Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bhatti Vikramakra | 15 రోజుల్లో రెండోసారి ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి.. కుర్చీ కాపాడుకునేందుకు పాట్లు !

Bhatti Vikramakra | 15 రోజుల్లో రెండోసారి ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి.. కుర్చీ కాపాడుకునేందుకు పాట్లు !

Bhatti Vikramakra | న్యూఢిల్లీ, జూన్‌1 (నమస్తే తెలంగాణ) : పదవీ గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు.

సోమవారం ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి. బయటకు వేర్వేరు కారణాలు చెప్తున్నా అంతర్గతంగా ఆయన పదవిని కాపాడుకొనేందుకే ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పాత క్యాబినెట్‌ ప్రక్షాళన ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు విశ్వసిస్తున్నారు. ఈసారి క్యాబినెట్‌ నుంచి భట్టిని తప్పించి స్పీకర్‌ స్థానంలో కూర్చోబెడుతారని, ఆయన స్థానాన్ని అదే సామాజిక వర్గం నేతకు కట్టబెట్టే అవకాశం ఉన్నదని జరుగుతున్న ప్రచారంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు భట్టి సన్నిహితులు చెప్తున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను భట్టి కలిశారు. జార్ఖండ్‌ రాజకీయ పరిణామాలకు సంబంధించి వారికి నివేదిక సమర్పించినట్టు భట్టి విక్రమార్క కార్యాలయం మీడియాకు వివరించింది. అయితే ఉన్నపళంగా జార్ఖండ్‌ పరిశీలకుడిగా పంపడం భట్టిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

పుండుమీద కారం చల్లినట్టు జార్ఖండ్‌కు..

జార్ఖండ్‌ రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ మరణంతో ఒక సీటు ఖాళీ కాగా, బీజేపీ ఎంపీ దీపక్‌ ప్రకాశ్‌ పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తుండటంతో రెండో సీటు ఖాళీ అయింది. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానం నుంచి కాంగ్రెస్‌ తమ అభ్యర్ధిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నది. ఈనేపథ్యంలో అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించడం కోసం అధిష్ఠానం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను జార్కండ్‌కు పంపింది. అయితే తనను జార్ఖండ్‌కు పంపడం, నివేదిక అడగటంపైనే భట్టి ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. పుండు మీద కారం చల్లినట్టు మంత్రివర్గ ప్రక్షాళన అని ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలోనే తననే ఏరికోరి ఎందుకు పంపినట్టు ఆని ఆలోచనలో పడ్డట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

భట్టిని క్యాబినెట్‌ నుంచి తప్పించి ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని, స్పీకర్‌ బాధ్యతలను భట్టికి అప్పగించాలని ముఖ్యనేత ఢిల్లీకి ప్రతిపాదనలు పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే గడ్డం ప్రసాద్‌ రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేసి కార్యాన్ని చకదిద్దుకున్నట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం గడ్డం ప్రసాద్‌ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ద్వారా చక్రం తిప్పిన ముఖ్యనేత, ఢిల్లీలో గడ్డం ప్రసాద్‌కు అవసరమైన సానుకూల వాతావరణాన్ని రూపొందించినట్టుగా ఢిల్లీ కాంగ్రెస్‌ శ్రేణులు చెప్తున్నారు.

వలస నేతలను ప్రోత్సహించేందుకే..

భట్టి స్పీకర్‌ పదవిని తీసుకోవడానికి నిరాకరిస్తే..తదుపరి కర్తవ్యం ఏమిటనే చర్చ జరిగినట్టు కాంగ్రెస్‌ శ్రేణులు చెప్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే ఆయనను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి దేశ రాజకీయాల్లోకి ఆహ్వానించాలని, ఏఐసీసీలో గానీ, సీడబ్ల్యూసీలో గానీ బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కావాల్సిన తనపై విషప్రచారం చేశారని, తనను పూర్తిగా తొలగించడం కోసం తనమీద తన సామాజికవర్గం నేతనే ప్రయోగిస్తున్నారని మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ ఎదుట భట్టి ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం.

ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. జార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలపై ఖర్గేకు నివేదిక అందజేశారు. జార్ఖండ్‌లో త్వరలో జరుగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో జరిపిన చర్చల వివరాలను ఖర్గేకు వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana