Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూసేకరణ చేయకపోవడంతో వనదుర్గ ఆనకట్ట ఎత్తు పనులు పెండింగ్‌

భూసేకరణ చేయకపోవడంతో వనదుర్గ ఆనకట్ట ఎత్తు పనులు పెండింగ్‌

  • ఏటా రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
  • కాలువల మరమ్మతులకు మోక్షం లభించేనా
  • సాగునీటి కాలువలకు కమ్మేసిన పిచ్చి మొక్కలు
  • రెండేండ్లుగా మరమ్మతులు కరువు
  • బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచేందుకు రూ.
  • 43.64 కోట్లు మంజూరు
  • వానకాలం సమీపిస్తున్నాసాగునీటి కాలువలకు మరమ్మతులు కరువు

మెదక్‌, మే 29(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మెదక్‌ జిల్లా పాపన్నపేట-కొల్చారం మండలాల్లోని వనదుర్గా (ఘనపూర్‌) ప్రాజెక్టు ఆనకట్ట పెంపును రేవంత్‌ సర్కారు పట్టించుకోవడం లేదు. ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంచితే రైతుల భూములు నీట మునుగుతాయి. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు మంజూరయ్యాయి. బీఆర్‌ఎస్‌ హయాంలోనే వనదుర్గా ప్రాజెక్టు ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ. 43.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. నీటిపారుద శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టరుకు పనులు అప్పుగించారు.

కాంట్రాక్టరు ప్రాజెక్టుకు రక్షణ పనులు చేపట్టడంతో నీటిపారుద శాఖ అధికారులు రూ. 18 కోట్ల వరకు చెల్లించారు. రైతుల నుంచి భూసేకరణకు రూ. 13.10 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. భూ సేకరణ కోసం ఇప్పటి వరకు రైతులకు రూ. 5 కోట్లు చెల్లించారు. ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచేందుకు రైతుల నుంచి 190 ఎకరాల భూసేకరణకు, పూర్తిస్థాయిలో చేయకపోవడంతో పనులు పెండింగ్‌ పడ్డాయి. రెవెన్యూ అధికారులు నిధులు ఉన్నా భూసేకరణ పూర్తి చేయడం లేదు. దీంతో ప్రాజెక్టు ఎత్తు పెంచే పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఘనపూర్‌ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి కట్ట ఎత్తు పెంచితే 30 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం 21.625 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ప్రతి ఏడాది భారీ వర్షాలు పడిన సమయంలో ప్రాజెక్టు నిండి వరద దిగువకు పరవళ్లు తొక్కు తూ వెళ్తున్నది. వానకాలంలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వానికి పలుసార్లు కోరినా పట్టించుకోవడం లేదు.

పేరుకుపోయిన పూడిక

ఘనపూర్‌ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో ఆనకట్ట అధ్వానంగా మారింది. పూడిక నిండి నీటినిల్వ సామర్ధ్యం తగ్గిపోయింది. వర్షాకాలంలో ప్రాజెక్టు నిండి వరద దిగువకు వెళ్లిపోతున్నది. వానకాలానికి ముందు పూడిక తీసి నీటిమట్టం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏటా ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో సింగూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తేనే ఆయకట్టు కింద పంటలు దక్కే పరిస్థితి ఉంది. నీటి పారుదల శాఖ అధికారులు సాగునీటి కాలువలకు, తూములకు, అలుగుకు మరమ్మతులు చేయ డం లేదు. ప్రాజెక్టులో పూడిక పెరిగిపోయినా పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు నష్టం జరుగుతున్నది.

భూ సేకరణలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం

వనదుర్గా (ఘనపూర్‌) ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 43.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచే పనులు పెండింగ్‌లో పెట్టింది. రైతుల నుంచి 190 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసి, రూ. 13.10 కోట్లు నిధులు విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులకు రూ. 5 కోట్లు చెల్లించారు. రెవెన్యూ అధికారులు భూసేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతులకు భూ పరిహారం చెల్లించకపోవడంతో పాటు భూములను నిషేధిత జాబితాలో రెవెన్యూ శాఖ పెట్టింది. రైతులు పలుసార్లు మెదక్‌ కలెక్టర్‌ను కలిసి నష్ట పరిహారం చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదు. పాపన్నపేట, కొల్చారం మండలాలకు చెందిన రైతుల భూములు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్నాయి. రైతులకు నష్ట పరిహారం చెల్లించక పోవడంతో కొందరు రైతులు కోర్టుకు పోయారు. దీంతో ప్రాజెక్టు పనుల్లో పురోగతి కరువైంది.

సాగునీటి కాలువల మరమ్మతులకు నిధులు కరువు

ఘనపూర్‌ ప్రాజెక్టు కింద ఎడమ కాలువ, కుడి కాలువలు రెండు ఉన్నాయి. ఈ కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కాలువల్లో మట్టి పేరుకుపోయింది. దీంతో సాగునీరు సక్రమంగా అందడం లేదు. నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతి ఏడాది కాలువలకు తాత్కాలిక మరమ్మతులు చేసి, నిధులు ఖర్చు చేస్తు న్నా ప్రయోజనం ఉండడం లేదు. కాలువలు మరమ్మతులు నాణ్యతో చేయాలని రైతు లు డిమాండ్‌ చేస్తున్నారు. కొన్నిచోట్ల కాలువకు లీకేజీలు ఉన్నా మరమ్మతులు చేయకపోవడంతో నీటి వృథా జరుగుతున్నది. చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఘనపూర్‌ ప్రాజెక్టు కట్ట ఎత్తు పనులు పూర్తి చేయడంలో ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం
లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

భూసేకరణ పూర్తికాగానే పనులు చేపడతాం..

ఘనపూర్‌ ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచేందుకు నిధులు ఉన్నా, భూసేకరణ పూర్తి స్థాయిలో కాకపోవడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు కట్టకు రక్షణ పనులు చేశాం. మట్టి కట్ట పనులు చేయాల్సి ఉంది. రక్షణ పనులు చేసి కాంట్రాక్టరుకు రూ. 18 కోట్ల చెల్లించాం. సాగునీటి కాలువలకు మరమ్మతులు చేస్తు న్నాం. భూసేకరణ చేయగానే కట్ట ఎత్తు పను లు ప్రారంభిస్తాం.

– శివనాగరాజు, డీఈఈ, నీటిపారుదల శాఖ, మెదక్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana