిత పక్షాల నుంచి సమాధానాలను కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana