Friday, 22 Jan, 12.27 am నమస్తే తెలంగాణ

అభిప్రాయం
అణ్వస్త్ర రహిత ప్రపంచం

ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 2017 జూలై 7న ఆమోదించిన అణ్వాయుధ నిషేధ ఒప్పందం నేటినుంచి అమలులోకి రానున్నది. ఈ ఒడంబడిక ప్రకారం అణ్వస్త్ర పరిశోధనలు, వినియోగం, నిల్వచేసుకోవటమే కాకుండా, అణ్వస్త్ర టెక్నాలజీ బదలాయింపు కూడా చట్టవిరుద్ధమవుతుంది. అనేక అవరోధాలు అధిగమించి ఈ ఒప్పందం వాస్తవ రూపం దాల్చింది. తీర్మాన సమయంలో 70 దేశాలు ఓటింగ్‌లో పాల్గొన లేదంటే అగ్రదేశాల చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థమవుతున్నది. అణ్వస్త్ర దేశాలైన అమెరికా, ఇంగ్లండ్‌, రష్యా ఫ్రాన్స్‌, చైనా ఎంతగా ఆధిపత్య రాజకీయాలు చేసినా, వర్ధమాన దేశాల దశాబ్దాల ఆకాంక్షకు ఈ తీర్మానం ప్రతిఫలమని చెప్పవచ్చు. వ్యూహాత్మక అయుధ తగ్గింపు ఒడంబడిక-2 (స్టార్ట్‌-2) వచ్చే నెల 5తో ముగుస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర నిషేధ తీర్మానం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణ్వస్త్ర దాడి సృష్టించిన విధ్వంసాన్ని చూసిన తర్వాత ప్రపంచ మంతా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నది. వాటిని నాశనం చేయాలని అనేక దేశాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. కానీ తమ వద్ద ఉన్న అణుసంపత్తిని నాశనం చేయకుండా, మిగతా దేశాలను మాత్రం కట్టడి చేయడానికి అగ్రరాజ్యాలు ప్రయత్నించాయి. నానాటికీ ఒత్తిడి పెరుగుతుండటంతో 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందం (ఎన్‌పీటీ), 1996లో సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)లాంటివి తెరపైకి వచ్చాయి. అయితే అవన్ని వర్ధమాన దేశాల రక్షణ పాటవాన్ని నీరుగార్చి, భద్రత పరంగా అగ్రరాజ్యాలపై ఆధారపడేట్లు చేసేవే. దీన్నే భారత్‌తో సహా అనేక దేశాలు నిరసించాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఇన్నాళ్లుగా చేస్తున్న అణురాజకీయాలకు తాజా ఒప్పందంతోనైనా తెరపడుతుందని ఆశిద్దాం.

ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినంత మాత్రాన అది ఆచరణలోకి రాదు. కనీసం యాభై సభ్య దేశాలు దానిపై సంతకాలు చేస్తేనే వాస్తవ రూపం దాలుస్తుంది. అంతేకాకుండా సభ్య దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా నిబద్ధతతో కృషి చేయాలి. గతంలో అమెరికా-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా భూగర్భ అణుపరీక్షలు, ఖండాంతర రాకెట్ల తయారీ నిలిచిపోయింది. కానీ ఆతర్వాతి కాలంలో ఆధిపత్య పోరులో ఒప్పందాలన్నీ బుట్టదాఖలయ్యాయి. నిషేధిత ల్యాండ్‌మైన్లు, క్లస్టర్‌ బాంబులు, రసాయన, జీవ ఆయుధాల వాడకానికి గత దశాబ్దం సాక్షీభూతంగా నిలిచింది. అగ్ర రాజ్యాలు ఆసక్తి చూపకపోయినా ప్రపంచ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ ఐక్యరాజ్యసమితి శాంతికోసం అడుగులు వేయటం హర్షణీయం. ఇప్పటికైనా అణ్వస్త్ర దేశాలు శాంతికి కట్టుబడాలి. ఈ భూ మండలాన్ని సురక్షితంగా ముందు తరాలకు అందించాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top