Tuesday, 28 Sep, 4.27 am నమస్తే తెలంగాణ

బిజినెస్‌
భారత్‌లో చిప్‌ ప్లాంట్‌!

  • రూ.55,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు
  • మెగా డీల్‌ కోసం తైవాన్‌తో చర్చిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 27: దేశంలో చిప్‌ తయారీ ప్లాంట్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెమీకండక్టర్‌ చిప్‌ కొరత వేధిస్తున్న నేపథ్యంలో భారత్‌లో చిప్‌ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తైవాన్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. ఇరు దేశాల మధ్య గట్టిగానే జరుగుతున్న ఈ చర్చలు ఫలప్రదమైతే దేశీయంగా రూ.55,400 కోట్ల (7.5 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులతో చిప్‌ తయారీ ప్లాంట్‌ కొలువుదీరుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కొరత సమస్య కనిపిస్తున్నది. ఈ క్రమంలో భారత్‌-తైవాన్‌ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎందుకీ కొరత?
ప్రపంచ నేతలు, బహుళజాతి సంస్థల ఉన్నతాధికారులను చిప్‌ల కొరత ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నది. అయితే ఈ పరిస్థితి వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌తో వచ్చిన వర్క్‌ ఫ్రం హోంల వల్ల పెరిగిన ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల వినియోగమైతే.. మరొకటి అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు. ఇంటి దగ్గర్నుంచే పని కారణంగా ల్యాప్‌ట్యాప్స్‌, స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అయితే అందుకు తగ్గ చిప్‌ల తయారీ మాత్రం పెరుగలేదు. చిప్‌ల తయారీ అన్నది ఒక సంక్లిష్ట ప్రక్రియ. అది నెలల సమయం తీసుకుంటుంది. అందుకే ఆకస్మిక డిమాండ్లకు సరిపడా అందవు. ఇక చైనా టెక్నాలజీ దిగ్గజం హువావీపై అమెరికా నిషేధం కూడా చిప్‌ల కొరతను పెంచేసింది. ఈ క్రమంలోనే సామ్‌సంగ్‌ సైతం సొంతంగా చిప్‌ల తయారీకి భారీ పెట్టుబడుతో ప్రణాళికల్ని రూపొందిస్తుండగా, దీర్ఘకాలంలో పరిశ్రమకు ఇది ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకింత ప్రాధాన్యం?

5జీ మొబైల్స్‌ దగ్గర్నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదాకా చిప్‌ల అవసరం ఎంతో ఉన్నది. చూడటానికి చిన్నగానే ఉన్నా ఇది లేకపోతే ఆటో, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్‌, టెలివిజన్‌, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషీన్‌, మైక్రోవేవ్‌ అవెన్స్‌, గేమింగ్‌ పరికరాలుసహా మరెన్నో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ ఆగిపోతుంది. పవరింగ్‌ డిస్‌ప్లేస్‌, ట్రాన్స్‌ఫరింగ్‌ డాటా వంటి కీలక పనులు చిప్‌ల ద్వారానే జరుగుతాయి. చిప్‌లు లేక ఆటో అమ్మకాలే ఆగస్టులో 11 శాతం పడిపోయినట్లు సియామ్‌ చెప్తున్నది. మారు సుజుకీ 60 శాతం, మహీంద్రా 25 శాతం వరకు ఉత్పత్తిని తగ్గించుకున్న విషయం తెలిసిందే. అలాగే ఐఫోన్లు, ఐప్యాడ్ల అమ్మకాలను దెబ్బతీస్తున్నదని యాపిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రిలయన్స్‌ జియో సైతం తమ 5జీ మొబైల్‌ ఆవిష్కరణను చిప్‌ కొరతతోనే వాయిదా వేసుకున్నది.

భారీ ప్రోత్సాహకాలు
దేశంలో చిప్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి తైవాన్‌కు కేంద్రం భారీ ప్రోత్సాహకాలనే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు అనువైన స్థలం, నీటి వనరులతోపాటు మానవ శక్తిపైనా ఇప్పటికే కేంద్రం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. పన్నుల ప్రోత్సాహకాలు, రాయితీలతోపాటు మూలధన వ్యయంలో 50 శాతం భరించేందుకూ రెడీ అయినట్లు సమాచారం. భారత్‌లో చిప్‌ తయారీ ప్లాంట్‌ వస్తే.. అది దక్షిణాసియా దేశాలకు చిప్‌ సరఫరాలో అత్యంత కీలకం అవుతుంది. పైగా ఈ రంగంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకున్నట్లు కూడా అవుతుంది. అందుకే ప్రపంచ చిప్‌ తయారీ మార్కెట్‌లో 56 శాతం వాటా కలిగిన తైవాన్‌తో దోస్తీ కట్టేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం క్వాల్‌కామ్‌, యాపిల్‌, నివ్‌డియా వంటి అగ్రశ్రేణి సంస్థలకు చిప్‌లను సరఫరా చేస్తున్నది తైవాన్‌ సెమీకండక్టర్‌ తయారీ కార్పొరేషనే.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top