Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congress Leader Blocks CM's Convoy | సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుని.. వాదనకు దిగిన కాంగ్రెస్‌   నేత

Congress Leader Blocks CM's Convoy | సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుని.. వాదనకు దిగిన కాంగ్రెస్‌ నేత

తిరువనంతపురం: కాంగ్రెస్‌ నేత ఒకరు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తాము ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావాలని వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్‌ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (Congress Leader Blocks CM’s Convoy) కేరళలో ఈ సంఘటన జరిగింది. సాంఘిక సంస్కర్త నారాయణ గురు జయంతి సందర్భంగా శుక్రవారం చెంపాజంతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం సతీశన్ కాన్వాయ్‌లో బయలుదేరారు. అయితే చెంతి ప్రాంతంలో కూడా నారాయణ గురు జయంతి కార్యక్రమాన్ని అక్కడి కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటూ సీఎం సతీశన్‌ కాన్వాయ్‌ను వారు అడ్డుకున్నారు.

కాగా, వాహనం నుంచి దిగిన సీఎం సతీశన్‌, తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నాయకుడు అనిల్ కుమార్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది నిమిషాల తర్వాత సీఎం సతీశన్ తిరిగి తన వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చెంతిలో జరిగిన కార్యక్రమం తన అధికారిక షెడ్యూల్‌లో భాగం కాదని సీఎం సతీశన్ కార్యాలయం ఆ తర్వాత స్పష్టం చేసింది.

మరోవైపు తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నాయకుడు అనిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కాన్వాయ్‌ను అక్రమంగా అడ్డుకోవడం, నేరపూరిత బెదిరింపులు, ప్రభుత్వ అధికార విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

నిందితుడు ముఖ్యమంత్రిని దూకుడుగా నిలదీశాడని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమం అయినప్పటికీ ఆయన ఎందుకు హాజరుకాలేదని గట్టిగా ప్రశ్నించాడని పోలీసులు ఆరోపించారు. దూకుడుగా ప్రవర్తించవద్దని సీఎం సూచించినప్పుడు, 'నాకు కోపం వస్తే ఏం చేస్తారు?' అని నిందితుడు బెదిరించాడని, తద్వారా ముఖ్యమంత్రిని బహిరంగంగా అవమానించడమే కాకుండా కాన్వాయ్‌తో పాటు ఉన్న పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, సీఎం వాహనాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలను డీసీసీ నేత అనిల్‌ కుమార్ ఖండించారు. వాదన సమయంలో సీఎం సతీశన్ ప్రవర్తన 'కాలేజీ విద్యార్థులు కొట్టుకుంటున్నట్లు'గా ఉన్నదని ఆయన విమర్శించారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినప్పుడు మీడియాతో అనిల్‌ కుమార్‌ మాట్లాడారు. 'ఇది పార్టీ వర్గ రాజకీయాల్లో భాగం. వర్గతత్వమే సమస్య' అని ఆయన అన్నారు.

కాగా, కొన్ని నెలల కిందట సచివాలయంలో సీఎం సతీశన్‌ను కలిసి చెంతిలో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించిన ఫొటోను ఆ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు విడుదల చేశారు. డీసీసీ సభ్యుడు సుహైల్ షాజహాన్ కూడా అనిల్‌ కుమార్‌ అరెస్టును నిరసించారు. అయితే కొందరు కాంగ్రెస్ మంత్రులు మాత్రం అనిల్‌ కుమార్‌ తీరును తప్పుపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana