- l సెంటిమెంట్ నెలకే పరిమితం
- l తగ్గని చైనా ఫోన్ల అమ్మకాలు
- l ఇప్పటికీ వాటిదే హవా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: 'చైనా ఉత్పత్తులను బహిష్కరించండి.. బ్యాన్ చైనా.. క్విట్ చైనా ప్రొడక్ట్స్' దాదాపు నెలన్నర క్రితం దేశవ్యాప్తంగా మార్మోగిన నినాదం. అనేక ప్రాంతాల్లో ర్యాలీలు తీయడంతోపాటు, చైనా ఉత్పత్తులమ్మే దుకాణాలపైనా దాడులు జరిగాయి. కొందరు చైనా టీవీలను పగులగొట్టి హల్‌చల్ చేశారు. చైనా బజార్లు కాస్తా.. ఇండియన్ బజార్లుగా పేర్లు మార్చుకొన్నాయి. ఇదంతా నెల రోజుల వరకే పరిమితమయింది. దేశంలోకి వచ్చే చైనా ఉత్పత్తుల వరదలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా సెల్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పటికీ చైనా కంపెనీలే మార్కెట్ లీడ్ చేస్తున్నాయి.
చిన్న ఫోన్ల అమ్మకాల్లోనే తగ్గుదల
లాక్‌డౌన్‌కు ముందు దేశంలోని మొబైల్ అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా 81శాతం. జూలైలో ఇది 72 శాతానికి తగ్గింది. అంటే కేవలం 9 శాతం. అయితే ఒప్పో, వివో, ఎంఐ వంటి బడాసంస్థల అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. చిన్నసంస్థలకు చెందిన ఫోన్ల సేల్స్ మాత్రమే పడిపోయాయని అమ్మకందారులు చెప్తున్నారు. ప్రజలు ఇప్పటికీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్లవైపే మొగ్గుచూపుతున్నారని చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) అమ్మకాల్లో ఎంఐ మార్కెట్ లీడర్‌గా కొనసాగడం ఇందుకు ఉదాహరణ. మరోవైపు చైనా వ్యతిరేకత సామ్‌సంగ్‌కు కలిసొచ్చింది. ఫోన్ల అమ్మకాలు కొవిడ్‌కు ముందుతో పోల్చితే 94 శాతానికి పెరిగాయని సంస్థ తెలిపింది.
కొత్త మోడల్స్‌తో ముంచెత్తుతున్నాయి
చైనా వ్యతిరేకత తగ్గిందనే నిర్ణయానికి వచ్చిన కంపెనీలు.. కొత్త మోడళ్లతో మార్కెట్‌ను ముంచెత్తడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెడ్‌మీ, వివో కొత్త సిరీస్‌లను లాంచ్ చేశాయి. పంద్రాగస్టుకు మరో రెండు మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు నిర్వహించే ఆఫర్ సేల్స్‌లో చైనా మొబైల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఫిల్టర్ ఆప్షన్ ఎంచుకొని చైనా కంపెనీలను తీసేస్తే.. వినియోగదారులకు శామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి ఒకటి రెండు తెలిసిన పేర్లు తప్ప పెద్దగా వేరే ఉత్పత్తులు కనిపించడం లేదు. దీనినిబట్టి చైనా వ్యతిరేకత నెలన్నర రోజుల నినాదానికి మాత్రమే పరిమితమైందని, చైనా ఉత్పత్తులు లేకుండా అనేకరంగాలను ఊహించలేమని నిపుణులు పేర్కొంటున్నారు.

