Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cough Syrup | 4 ఏళ్ల లోపు ఈ ఫిక్స్‌డ్ కాంబినేషన్ దగ్గు సిరప్‌లు వద్దు.. నిపుణుల హెచ్చరిక..

Cough Syrup | 4 ఏళ్ల లోపు ఈ ఫిక్స్‌డ్ కాంబినేషన్ దగ్గు సిరప్‌లు వద్దు.. నిపుణుల హెచ్చరిక..

Cough Syrup | చిన్నారులకు దగ్గు, జలుబు వచ్చినప్పుడు వెంటనే సిరప్‌ ఇవ్వడం చాలామంది తల్లిదండ్రులకు సాధారణంగా మారిపోయింది. అయితే చిన్నారులకు కొన్ని దగ్గు, జలుబు మందుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.

ముఖ్యంగా నాలుగేళ్లలోపు పిల్లలకు ఉపయోగించే కొన్ని ఔషధాలపై ఆంక్షలు విధించడంతో తల్లిదండ్రులు మందుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కలుషితమైన దగ్గు సిరప్‌ల కారణంగా చిన్నారుల మరణాలు, కొన్ని ఔషధాలపై ఆంక్షలు, సిరప్‌ మందులను ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే విక్రయించేలా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో తాజా చర్యలు వచ్చాయి. కేంద్రం తాజాగా క్లోర్‌ఫెనిరమైన్‌ మేలియేట్‌, ఫినైలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ అనే రెండు పదార్థాలు కలిగిన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు ఉపయోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని ఈ వయసు పిల్లల కోసం పరిమితం చేసింది. ఈ కాంబినేషన్‌ ఉన్న అన్ని మందుల ప్యాకేజీలు, లేబుల్స్‌, ప్యాకేజ్‌ ఇన్‌సర్ట్‌లు, ప్రచార సామగ్రిపై నాలుగేళ్ల లోపు పిల్లల్లో ఉపయోగించకూడదు అనే స్పష్టమైన హెచ్చరికను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది.

ఏయే మందులను నిషేధించారు..

క్లోర్‌ఫెనిరమైన్‌ మేలియేట్‌ ఒక యాంటీహిస్టమైన్‌గా పనిచేస్తుంది. ఫినైలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్ ను డీకంజెస్టెంట్‌గా ఉపయోగిస్తారు. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తుమ్ములు, జలుబు లేదా అలర్జీకి సంబంధించిన కొన్ని లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఈ పదార్థాలు కలిగిన మందులను ఉపయోగిస్తారు. అయితే నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ కాంబినేషన్‌ వల్ల కొన్ని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది. నిపుణుల కమిటీ, డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు సూచించడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ వయసు పిల్లలకు మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా అధికారులు పేర్కొన్నారు. తాజా ఆంక్షలు ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. 2025 నుంచి భారత్‌లో దగ్గు, జలుబు మందుల విషయంలో వరుసగా పలు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఔషధాల కాంబినేషన్లపై ఆంక్షలు విధించడం, చాలా చిన్న వయసున్న పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వడంపై సూచనలు జారీ చేయడం, కలుషితమైన దగ్గు సిరప్‌ల కారణంగా చిన్నారుల మరణాల అనంతరం చర్యలు తీసుకోవడం, చివరకు సిరప్‌ ఆధారిత మందుల విక్రయాలపై ప్రిస్క్రిప్షన్‌ నిబంధనలు కఠినతరం చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

2025లోనే ఆంక్షలు..

2025లోనే క్లోర్‌ఫెనిరమైన్‌ మేలియేట్‌, ఫినైలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ కలిగిన కొన్ని ఎఫ్‌డీసీ మందులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు వీటిని ఉపయోగించకూడదని మందులపై హెచ్చరికలు ఉంచాలని అప్పట్లోనే ఆదేశాలు వచ్చాయి. తాజాగా ఆ కాంబినేషన్‌ ఉన్న అన్ని ఫార్ములేషన్లకు ఈ పరిమితిని వర్తింపజేస్తూ చర్యలు మరింత కఠినతరం చేశారు. 2025లో కలుషితమైన దగ్గు సిరప్‌ల వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. మధ్యప్రదేశ్‌లో కలుషితమైన దగ్గు సిరప్‌ సేవించిన తర్వాత చిన్నారులు మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కొన్ని నోటి ద్వారా తీసుకునే లిక్విడ్‌ మందుల్లో డైఇథిలీన్‌ గ్లైకాల్ (డీఈజీ) అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. కోల్డ్‌రిఫ్‌, రెస్పిఫ్రెష్‌ టీఆర్‌, రిలైఫ్‌ వంటి కొన్ని మందుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌ జారీ చేసింది. డైఇథిలీన్‌ గ్లైకాల్‌ తీవ్రమైన కిడ్నీ నష్టానికి దారితీయడంతో పాటు ప్రాణాపాయానికి కారణమయ్యే విషపూరిత రసాయనం.

మరింత జాగ్రత్త అవసరం..

ఈ ఘటనలతో పిల్లలకు మందులు ఇచ్చే విషయంలో తయారీ ప్రమాణాలు, నాణ్యత పరీక్షలు, వైద్యుల పర్యవేక్షణ, మందుల వినియోగంపై మరింత జాగ్రత్త అవసరమనే అంశం ముందుకు వచ్చింది. చిన్నారులకు మందులు ఇవ్వడంలో తల్లిదండ్రులు స్వయంగా నిర్ణయం తీసుకోవడం కంటే వైద్యుల సలహాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. 2025 అక్టోబర్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులను ప్రిస్క్రైబ్‌ చేయడం లేదా ఇవ్వడం విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కూడా ఇటువంటి మందుల వినియోగంలో జాగ్రత్త వహించాలని కోరింది. ఈ ఏడాది జనవరిలో తమిళనాడు మరో దగ్గు సిరప్‌పై చర్యలు తీసుకుంది. ఆల్మండ్‌ కిట్‌ అనే దగ్గు సిరప్‌లో ప్రయోగశాల పరీక్షల సమయంలో ఎథిలీన్‌ గ్లైకాల్‌ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించడంతో దాని తయారీ, విక్రయం, పంపిణీ, వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. జూన్‌లో సిరప్‌ మందులకు సంబంధించిన మరో కీలక మార్పు వచ్చింది. డ్రగ్స్‌ రూల్స్‌, 1945లోని షెడ్యూల్ కె కింద ఉన్న మినహాయింపుల్లో సిరప్‌ మందులను తొలగించారు. దీంతో దగ్గు సిరప్‌లతో సహా సిరప్‌ ఆధారిత మందులను గతంలో ఉన్న సడలింపు విధానంలో ఓవర్‌ ద కౌంటర్‌గా విక్రయించే అవకాశం తగ్గింది. మందులను నియంత్రిత విధానంలో, అవసరమైనప్పుడు ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

4 ఏళ్ల లోపు వారికి దగ్గు మందు వద్దా..

అయితే తాజా నిబంధనల అర్థం నాలుగేళ్లలోపు పిల్లలకు అన్ని రకాల దగ్గు సిరప్‌లను ప్రభుత్వం నిషేధించిందని కాదు. క్లోర్‌ఫెనిరమైన్‌ మేలియేట్‌, ఫినైలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ కలయిక ఉన్న నిర్దిష్ట ఎఫ్డీసీ మందులపైనే తాజా ఆంక్షలు వర్తిస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు మందు బ్రాండ్‌ పేరును మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకుండా, అందులో ఉన్న యాక్టివ్‌ ఇంగ్రిడియెంట్లను కూడా పరిశీలించాలి. ప్రతి దగ్గుకూ చిన్నారులకు దగ్గు సిరప్‌ అవసరం ఉండదు. పిల్లల్లో వచ్చే దగ్గు తరచూ వైరల్‌ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకమైన దగ్గు మందులు లేకుండానే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. చిన్నారుల్లో తీవ్రమైన దగ్గు, జలుబు కోసం ఉపయోగించే కొన్ని కాంబినేషన్‌ మందులు పరిమిత ప్రయోజనం మాత్రమే అందిస్తాయని, భద్రతకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో పేర్కొంది. పిల్లలకు గతంలో వైద్యులు సూచించిన మందే ఇప్పుడు కూడా ఇవ్వొచ్చని భావించకూడదు. అలాగే మరో పిల్లవాడికి ఇచ్చిన మందును తమ పిల్లలకు ఇవ్వడం లేదా ఫార్మసీలో చెప్పిన మందును స్వయంగా కొనుగోలు చేసి ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదు. పిల్లల వయసు, బరువు, లక్షణాలు, ఆరోగ్య పరిస్థితి, మందులోని పదార్థాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యుల సలహాతోనే మందులు ఇవ్వడం మంచిది.

ఈ లక్షణాలు కూడా ఉంటే..

ముఖ్యంగా క్లోర్‌ఫెనిరమైన్‌ మేలియేట్‌, ఫినైలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ కలిగిన మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు ఇవ్వకూడదు. పిల్లలకు దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరంతర అధిక జ్వరం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, అసాధారణంగా ఎక్కువ నిద్రపోవడం, డీహైడ్రేషన్‌ లేదా లక్షణాలు మరింత తీవ్రమవడం వంటి సమస్యలు కనిపిస్తే కేవలం దగ్గు మందుతో సమస్యను అణచివేయకుండా వైద్యులను సంప్రదించాలి. చిన్నారులకు దగ్గు, జలుబు వచ్చినప్పుడు మందు ఇవ్వడమే పరిష్కారం కాదని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో మందుల లేబుల్‌, యాక్టివ్‌ ఇంగ్రిడియెంట్లు, వయసుకు సంబంధించిన హెచ్చరికలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైనప్పుడు వైద్యుల సూచనతోనే మందులు ఇవ్వడం సురక్షితమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana