Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బియ్యం అటు.. వడ్లు ఇటు..?

బియ్యం అటు.. వడ్లు ఇటు..?

  • పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందా
  • ఇక్కడి పీడీఎస్‌ బియ్యం మహారాష్ట్రకు..
  • అక్కడి వడ్లు ఇక్కడకు
  • మంథని కేంద్రంగా అక్రమ వ్యాపారం
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  • రూ.కోట్లు సంపాదిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా?
  • పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్‌ విచారణలో వెలుగులోకి!
  • అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ.. ఎనిమిది లారీలు సీజ్‌
  • త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం

ధాన్యం కొనుగోళ్ల వేళ పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందాకు తెరలేచింది. ఇక్కడి పీడీఎస్‌ బియ్యం తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుండగా.. మహారాష్ట్రలో తక్కువ ధరకు వడ్లను కొని ఇక్కడకు తీసుకొచ్చి మద్దతు ధరతో అమ్ముతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. ఆరుగురు సభ్యులు ఉన్న ఒక ముఠా ఈ అక్రమ వ్యాపారానికి తెరలేపి రూ.కోట్లు సంపాదిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల తెలంగాణ పౌరసరఫరాల శాఖ టాస్క్‌ ఫోర్స్‌ దాడులతో ఈ దందా వ్యవహారం బట్టబయలైనట్టు తెలియగా, త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశమున్నది.

పెద్దపల్లి, మే 22 (నమస్తే తెలంగాణ) : రేషన్‌ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలలోని రేషన్‌షాపులు, లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.15 నుంచి రూ.16కు సేకరించి వాటిని లారీల్లో మహారాష్ట్రలోని సిరోంచకు తరలిస్తున్నారు. అలా ఒక్క లారీ రాత్రి వేళలో బయలు దేరి అక్కడ బియ్యాన్ని అన్‌లోడ్‌ చేసి కిలోకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు ఒక లారీ 25 టన్నులతో బియ్యం వెళ్తుండగా, కిలోకు రూ.6 చొప్పున రూ.1.50 లక్షలు అక్రమంగా దండుకుంటున్నారు.

అంతే కాకుండా, మహారాష్ట్రలోని సిరోంచలో నిర్వహించే టెండర్లలో రైస్‌ మిల్లు యజమానులు అక్కడి రైతుల నుంచి ధాన్యం క్వింటాలుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు కొనుగోలు చేస్తుండగా, ఆ ధాన్యాన్ని తిరిగి తెలంగాణకు వచ్చే లారీలో సరిహద్దులు దాటిస్తున్నారు. అలా వచ్చిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రూ. 2369కు విక్రయిస్తున్నారు. అందుకు ఈ ధాన్యం ఇక్కడిదే అన్నట్టుగా అధికారుల సాయంతో మంథని ప్రాంతంలో బినామీ రైతుల పేరిట ధ్రువపత్రాలతో విక్రయిస్తున్నారు. ఇలా క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1100 వరకు అదనంగా ఒక్కో లారీకి సుమారు రూ.2 లక్షల వరకు సొమ్ము చేసుకొంటున్నారు.

ఇలా రెండు వైపులా సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మరోవైపు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలకు నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు పచ్చి ధాన్యాన్ని రూ.1800 నుంచి రూ.1900కు దళారులకు విక్రయిస్తుండగా, ఈ ధాన్యాన్ని మంథని ప్రాంతంలో రైతులు విక్రయించినట్టు తప్పుడు ధ్రువపత్రాలతో మిల్లులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పగటి వేలలో బియ్యం సేకరించి, ఒక చోట స్టోర్‌ చేసి రాత్రి వేళలో లారీల్లో మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ చెక్‌పోస్టు, కాటారం, మహదేవపూర్‌ మీదుగా కాళేశ్వరం వద్ద వంతెన పైనుంచి గోదావరి దాటిస్తున్నారు.

ఆరుగురు సభ్యుల ముఠా దందా

ఈ దందాకు ఒక ప్రత్యేకమైన ముఠా పనిచేస్తున్నది. అందులో మంథని పీఏసీఎస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి, ట్యాబ్‌ ఆపరేటర్‌ కీలకంగా పనిచేస్తున్నారు. మంథని ప్రాంతంలోని ఒక ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన మరికొంత మందితో కుమ్మక్కై, సూపర్‌ వైజర్‌ తనకు సొంతంగా ఉన్న మూడు లారీల ద్వారా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది.

సిరోంచ ధాన్యం సీజ్‌

మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగో లు చేసిన వడ్లను మంథని పీఏసీఎస్‌ పరిధిలోని మల్లెపల్లి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొన్నట్టుగా ట్రక్‌షీట్లు సృష్టించారు. ఆ తర్వాత సుల్తానాబాద్‌ రైస్‌మిల్లులకు తరలించి అక్రమాలకు తెరతీశారు. భూపాలపల్లి జిల్లా గంగారం ధన్‌వాడ ప్రాంతాల్లో అకాల వర్షాల దృష్ట్యా రైతుల నుంచి తకువ ధా న్యాన్ని కొని మంథని మండలంలో కొన్నట్టు తప్పుడు ధ్రువపత్రాలతో రైస్‌ మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల టాస్‌ఫోర్స్‌ అధికారులు ఇటీవల మంథని మండలంలోని మల్లెపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం లో తనిఖీలు చేసినట్టు తెలిసింది.

మూడు లారీల్లో తప్పుడు ట్రక్‌ షీట్లతో ధాన్యాన్ని సుల్తానాబాద్‌ రైస్‌ మిల్లుకు తరలించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మల్లెపల్లి కొనుగోలు కేంద్రానికి చెందిన ట్రక్ట్‌ రికార్డును అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ జరిపి, వారం రోజులుగా తనిఖీలు చేసి, పీఏసీఎస్‌ అధికారులు సిబ్బందిని విచారించి, అక్రమాలు జరిగాయని నిర్ధారించినట్టు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి వచ్చిన ఎనిమిది లారీల ధాన్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశమున్నది.

అక్రమాలు నిజమే..

మహారాష్ట్రలోని సిరోంచ నుంచి పెద్దపల్లి జిల్లాకు వడ్లు వచ్చిన మాట నిజమే. ఈ విషయం పూర్తిగా పౌరసరఫరాల శాఖ టాస్క్‌ ఫోర్స్‌ పరిధిలో ఉంది. ఎనిమిది లారీలకు సంబంధించిన ధాన్యాన్ని సీజ్‌ చేశారు. మంథని మండలం మల్లెపల్లి కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్‌ షీట్లను సృష్టించి ధాన్యం కొనుగోలు చేసి సుల్తానాబాద్‌కు పంపించారు. ఆ వడ్లను సీజ్‌ చేశాం. రేపో మాపో వివరాలను పౌరసరఫరాల శాఖ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు వెల్లడిస్తారు.

– శ్రీనాథ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి (పెద్దపల్లి)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana