Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలాపూర్‌ లడ్డూ అధరహో

బాలాపూర్‌ లడ్డూ అధరహో

  • వేలంలో రూ.39 లక్షలు పలికిన లడ్డూ

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 25 ( నమస్తే తెలంగాణ ) : గణేశ్‌ పండుగలో అత్యంత కీలక ఘటం లడ్డూ వేలం. నవరాత్రులు పూజలు అందుకున్న గణేశుడి లడ్డూను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు.

ఏ లడ్డూ ఎంత ధర పలికిందోనని అందరూ ఉత్కంఠగా గమనిస్తుంటారు. శుక్రవారం జరిగిన వివిధ వేలం పాటల్లో పలువురు లక్షలు వెచ్చించి విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకున్నారు. లడ్డూవేలం అనగానే మొదట గుర్తొచ్చేది బాలాపూర్‌ వినాయకుడే. ఈ లడ్డూను దక్కించుకోవడానికి 9 మంది పాల్గొనగా అందులో 5 కంపెనీలు సైతం పోటీపడ్డాయి. చివరికి రూ.39 లక్షలకు సామ ప్రణీత్‌రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడు.

గతేడాది కంటే ఈ సారి రూ.4 లక్షలు అధికం. గతేడాది రూ.35 లక్షల ధర పలికింది. కాగా, 1994లో బాలాపూర్‌ లడ్డూను తొలిసారి రూ.450కి ఓ రైతు దక్కించుకోగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు లడ్డూను దక్కించుకోవడానికి భక్తులు పోటీపడుతుంటారు. కాగా, బాలాపూర్‌ లడ్డూ దక్కించుకున్న ప్రణీత్‌ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూను నిరుపేదలకు, అనాథపిల్లలకు పంచుతానని చెప్పాడు. మరోవైపు నగరంలో వివిధ మండపాల్లో జరిగిన వేలంలో లడ్డూ ధరలు లక్షల్లో పలికాయి.

అత్తాపూర్‌లోని పురాతన పోచమ్మ ఆలయం వద్ద నవశక్తి భక్త సమాజ్‌ ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించన లడ్డు వేలంలో గుమ్మడి బ్రదర్స్‌కు చెందిన భూపాల్‌రెడ్డి రూ.13.21లక్షలకు దక్కించుకున్నారు. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌ సేవాలాల్‌ నగరంలో రూ.11.50 లక్షలకు గణనాథుని లడ్డూను ఎస్‌.శంకర్‌ నాయక్‌ దంపతులు దక్కించుకున్నారు. మణికొండలోని ఆదిత్య అథేనా అపార్ట్‌మెంట్‌ లడ్డూను రూ.9.35 లక్షలకు కృష్ణంరాజు దక్కించుకున్నారు. కూకటల్‌ పల్లిలో వినాయక భక్త బృందం లడ్డు వేలంపాటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు రూ.7.11 లక్షలకు దక్కించుకున్నాడు.

లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

  • ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బాలాపూర్‌ లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వినాయక చవతి వచ్చిందంటే దేశ విదేశాలలో బాలాపూర్‌ గణనాథుని లడ్డూ, ఖైరాతాబాద్‌ వినాయకుడి గురించి చర్చించుకుంటారన్నారు. గణనాథుల కృపతో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలన్నారు. శాంతియుతంగా శోభాయాత్ర జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

లడ్డూ వివరాలు
ఏడాది : రూ.లక్షల్లో
2022 : 24.60
2023 : 27
2024 : 30.01
2025 : 35
2026 : రూ.39 లక్షలు

నాలుగేళ్లుగా తపిస్తున్నా: సామ ప్రణీత్‌ రెడ్డి
బాలాపూర్‌ లడ్డూను దక్కించుకోవాలని నాలుగేళ్ల నుంచి వేలంలో పాల్గొంటున్నాను. ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలని మా కుంటుంబ సభ్యులు, అర్బన్‌ గ్రూప్‌ సభ్యుడు ఆకాంక్షించారు. గణనాథుని కృపతో ఈసారి లడ్డూ దక్కింది. బాలాపూర్‌ లడ్డూకు మంచి క్రేజ్‌ ఉంది. లడ్డూను అన్ని వర్గాల ప్రజలకు పంచి పెడుతాను. పేద ప్రజలకు సైతం లడ్డూను పంచి పెడుతాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, మాజీ ఎంపీపీ సామల రంగారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు ఎర్ర జైయింద్‌, వంగేటి ప్రభాకర్‌ రెడ్డి, ఎ.శంకర్‌రెడ్డి, దైవాజ్ఞశర్మ, రఘునందన్‌రావు, వంగేటి లక్ష్మి లక్ష్మాడ్డి, కొత్త మనోహర్‌ రెడ్డి, మనోహర్‌ శంషాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ చంద్రకళ, బడంగ్‌పేట్‌ డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్య, జల్‌పల్లి డిప్యూటీ కమిషనర్‌ వెంకట్రామ్‌ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana