Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం దిద్దుబాటు

బంగారం దిద్దుబాటు

  • రూ.3,200 తగ్గిన తులం ధర
  • పదినెలల కనిష్ఠానికి పడిపోయిన విలువ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31: బంగారం ధరలు దిద్దుబాటునకు గురవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి.

ప్రస్తుత పండుగ సీజన్‌ అయినప్పటికీ ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్‌ ధర ఏకంగా రూ.3,200 తగ్గి పది నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి తులం బంగారం ధర రూ.1.42 లక్షలకు పడిపోయింది.

డిసెంబర్‌ 26, 2025 తర్వాత బంగారం ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. వరుసగా రెండు రోజుల్లో గోల్డ్‌ ఏకంగా రూ.4 వేలకు పైగా తగ్గినట్టు అయింది. ఇటు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్‌ పదిగ్రాముల గోల్డ్‌ ధర రూ.3,380 తగ్గి రూ.1.38 లక్షలకు పడిపోయింది. 22 క్యారెట్‌ ధర కూడా రూ.3 వేలు తగ్గి రూ.1.27 లక్షలకు దిగొచ్చింది.

వెండిది అదే బాట

బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో వెండి వెలుగులు తగ్గిపోయాయి. కిలో వెండి ఏకంగా రూ.4,200 తగ్గి రూ.186 లక్షలకు పడిపోయింది. డిసెంబర్‌ 8, 2025 తర్వాత వెండి ధరలు ఈ స్థాయికి పడిపోవడం కూడా ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.10 వేలు తగ్గి రూ.2 లక్షలకు తగ్గింది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ఏకంగా 145.84 డాలర్లు లేదా 4 శాతం తగ్గి 3,875.55 డాలర్లకు పరిమితమైంది.

ఈ శుక్రవారం ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకున్న ధరలు మరుసటి రోజు మరింత తగ్గాయి. అక్టోబర్‌ 3, 2025న ఔన్స్‌ గోల్డ్‌ రేటు 3,887 డాలర్లుగా నమోదుకాగా, మళ్లీ ఏడాది తర్వాత ఇదే స్థాయికి పడిపోయినట్టు అయ్యాయి. వెండి ధర కూడా 3.04 డాలర్లు లేదా 6 శాతం తగ్గి 49.12 డాలర్లకు పడిపోయింది. గ్లోబల్‌ మార్కెట్లో గోల్డ్‌ 3,800 డాలర్ల స్థాయికి పడిపోగా, వెండి 50 డాలర్ల దిగువకు జారుకున్నది. మరోవైపు, గ్లోబల్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర గడిచిన ఏడాది కాలంలో 25 శాతానికి పైగా పడిపోయింది. 2026 జనవరిలో 5,600 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ గోల్డ్‌ ధర ప్రస్తుతం 4 వేల డాలర్ల దిగువకు 3,887కి పడిపోయింది. అంటే సుమారుగా 30 శాతం వరకు పడిపోయినట్టు అయింది.

  • ప్రస్తుతం భారతీయు కుటుంబాల వద్ద దాదాపు 5 ట్రిలియన్‌ డాలర్ల విలువైన బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని తొలి పది కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల కంటే ఎక్కువ.
  • 2026 రెండో త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు నికరంగా 289 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.

పడిపోవడానికి కారణాలు..

అమెరికా ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. జనవరి చివర్లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు, పదేండ్ల కాలపరిమితి గల అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడి సుమారు 4.24 శాతంగా ఉంది. అక్టోబర్‌ 5 నాటికి అది 5.31 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే పదేళ్ల బాండ్లపై రాబడి కూడా 2.92 శాతానికి చేరింది. ఇది 2008లో నమోదైన రికార్డు స్థాయికి దగ్గరగా ఉన్నది.

భారత్‌లో ఈ ధరల దిద్దుబాటు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ధరల పతనానికి కారణమైన ఒత్తిడి క్రమంగా తగ్గుతున్నది. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథం ఉన్న కొనుగోలుదారులు కొనుగోళ్లను కొనసాగిస్తుండటం ధరలు మరింత దించాయి.

– సచిన్‌ సావ్రికర్‌, అర్థ భారత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఐఎఫ్‌ఎస్‌సీ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana