Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బల్దియా టెండర్‌లో ఇంజినీర్ల ఇష్టారాజ్యం

బల్దియా టెండర్‌లో ఇంజినీర్ల ఇష్టారాజ్యం

  • రిజర్వేషన్ల పనుల్లో నిబంధనల ఉల్లంఘన
  • రోస్టర్‌ విధానాన్ని పాటించని వైనం
  • వంద పనుల్లో 24 శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కులస్తులకు కేటాయించాలన్న నిబంధన
  • చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో 78 పనుల్లో 30 అప్పగింత
  • జనరల్‌ కేటగిరీలో ఉన్న కాంట్రాక్టర్లకు తీరని అన్యాయం
  • రిజర్వేషన్ల పనులను అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు
  • టెండర్‌ నుంచి పనుల పూర్తి వరకు పర్సంటేజీ పర్వంలో అధికారులు
  • విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి : బాధిత కాంట్రాక్టర్లు

చాంద్రాయణగుట్ట సరిల్‌ పరిధిలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంజినీరింగ్‌ అధికారుల ఇష్టారాజ్యంతో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్‌ విధానానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ, తమకు అనుకూలమైన వారికి పనులు కట్టబెడుతూ అధికారులు పర్సంటేజీల పర్వంలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ 100 అభివృద్ధి పనులలో 24 శాతం పనులను ఎస్సీ, ఎస్టీ, వడ్డెర సామాజిక వర్గాలకు రోస్టర్‌ విధానంలో కేటాయించాల్సి ఉంది. అయితే చాంద్రాయణగుట్ట సరిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. ఇటీవల పిలిచిన 78 అభివృద్ధి పనుల్లో నియమాల ప్రకారం కేటాయించాల్సిన పరిమితిని దాటి, ఏకంగా 30 పనులను రిజర్వ్‌డ్‌ కేటగిరీల కింద చూపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల వైఖరితో జనరల్‌ కేటగిరీకి చెందిన కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు.

-సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) రిజర్వేషన్ల పేరుతో కేటాయించిన పనుల్లో అధిక భాగం క్షేత్రస్థాయిలో అమ్ముడుపోతున్నాయనే దారుణమైన నిజం బయటపడింది. రిజర్వేషన్ల పేరిట టెండర్లు దకించుకుని, ఆ తర్వాత ఇతర కాంట్రాక్టర్లకు పర్సంటేజీల ప్రాతిపదికన ఆ పనులను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పనులు పూర్తి చేసి బిల్లులు చెల్లించే వరకు ప్రతీ దశలోనూ ఇంజినీరింగ్‌ అధికారుల చేతులు తడుపుకొంటూ బడా సిండికేట్‌ ఈ వ్యవహారానికి తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాంద్రాయణగుట్ట సర్కిల్‌-23లో రూ.24.90 లక్షల సీసీ రోడ్డు (టెండర్‌ ఐడీ 727598/ఎస్సీ రిజర్వేషన్‌), గౌస్‌ నగర్‌లో రూ.24.55 లక్షల సీసీ రోడ్డు (ఎస్టీ కేటగిరీ/టెండర్‌ ఐడీ 727602), మిలాత్‌నగర్‌ బండ్లగూడలో రూ.21.90 లక్షల సీసీ రోడ్డు (ఎస్సీ/టెండర్‌ ఐడీ 727603), ఉస్మాన్‌ కిరాణా స్టోర్‌ ఇస్మాయిల్‌ నగర్‌లో రూ.35.40 లక్షల సీసీ రోడ్డు (ఎస్సీ/ టెండర్‌ ఐడీ 727607), నూరి నగర్‌ వార్డు 69లో రూ.29 లక్షలతో సీసీ రోడ్డు (ఎస్టీ కేటగిరి/ టెండర్‌ ఐడీ 727612), కంచన్‌బాగ్‌లో సీవర్‌ డ్రైయిన్‌, సీసీ రోడ్డుకు రూ.22 లక్షలుతో ఎస్సీ కేటగిరీకి ఇలా రోస్టర్‌ నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియను అప్పగించారు. పోటీ లేకుండా నచ్చిన వారికి ఏ మాత్రం లెస్‌లో వెళ్లకుండా జీరో కింద పనులు దకేలా టెండర్‌ నిబంధనలను సవరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

అభివృద్ధి పనుల టెండర్లలో ఎస్సీ, ఎస్టీ, వడ్డెర/సాగర (ఉప్పర) సామాజిక వర్గాలకు కాంట్రాక్టు రిజర్వేషన్లు పకాగా అమలు చేయాలని జీవో నంబరు 59 స్పష్టం చేస్తున్నది. కాంట్రాక్టు పనుల కేటాయింపులో ప్రతి 100 పనులను ఒక సైకిల్‌గా పరిగణించి రిజర్వేషన్ల రిజిస్టర్‌ను నిర్వహించాలి. ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేకుండా ఈ 100 పనుల రొటేషన్‌ నిరంతరం కొనసాగించాలి. మొత్తం 100 పనుల్లో 15 పనులు ఎస్సీలకు, 6 పనులు ఎస్టీలకు, 3 పనులు వడ్డెర/సాగర సంఘాలకు (మొత్తం 24 పనులు) కేటాయించాల్సి ఉంటుంది. 76 పనులు జనరల్‌/ఓపెన్‌ కేటగిరీ కింద ఉంటాయి. ఇందులో భాగంగానే ప్రతి 33 పనుల క్లస్టర్‌ లో కనీసం 5 పనులు ఎస్సీలకు, 2 పనులు ఎస్టీలకు, 1 పని వడ్డెర/సాగర వర్గానికి కేటాయించాలి. పనుల స్వభావం, వాటి అనుకూలతను బట్టి ఈ కేటాయింపులు చేసే పూర్తి అధికారం టెండర్‌ ఆహ్వాన అధికారులకు (డివిజన్‌/సరిల్‌/హె ఓడీ స్థాయి) ఉంటుంది. ఈ విషయంలో వారి నిర్ణయమే ఆఖరిది. ఐతే కేవలం పనుల సంఖ్యలోనే కాకుండా, కేటాయించే పనుల ఆర్థిక విలువ కూడా ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్‌ శాతానికి అనుగుణంగా ఉండేలా అధికారులు జాగ్రత్త వహించాలి. రిజర్వు చేసిన పనులకు సంబంధించి నోటీస్‌ ఇన్వైటింగ్‌ టెండర్స్‌ ప్రచురించేటప్పుడే స్పష్టమైన వివరాలు పేరొనాలి. 'ఈ పని ఎస్సీ/ఎస్టీ/వడ్డెర (సాగర/ఉప్పర) సామాజిక వర్గాలకు కేటాయించబడింది.. కాబట్టి ఆయా వర్గాల కాంట్రాక్టర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు' అని స్పష్టంగా ప్రచురించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆచరణలో మాత్రం సంబంధిత ఇంజినీర్లు ఇవేమి పాటించకుండా ఇష్టారాజ్యంగా రిజర్వేషన్ల టెండర్లను అప్పగిస్తుండడం గమనార్హం.

విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి

నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయిస్తూ, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న చాంద్రాయణగుట్ట సరిల్‌ ఇంజినీర్ల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం టెండర్ల వ్యవహారంపై, అధికారుల సిండికేట్‌ పై తక్షణమే విజిలెన్స్‌ విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana