Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీతో ఒప్పందంతోనే పవన్‌ సభ

బీజేపీతో ఒప్పందంతోనే పవన్‌ సభ

  • తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు పెంచుతున్నారు
  • క్షమాపణ చెప్పాకే తెలంగాణలో నవనిర్మాణ సభ నిర్వహించాలి
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజం

హుస్నాబాద్‌టౌన్‌, జూన్‌ 1: తెలంగాణ అస్తిత్వం, అత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్‌కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే 11రోజులు భోజనం చేయలేదని చెబుతూనే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని పవన్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి రెమ్యునరేషన్‌తీసుకోకుండా ఇక్కడకు రాలేదని కొండగట్టు అంజన్నస్వామిపై ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన పవన్‌కల్యాణ్‌ తెలంగాణ అవిర్భావ దిన సభరోజున నవనిర్మాణ సభను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే ఎలాంటి నటననైనా చేసే పవన్‌కల్యాణ్‌ తెలంగాణపై నోరుపారేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నవనిర్మాణ సభను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీకి తెలంగాణను తాకట్టుపెట్టేందుకే నవనిర్మాణ సభను ఇక్కడ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్వేషి పవన్‌కల్యాణ్‌ విద్వేష రాజకీయాలు చేస్తే సహించేదిలేదని, బీజేపీ పప్పులు ఇక్కడ ఉడకవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుంటే మాట్లాడకుండా తెలంగాణపై విషం కక్కుతున్నాడని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు పవన్‌కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana