Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూములే జీవనాధారం

భూములే జీవనాధారం

  • అవి లేకుంటే బతకలేం
  • ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్‌ పార్కుకు భూములు ఇచ్చేదిలేదు
  • ప్రజాభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పిన కొండాయపల్లివాసులు

దోమ, మే 29 : ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్‌ పార్కుకు తమ భూములను ఇచ్చేది లేదని కొండాయపల్లి వాసులు తేల్చిచెప్పారు.

కొండాయపల్లిలో టీజీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఫాం-సీ నోటీసు జారీ చేయగా.. శుక్రవారం వికారాబాద్‌ ఆర్డీవో వాసుచంద్ర ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ ఏర్పాటు చేశారు. మొదటగా ఈ సభకు వచ్చేందుకు రైతులు నిరాకరించి.. ఆలస్యంగా హాజరయ్యారు. గ్రామంలో అసైన్డ్‌ భూమి 96 ఎకరాలు, పట్టా భూములు 360 ఎకరాలు కలిపి 456.26 ఎకరాలు ఇండస్ట్రియల్‌ పా ర్కుకు పోతుండగా అందులో 221 మంది పట్టాదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా ఆర్టీవో వాసుచంద్ర, టీజీఐఐసీ జనరల్‌ మేనేజర్‌ శేషగిరిరావు మాట్లాడుతూ.. కాలుష్యం లేని పరిశ్రమలైన ఫుడ్‌, ఇంజినీరింగ్‌, బిల్డింగ్‌ మెటీరియల్‌ తదితర పరిశ్రమలను తీసుకొచ్చి.. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇస్తామన్నారు. ఎయిర్‌, వాటర్‌ పొల్యూషన్‌ జరగకుండా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తారని, సోషియో ఎకనమిక్‌ సర్వే అనంతరం రైతుల భూముల నుంచి పార్కు నిర్మాణానికి ఎంత భూమి పోతుంతో మిగిలేది ఎంతో తెలుస్తుందని.. దాని ఆధారంగానే రైతులకు ప్యాకేజీలు నిర్ణయిస్తారన్నారు. రైతులకు ఇచ్చే పరిహారాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ నిర్ణయిస్తుందన్నారు. కాగా, మెజారిటీ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్‌ పార్కుకు ఇచ్చేదిలేదన్నారు.

భూములు పోతే తాము బతకలేమని.. వందల కుటుంబాలు రోడ్డునపడతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక పార్కు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాల ని డిమాండ్‌ చేశారు. మా గ్రామానికి ఆనుకొని ఉన్న కొడంగల్‌ నియోజకవర్గంలోని పోలేపల్లిలోని భూములను ఎందుకు తీసుకోవడం లేదని.. వారికో న్యాయం.. మాకో న్యా యమా అని అధికారులను ప్రశ్నించారు. అనంతరం గ్రామసభ మినిట్స్‌ బుక్స్‌ కొంద రు సంతకాలు చేయగా చాలా మంది రైతులు సంతకాలు చేయలేదు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆనందవెంకటయ్య, తహసీల్దార్‌ గోవిందమ్మ, రెవెన్యు సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, పోలీసులు గ్రామ వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.

పేదల భూములు లాక్కుంటారా?

201, 202 సర్వేనంబర్లలో ఉన్న రెండెకరాల భూమి ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి పో తే నేను, నా కుటుంబం ఎలా బతికేది? ఫాం-సీ నోటీసులు జారీ చేసిన అధికారులు ఎం దుకు చట్ట ప్రకారం నడుచుకోవడంలేదు. 2013 చట్టం ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుంటే వాటి యజమానులకు భూములకు భూములివ్వాలని ఉన్నా మీరు చట్టాలను తుంగలో తొక్కి పేద ల భూములు ఎందుకు గుంజుకుంటున్నా రు. భూములను ప్రజల అంగీకారంతోనే తీసుకోవాలి.

-శివకుమార్‌, రైతు, కొండాయపల్లి, దోమ

భూములు ఇవ్వను అని చెప్పడంతో నాపై పోలీసుల నిఘా

మేము ముగ్గురం అన్నదమ్ములం. మాకు 50 ఎకరాల భూమి ఉన్నది. పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో తమ భూమి పోతుందని తెలుసుకుని కొన్ని రోజుల కిందట.. ప్రభుత్వానికి భూమి ఇచ్చేదిలేదని తహసీల్దార్‌కు ఫిర్యాదు కాపీ ఇచ్చి బయటికి రాకముందే నాకు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పటి నుంచి పోలీసులు నా వెంటే తిరుగుతున్నారు. నేనేమైనా చోరీ చేశానా..? నా వెంట పోలీసుల నిఘా ఎంటీ .. భూములను వదిలి బయటికెళ్లి జీవించలేం. భూములను పార్కుకు ఇచ్చే ప్రసక్తే లేదు.

-భీమయ్య, రైతు, కొండాయపల్లి, దోమ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana