Sunday, 09 May, 10.55 pm నమస్తే తెలంగాణ


అంతిమ లక్ష్యం అందరి ఆరోగ్యం

ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందించటం ప్రభుత్వాలకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలని పీవీ ఆకాంక్షించారు. ఆయన కేంద్రంలో ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న కాలం నుంచీ, ఆ తర్వాత ప్రధానిగా ఉన్న కాలంలో ప్రజారోగ్యం గురించి తపన పడ్డారు.

సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లు నగరాలకే పరిమితం కారాదని, గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అన్ని వసతులతో కూడిన దవాఖానల ఏర్పాటుకు కృషిచేశారు. దానిలో భాగంగానే ఢిల్లీ పరిసర రాష్ర్టాల ప్రజల కోసం 500 వందల పడకలతో హాస్పిటల్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రజారోగ్య ప్రాధాన్యం గురించి వివరించారు.

భారతీయ సంస్కృతిలో వైద్యునికి విశిష్ట స్థానం ఉన్నది. మన వాళ్లు వైద్యుడిని కనిపించే దేవుడు అన్నారు. రోగ బాధతో వస్తే నయం చేసి ప్రాణాలు నిలిపే వైద్యుడికి దేవుడి స్థానం సముచితమే. డాక్టర్లుకూడా అదే స్ఫూర్తితో పనిచేయాలి. అల్పమైన విషయాలతో వైద్యులు బాధ్యతలను మరువరాదు. అయితే, వైద్యులకుకూడా ఈ వ్యవస్థలో కొన్ని సమస్యలు, డిమాండ్లు ఉండవచ్చు. మనం తప్పకుండా వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, తమ సమస్యలను నేపథ్యంగా తీసుకొని వైద్యులు రోగాలతో వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేయరాదు. ఎప్పుడైనా ఒక రోగి బాధతో దవాఖానకు వస్తే, అక్కడ వైద్యుడు లేకపోతే అతను ఎంత బాధపడతాడో, నిరాశ చెందుతాడో అర్థం చేసుకోవాలి. దవాఖానలో వైద్యుడు కనిపిస్తే రోగికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. తగిన చికిత్స అం దుతుందని ఆశిస్తాడు. గంపెడాశతో రోగి దవాఖానకు వెళ్తే అక్కడ ఎలాంటి వైద్యం అందకపోతే అతనికి ఎంతో బాధగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వైద్యవృత్తి పవిత్రతను, గొప్పతనాన్ని గుర్తించి నడచుకోవాలి.

ఇక్కడ సమావేశమైన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఎంతో శుభప్రదమైన దినం. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక ఉన్నతాశయంతో పని సంకల్పించిన రోజే గొప్ప శుభప్రదమైనదిగా భావించాలన్నారు. ఆ విధంగా ఈ రోజు నిజంగానే మంచిరోజు. ఒక ఉన్నత లక్ష్యం కోసం ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం. అదేమంటే.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరుమీద ఓ హాస్పిట్‌ల్‌ నిర్మాణానికి పునాది రాయి వేయబోతున్నాం. వెనుకబడిన పేదలకోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుని పేరుతో ఓ దవాఖానను నిర్మించతలపెట్టా.

రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నేను భారత ప్రభుత్వ ఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్నాను. దవాఖానల్లో ఉన్న సమస్యలు, సౌకర్యాల గురించి నాకు తెలుసు. దవాఖానల గురించి తెలుసుకునే క్రమంలో నాకు తెలిసిందేమంటే, ఢిల్లీలోని అతిపెద్ద దవాఖాన అయిన 'ఆల్‌ ఇండియా మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో 30 నుంచి 35 శాతం మంది రోగులు ఢిల్లీ బయటివారే.

వారంతా ఢిల్లీ పరిసర ప్రాంతాలనుంచి మంచి ఉన్నతమైన వైద్యాన్ని ఆశించి వచ్చినవారు. వారంతా హర్యానా, యూపీ రాష్ర్టాలనుంచి వస్తారు. అంటే ఢిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖాన ఢిల్లీ దేశ ప్రజలందరిదీ. ఎయిమ్స్‌ పెద్ద దవాఖాన, ఇందులో సకల సౌకర్యాలుంటాయి. అవసరమైన మంచి వైద్యం అందుతుంది. ఈ ఆశతోనే అక్కడికి వస్తారు. వారిని రావద్దని వారించలేం. వెనక్కి వెళ్లిపొమ్మనీ అనలేం. ఢిల్లీ దేశ రాజధాని నగరం. ఇక్కడి దవాఖానలో కల్పించిన వసతులన్నీ కేవలం ఇక్కడి ప్రజలకు మాత్రమేనని అనలేం.

నగరానికి దూర ప్రాంతమైన గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించకుండా నగరాల్లోనే అందుబాటులో ఉంటే.. అవన్నీ పట్టణాల్లోని పెద్దలకే అనే భావన కలుగుతుంది. మరో ఫిర్యాదు కూడా ఉన్నది. అది- సకల సదుపాయాలు, నైపుణ్యాలు కలిగిన వైద్య వ్యవస్థ కేవలం నగరాలకే పరిమితమైందన్నది. కాబట్టి, సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కారాదు. ఎయిమ్స్‌లోని సౌకర్యాలన్నింటితో గ్రామీణ ప్రాంతాల్లోనూ దవాఖానలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.

ఢిల్లీ జనాభా కోటి దాటుతున్నది. సహజంగానే ఇక్కడ ఉద్యోగావకాశాలు, ఇతర ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశ, విదేశీ రాయబార కార్యాలయాలు, దేశ నలుమూలల నుంచి వచ్చే ప్రజా సముదాయం ఉంటుంది. అందుకు తగిన విధంగానే ఇక్కడి దవాఖానల్లో వసతులు, సౌకర్యాలు ఉంటాయి. జనాభా క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంతగా సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఒక ఆరోగ్య శాఖమంత్రిగా నేను అనేకమార్లు నా మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో వైద్య సదుపాయాల కల్పన గురించి చర్చించాను. 'సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం పెద్ద నగరాలకు వచ్చే పరిస్థితి లేకుండా చూడలేమా' అని తర్కించుకున్నాం. మనం వారికి ఎయిమ్స్‌లో ఉన్నటువంటి సౌకర్యాలతో దవాఖానను అందుబాటులోకి తేవటమే పరిష్కారంగా తెలిపాను.

అలాగే, ఈ సందర్భంగానే నేను మరో విషయం చెప్పదలిచాను. సకల సౌకర్యాలతో పెద్ద దవాఖానలను కట్టడం కాకుండా, దవాఖానల సంఖ్యనూ పెంచాలంటున్నాను. అదే మంచిది. ఈ విషయంలో నిపుణులు దృష్టిసారించాలి. 500 పడకలకన్నా ఎక్కువ ఉండకుండా దవాఖాన ఉండాలి. ఇది ప్రామాణికంగా పరిగణించాలి. ఈ విధమైన కార్యాచరణతో ఢిల్లీ చుట్టూ అనేక దవాఖానలను ప్రారంభించవచ్చు. ఈ విధమైన కార్యాచరణతో 8వ పంచవర్ష ప్రణాళికలో ముందుకు పోదాం. అప్పుడే ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా దవాఖానలను తేగలుగుతాం.

దేశంలో దవాఖాన సేవలు చాలినంతగా లేవు. డాక్టర్ల కొరత లేదు. వారు ఏటా అందుబాటులోకి వస్తున్నారు. కానీ, దవాఖానల కొరత ఉన్నది. సౌకర్యాల లేమి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వైద్యంపై దృష్టి సారించాలి. గ్రామాల్లో ఏటా వ్యాపిస్తున్న అంటురోగాలు, సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం సర్వశక్తులూ ఒడ్డాలి. దీనికి కావలసిన వసతులను సమకూర్చుకోవాలి. వైద్యులు, సౌకర్యాల కల్పనతోనే గ్రామీణ ప్రాంతాల్లో రోగాలను నయం చేయవచ్చు. గ్రామాల్లో పనిచేయటానికి వైద్యులు సంసిద్ధంగా ఉండాలి. డాక్టర్లు దీన్ని తమ విద్యుక్త ధర్మంగా భావించాలి. గ్రామీణ ప్రాంత పేదలకు సేవ చేసే అవకాశాన్ని వారొక సదవకాశంగా పరిగణించాలి. అప్పుడే ప్రజలు తగు విధమైన వైద్యసేవలు పొందగలుగుతారు.

ఈ సందర్భంగా మిమ్మల్నందరినీ అభినందిస్తున్నాను. ఈ ప్రాంత అవసరాలు తీర్చేందుకు దవాఖాన రాబోతున్నది. మీ అందరి సహకారంతోనే దేశ సమస్యగా ఉన్న వైద్య ఆరోగ్య సమస్యను పరిష్కరించుకుందాం. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తున్నది. సమస్యలను పరిష్కరించుకుంటూ ఎలా ముందుకు పోతున్నామో గమనిస్తున్నది. మనం ఒకటే చాటుదాం, గొప్ప నాయకులు ఇప్పుడు మన ముందు లేకపోయినా, వారు ప్రారంభించిన ఉన్నత కార్యక్రమాలున్నాయి. వారి ఆశలు, అంచనాలకు అనుగుణంగా మనం నడుచుకొని వారి కలలను నిజం చేద్దాం. అడ్డంకులన్నింటినీ అధిగమించి ఐక్యంగా ముందుకుసాగుదాం. ఐశ్వర్య, ఆరోగ్య భారతావనిని నిర్మించుకుందాం.

(ఢిల్లీలో 1991 డిసెంబర్‌ 19న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ దవాఖాన నిర్మాణానికి పునాదిరాయి వేసిన సందర్భంగా ప్రధాని పీవీ చేసిన ప్రసంగం సంక్షిప్తంగా.. )

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top