తాజావార్తలు
అన్ని ఇండ్లకూ మంచి నీళ్లు

- వందశాతం ఇండ్లకు నల్లానీళ్లను అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రం
- 54.06 లక్షల ఇండ్లకు నల్లా నీరు.. ఫలించిన సీఎం కేసీఆర్ కృషి
- ట్విట్టర్ ద్వారా అభినందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్
రాష్ట్రం కొత్తది.. నీళ్ల కోసం తండ్లాడి.. తండ్లాడి సాధించుకొన్న తెలంగాణ.. ఈ నీళ్లు ఎట్ల రావాలె.. కరెంటు ఎట్ల నిలుపుకోవాలె.. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వానికి ఇదే ఆలోచన.. ఆరున్నరేండ్లు తిరిగిపోయాయి. కాళేశ్వరం మొదలైంది.. మిషన్ భగీరథ మొదలైంది.. మిషన్ కాకతీయ మొదలైంది.. వీటన్నింటి ఫలితంగా ఇవాళ ప్రతి ఒక్క ఇంటికీ అత్యంత సురక్షితమైన తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే అగ్రభాగాన నిలిచి కేంద్ర ప్రభుత్వ అభినందనలను అందుకొన్నది. దేశంలో ఈ ప్రతిష్ఠ సాధించింది తెలంగాణతోపాటు గోవా మాత్రమే. మహామహా రాష్ర్టాలేవీ కూడా తెలంగాణ దరిదాపుల్లో కూడా నిలువలేకపోయాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్వయంగా ప్రకటించిన విషయమిది. అద్భుతం సృష్టించాలంటే.. అది తెలంగాణకే సాధ్యం అని మళ్లీ రుజువైంది.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మనిషికి కనీస అవసరమై తాగునీటిని నల్లాద్వారా ఇంటింటికీ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వైశాల్యం, జనాభా, ఆదాయపరంగా పెద్ద రాష్ర్టాలు దశాబ్దాలుగా సాధించలేనిది తెలంగాణ ఆవిర్భవించిన ఆరున్నరేండ్లలోనే సాధించింది. రాష్ట్రంలోని 54,06,070 ఇండ్లకు వంద శాతం సురక్షిత నీటిని నల్లా ద్వారా అంది స్తూ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ విషయా న్ని గురువారం కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్విట్టర్‌లో వెల్లడించారు. తెలంగాణను అభినందించారు. దేశవ్యాప్తంగా ఇంటింటికీ నీరు సరఫరాచేసే కార్యక్రమంలో త్వరలోనే విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న రాష్ర్టాల్లో గోవా కూడా వందశాతం ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరసనచేరింది.
భగీరథ ప్రయత్నం
వేసవికాలంలో తాగునీటికోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లే మహిళల కష్టాలను రూపుమాపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. వారంపదిరోజులకు ఒకసారి వచ్చే తాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలిగిపోయేందుకు ఈ పథకాన్ని వేగంగా అమలుచేశారు. ఫ్లోరై డ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నల్లగొండ జిల్లా .. ఇప్పుడు సంపూర్ణంగా స్వచ్ఛమైన నీటిని ఆస్వాదిస్తున్నది. గతేడాది జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదంటే.. అందుకు సురక్షితమైన నల్లా నీరే కారణం. నల్లమల్ల అట వీ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలు, భద్రాచలం నియోజకవర్గంలోని తండాలు, గొండు గూడేల కు కూడా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇందుకు ప్రజలనుంచి ఒక్క పైసా వసూలుచేయడంలేదు.
సురక్షిత నీరు అందించడమే లక్ష్యం
రాష్ట్రంలోని ప్రజలందరికీ శుద్ధి చేసిన తాగునీటిని అందించే లక్ష్యంతో, కృష్ణా.. గోదావరి నదుల నీటిని శుద్ధిచేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతంలో తెలంగాణ తాగునీటి అవసరాల్లో ఉపరితల నీటి వనరులు (నదులు, చెరువులు) వాటా కేవలం 18శాతం ఉండేది. ప్రస్తుతం వంద శాతానికి చేరుకొన్నది. గతంలో 82 శాతం తాగునీటి అవసరాలకు.. బోర్లు, బావుల మీదే ఆధారపడ్డారు. గతంలో ఒక్కొక్కరికీ 40 నుంచి 55 లీటర్లు మాత్రమే సగటున సరఫరాచేసే వారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీటిని అందించడానికి 1.47లక్షల కిలోమీటర్లు పైప్‌లైన్ వేశారు. 13,901 ఓవర్ హెడ్ సర్వీస్ ట్యాంకులను నిర్మించారు. గ్రామా ల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో రోజుకు ఒక్కొక్కరికీ 135 లీటర్లు, కార్పొరేషన్ల పరిధిలో రోజుకు ఒక్కొక్కరికీ 150 లీటర్లు అందించేలా పైప్‌లైన్లను వేశారు. భవిష్యత్‌తరాలకు నీటి కొరత లేకుండా పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా పైప్‌లైన్లను వేశారు.
60 టీఎంసీల నీటిని సంవత్సరానికి మిషన్ భగీరథ ద్వారా అందిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 నీటి నాణ్యతా ప్రయోగశాలలతోపాటు 50 నీటిశుద్ధి కేంద్రాలలో ప్రయోగశాలలు, హైదరాబాద్‌లోని రాష్ట్ర ల్యాబ్‌లో కూడా అన్ని పరీక్షలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేశారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతతోపాటు నిర్మా ణ కంపెనీల్లో జవాబుదారీతనం పెంచేందుకు వీలుగా సివిల్, పైప్‌లైన్ పనులకు ఐదేండ్లపాటు ఆయా కాంట్రాక్టు సంస్థలే బాధ్యత వహించేలా ఒప్పందంచేసుకున్నారు. పంప్‌సెట్లకు పదేండ్లపాటు కంపెనీలే బాధ్యత వహిస్తాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ తరహాలో తమ రాష్ట్రాల్లో పథకాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రాష్ట్రాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చిన అధ్యయనం చేసి వెళ్లారు.
ఒకే రకమైన ప్రెషర్
మిషన్ భగీరథలో మరో ప్రత్యేకత ఏమిటంటే గ్రామంలో మొదటి ఇంటి నుంచి చివరి ఇంటి వరకు ఒకే రకమైన ప్రెషర్‌తో నీరు రావడానికి ఫ్లో కంట్రోల్ వాల్వ్‌ను ఉపయోగించారు. దీంతో మొదటి ఇంటికి ఎక్కువ నీళ్లు రావడం చివరి ఇంటివారికి తక్కువ నీరు రావడమంటూ ఉండ దు. ఈ పథకానికి ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ నీటి నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం, అవగాహన పెంచడానికి గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఈ నీటినే వాడుతున్నారు. రాబోయే రోజు ల్లో క్యాన్‌ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు, కార్యక్రమాలకు నీటిని అందిస్తారు
related stories
-
నిజామాబాద్ తాగునీటి సమస్యను తీర్చాలంటూ ఖాళీ బిందెలతో నిరసన
-
తూర్పు గోదావరి పుష్కర జలం..పట్టణాలకు వరం
-
అనంతపురం నీటి కొళాయి చుట్టూ తొలగిన మురుగు