తాజావార్తలు
దక్షిణాదిపై కేంద్రం వివక్ష

- కాజీపేటలో రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీకి మొండిచెయ్యి
- హైస్పీడ్ రైళ్లతో అభివృద్ధి వేగవంతం
- వచ్చే బడ్జెట్‌లోనైనా తెలంగాణ రాష్ర్టానికి పెద్దపీట వేయాలి
- ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్
- ఎస్సీఆర్ ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో /కంటోన్మెంట్ , జనవరి 21 (నమస్తే తెలంగాణ): రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏటా కేటాయించే రైల్వే బడ్జెట్ నిధుల్లో దక్షిణాది రాష్ర్టాల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, కనీసం రానున్న బడ్జెట్‌లోనైనా దక్షిణభారత రాష్ర్టాలకు తగిన నిధులు ఇవ్వాలని కోరారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కాజీపేటలో రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తామని చెప్పిన కేంద్రం.. దాని కోసం 135 ఎకరాల భూమిని అడిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 300 ఎకరాల భూమిని అప్పగించిందని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.
కొత్త ఆఫీస్ ప్రారంభాన్ని తన చేతులమీదుగా జరిపించినందుకు రైల్వే కార్మికులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పలు రాష్ర్టాలకు హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు దూసుకెళ్తుంటే.. మన రాష్ర్టానికి మాత్రం కేంద్రం మొండి చెయ్యి చూపించిందన్నారు. హైస్పీడ్ రైళ్లతో మారుమూల ప్రాంతాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం నుంచి గంటలో హైదరాబాద్‌కు చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం దక్షిణాది రాష్ర్టాలను విస్మరించిందని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమంలో రైల్వే కార్మికులు
దేశం కోసం, ప్రజల క్షేమం కోసం రైల్వే కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప స్థితిలో రైల్వేస్ ఉండటానికి కార్మికులు, ఉద్యోగుల కృషే కారణమని చెప్పారు. తాము రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసే ఉన్నామని, ఉద్యమ సమయంలోనూ ఉద్యోగులతో స్నేహభావంతోనే మెలిగామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రైల్వే ఉన్నతిని కాంక్షించే ప్రభుత్వమని, రైల్వే ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లితే వారి పక్షాన నిలుస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవయ్యతోపాటు ప్రభాకర్, శ్రీనివాస్, నవీన్‌కుమార్, శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాబోయే సీఎం కేటీఆర్ !
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు
సికింద్రాబాద్ రైల్వే కార్మికుల సమావేశంలో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. త్వరలో కేటీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. పద్మారావు మాట్లాడుతూ కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. కేటీఆర్ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగుల హక్కుల రక్షణకు మరింతగా కృషిచేస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.