Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!

Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!

Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి మురాసు (MURASU) తుపానుగా మారింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 2వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున మధ్య నెల్లూరు-నర్సాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు

ఆదివారం ఉదయం 11.30 గంటలకు మురాసు తుపాను గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 660 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలుల వేగం అప్పుడప్పుడు 120 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా నవంబర్ 3న తెలంగాణలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 4న కూడా తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. నవంబర్ 1, 2 తేదీల్లో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాంలో నవంబర్ 2, 3 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో నవంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గాలులు, ఉరుములు, మెరుపులతో జాగ్రత్త

నవంబర్ 3న తెలంగాణలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 2న కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కదలికలు, వర్షాల తీవ్రతపై ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచించింది.

ఒడిశాలో హై అలర్ట్.. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సిద్ధం

మురాసు తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా దక్షిణ ఒడిశా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana