Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi | జీవీ నారాయణరావుకి నివాళులు అర్పించిన చిరంజీవి..అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగం

Chiranjeevi | జీవీ నారాయణరావుకి నివాళులు అర్పించిన చిరంజీవి..అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగం

Chiranjeevi | తెలుగు సినీ, రంగస్థల నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఉంచిన ఆయన పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జీవీ నారాయణరావుతో తనకు 1977 నుంచే పరిచయం ఉందని చిరంజీవి తెలిపారు. తాను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న రోజుల్లో నారాయణరావు సీనియర్ విద్యార్థిగా తరగతులకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ మధ్య స్నేహం మరింత బలపడిందని చెప్పారు.

"నారాయణరావు లేరు అనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనతో నాకు చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది. ఏ పని అనుకున్నా పూర్తి చేసేంత పట్టుదల ఆయనలో ఉండేది. సినీ రంగంపై ఆయనకున్న ప్రేమ, అంకితభావం ఎంతో ప్రత్యేకమైనవి" అని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవలే నారాయణరావు తనను కలిసిన విషయాన్ని కూడా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చాలా కాలం తర్వాత 'మంచు పల్లకి' చిత్రానికి స్ఫూర్తితో ఐదుగురు యువకులు, పెద్దవాళ్లుగా మారితే వారి జీవితం ఎలా ఉంటుంది అనే కథతో ఒక సినిమా తెరకెక్కించానని నారాయణరావు తనతో చెప్పారని తెలిపారు. ఆ సినిమా ట్రైలర్ లాంచ్‌కు తన సహకారం కావాలని కోరారని, తప్పకుండా చేస్తానని తాను హామీ ఇచ్చానని చిరంజీవి చెప్పారు.

అదే సమయంలో ఇద్దరం కలిసి ఓ ఫొటో దిగుదామని నారాయణరావు అడిగారని చిరంజీవి వెల్లడించారు. "బహుశా అదే ఆయన చివరి సినిమా అయి ఉండొచ్చు. ఆ సమయంలో చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాను. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందని అసలు ఊహించలేదు" అంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న జీవీ నారాయణరావు.. చిరంజీవితో కలిసి పలు చిత్రాల్లో పనిచేశారు. ముఖ్యంగా 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' వంటి సినిమాలతో నిర్మాతగా విజయాలు అందుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.చివరగా జీవీ నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చిరంజీవి.. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana