Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ పాలనలో 4 రెట్లు పెరిగిన రేప్‌లు

బీజేపీ పాలనలో 4 రెట్లు పెరిగిన రేప్‌లు

  • 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు
  • అకృత్యాలకు పాల్పడుతున్నది బాధితులకు తెలిసిన వారే
  • న్యాయస్థానాల్లోనూ భారీగాపేరుకుపోతున్న కేసులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25: దేశంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గత దశాబ్ద కాలంగా బాలికలపై లైంగిక దాడులు నాలుగు రెట్లు పెరిగాయి.

తాజాగా బీహార్‌లోని జమూయీ, సమస్తిపూర్‌, బంకా, ఢిల్లీలోని కల్కాజీ, ఒడిశాలోని ధెంకనాల్‌లలో లైంగిక దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చిన క్రమంలో దేశవ్యాప్తంగా బాలికల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతున్నది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన డాటా ప్రకారం గత దశాబ్ద కాలంగా 18 ఏండ్ల లోపు బాలికలపై లైంగిక అకృత్యాలు గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో అతి తక్కువ కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ తెలిపిన వివరాల ప్రకారం 2015లో 18 ఏండ్ల లోపు బాలికలపై లైంగిక దాడి కేసులు 10,934 నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 43,675కు అంటే నాలుగు రెట్లు పెరిగింది.

శిక్షలు అంతంతే..
2020 నుంచి 2024 వరకు బాలికలపై 1.83 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. అదే ఐదేండ్ల కాలంలో 96,505 లైంగిక దాడి కేసులు, 12,807 లైంగిక వేధింపు కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో పిల్లలను అశ్లీలత కోసం వినియోగించిన కేసులు 2,924, ఇతర లైంగిక నేరాల విభాగాల కింద 3,034 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక వైపు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండగా, న్యాయస్థానాల్లో కూడా అదే తరహాలో ఆ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

బాలికలపై లైంగిక దాడికి సంబంధించి 2024లో 30 శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడగా, 86 శాతం కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా పలు లైంగిక దాడి కేసుల్లో బంధువులు, సమీపంలోని వారు, వారికి తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. 2024లో లైంగిక దాడికి గురైన బాలికల్లో 97 శాతం కేసుల్లో నిందితులు వారికి తెలిసిన వారేనని డాటా చెబుతున్నది. ఇందులో బంధువులు, స్నేహితులు, రక్తసంబంధీకులు, ఇరుగుపొరుగు వారు, సామాజిక మాధ్యమాల్లో పరిచయం అయిన వారు, పెండ్లి పేరుతో ప్రలోభానికి గురి చేసిన వారు ఉన్నారు. కాబట్టి బాలికలకు ఎక్కడో కనబడకుండా కాకుండా కళ్లముందే, పరిసరాల్లోనే ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఈ డాటా వెల్లడిస్తున్నది.

బీహార్‌లో మరో వేధింపుల ఘటన
బీహార్‌లో మరో వేధింపుల ఘటన వైరల్‌గా మారింది. బాంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందార్‌ హిల్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. జముయి, సమస్తిపూర్‌ ఘటనలు వెలుగులోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు యువకులు కలిసి.. తనను తన స్నేహితులను దుర్భాషలాడి బెదిరించారని, తనతో అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

జూన్‌ 3న ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్‌ 22న కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల్లో అబ్దుల్లా ఆనే వ్యక్తి బాధితురాలి స్నేహితుడి ఖాతా నుంచి రూ.1,500 బదిలీ చేయించుకున్నాడు. అనంతరం వారిని అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించినట్లు ఆరోపణలున్నాయి. మరో ఇద్దరు నిందితులను నితీశ్‌ కుమార్‌ రాయ్‌, వికాస్‌ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ, బాధితురాలి గుర్తింపును వెల్లడించేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana