Wednesday, 30 May, 10.20 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
డాటా అనాలసిస్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ క్వాంటిటేటివ్ మెథడ్స్‌లో డాటా అనాలసిస్ అండ్ మెషిన్ లర్నింగ్ యూజింగ్ ఆర్ సాఫ్ట్‌వేర్‌పై సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సి. జయలక్ష్మి తెలిపారు. సెంటర్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా కారణంగా డాటా విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ఇంటర్నెంట్‌కు అనుసంధానమైన డివైజ్‌ల సంఖ్య కూడా ఎంతో పెరిగిందని, స్టోరేజ్ చేసే పరికరాల ధర తగ్గిందని వివరించారు. పెరిగిపోయిన డాటాను నిర్వహించేందుకు సమర్థులైన డాటా సైంటిస్టుల అవసరం పరిశ్రమలకు ఎంతగానో ఉందని చెప్పారు. దాంతో డాటా సైంటిస్టుల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే మూడేళ్లలో 2.7 మిలియన్ల డాటా సైంటిస్టుల అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగస్తులకు ఆరు వారాల కోర్సు (శని, ఆదివారాల్లో)ను వచ్చే నెల 9 నుంచి, విద్యార్థులకు అయిదు వారాల కోర్సు (సోమవారం నుంచి శుక్రవారం వరకు)ను వచ్చే నెల 11వ తేదీ నుంచి ఓయూలోని సెంట్రల్ ఫెసిలిటీస్ బిల్డింగ్ (సీఎఫ్‌ఆర్‌డీ) భవనంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు 9014751123, 9573468888, 986663397 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Dailyhunt
Top