బొగోటా: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రత నమోదైంది. భారీగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.
ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. (Colombia earthquake) సోమవారం ఉదయం 7.34 గంటల సమయంలో శాన్ జోస్ డెల్ పాల్మార్‌కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సుమారు 107 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. వెనిజులా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు వెల్లడించింది.
కాగా, కొలంబియాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో భూమి కంపించింది. దీంతో రోడ్లపై ఉన్న ప్రజలు భయాందోళన చెందారు. క్విబ్డోలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం మరణించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొలంబియాలో సంభవించిన భూకంప నష్టానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

