Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనండి మహాప్రభో.. సంచులు తెస్తలేరు.. కాంటా వేస్తలేరు

ధాన్యం కొనండి మహాప్రభో.. సంచులు తెస్తలేరు.. కాంటా వేస్తలేరు

  • నెలరోజులైనా ఇవే ఇక్కట్లా?
  • సర్కార్‌ తీరుపై రైతుల మండిపాటు
  • ఆయా చోట్ల రోడ్డెక్కి నిరసనలు

నమస్తే నెట్‌వర్క్‌, మే 22 : రాష్ట్రంలో రైతులకు వడ్ల కొనుగోలు తిప్పలు తప్పడం లేదు.

చేతికొచ్చిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల దాటినా కొనడం లేదం టూ రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్కార్‌ తీరుపై రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం కూడా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం సుల్తానాబాద్‌లో రైతులు భగ్గుమన్నారు. నల్లవాగు- సిర్గాపూర్‌ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వడ్లు తడిస్తే ఎవరి బాధ్యతంటూ ఐకేపీ సీసీ దుర్గయ్యను చుట్టుముట్టి నిలదీశారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని నాగులపల్లి బైపాస్‌ రోడ్డు సమీపంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. వడ్లు కాంటా వేయడం లేదని మెదక్‌ జిల్లా హవేళీఘనపూర్‌ మండలం కొత్తపల్లి, గంగాపూర్‌ గ్రామ రైతులు శుక్రవారం మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా తరలించడం లేదని ఖమ్మం జిల్లా చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు రైతులు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. మక్కలు తెచ్చి నెల రోజులవుతున్నా కొంటలేరని పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డిని రైతులు నిలదీశారు. పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కె ట్‌ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం సందర్శించి వెళ్లిన తర్వాత మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో ఏదుట్ల రోడ్డుపై గోడౌన్‌ ఎదుట నాలుగు గంటలపాటు రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం వాహనాలు ఉంచి.. రోడ్డుపై వరి పోసి రైతులు నిరసన తెలిపారు. తాను వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అడిషనల్‌ కలెక్టర్‌ చెప్పడంతో రైతులు శాంతించారు.

రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌

రైతులను సర్కార్‌ తరుగు పేరిట దోచుకుంటున్నదని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బీబీనగర్‌లో ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ రైతులతో కలిసి శుక్రవారం వారు ధర్నాకు దిగారు. ఇప్పటివరకు 20శాతం ధాన్యం కూడా కొనలేదని పేర్కొన్నారు. మరో 8 రోజులు కొనుగోలు ఎలా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. రైతులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, వారి తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌ జయశంకర్‌సార్‌ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో చేశారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీవ్ర ఆలస్యం జరుగుతున్నట్టు తెలిపారు. తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ములుగు జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని రెడ్‌కో మాజీ చైర్మన్‌ ఏరువ సతీశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి ములుగు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట, జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు.

కేసీఆర్‌ను వదులుకొని తప్పు చేసినం

నాపేరు వోగులపు సత్తయ్య. మాది జగిత్యాల జిల్లా చల్‌గల్‌. నాకున్నది ఒక్కటే ఎకరం. వడ్లే పండిస్తున్న. పండిన దాంట్ల నుంచి ఇంట్లకు ఇన్ని ఇత్తులు తీసుకొని, దాదాపు డబ్బు ఎనభై సంచుల మందం వడ్లు చల్‌గల్‌ మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చిన. నలభై రోజలు అయితున్నది. ఇంత వరకు కొనుడు సంగతి దేవుడెరుడు? వడ్లు నింపేందుకు బారాదాన్లు సూత ఇయ్యలే. నలభై రోజులు అయినంక ఇప్పుడు ఇచ్చిన్రు. ఈ బరదాన్లళ్ల అడ్లు ఎత్తినంక ఎప్పుడు జోకుతరో.. జోకిన అడ్లను ఎప్పుడు ఎత్తుకపోతరో తెల్వది. ఇంకెన్ని రోజులు ఇక్కడ పడి సావాలో.. మస్తు దుఖం వస్తున్నది. రైతంటే గింత అధ్వానంగా సూసుడు కరెక్ట్‌ కాదు. ఏ సారును అడిగినా పట్టించుకునుడే లేదు. ఏం చేయాలో అర్థం అయిత లేదు.

మా ఊరికి, మార్కెట్‌ యార్డుకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. రోజు పొద్దుగాల అచ్చుడు. పగటిలీ పోయి తిని అచ్చుడు. రాత్రి మళ్ల ఇంటికి పోవుడు. ఇంటికి పోయినా భయమే సార్‌. అడ్లు ఏమైనయో.. గాలిదుమారం గిట్ట అచ్చెనా.. అన్న రందితోటే పండుడు అయితంది. తిన్న తిండి పెయిన పడ్తలేదు. కంటి నిండ నిద్ర వడ్తలేదు. రోజు బండి మీద అచ్చెతందుకు పెట్రోల్‌ ఖర్చు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలే. కేసీఆర్‌ సార్‌ ఉన్నప్పుడు మంచిగుండె.. వారం రోజులల్ల అడ్ల కథ ఒడిసింది. ఆ సారు సీఎంగా ఉన్నప్పుడు రైతుల గోస చూసిండు. ఉన్నంతల మంచిగ చేసిండు. పైసలు ఇచ్చిండు. అన్ని చేసిండు. అడ్లు కూడా మార్కెట్‌కు తెచ్చినంక వారం పది రోజుల్లనే కొన్నరు. పైసలు సైతం జెప్పనే ఏసిన్రు. ఇప్పుడు నలభై రోజుల సంది ఎండుతున్నా పట్టించుకున్నోడు లేడు. కేసీఆర్‌ను వదులుకొని తప్పు చేసినం.

20 రోజులైనా లోడింగ్‌ కాలె..

నాపేరు తౌడ్యా నాయక్‌. మాది మంచిర్యాల జిల్లా భీమారం. నాకున్న నాలుగెకరాల్లో వరి వేసిన. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 15 రోజులైంది. నా పక్కనున్న ధాన్యం కుప్ప తూకం వేసి 20 రోజులైనా లోడింగ్‌ కాలేదు. ఆ వడ్లు పోతేనే మా వడ్లు తూకం వేస్తామంటున్నరు. నెల రోజుల్లో మూడు లారీల వడ్లు మాత్రమే పోయినయ్‌. కాంటా పెట్టిన కుప్పలు ఎక్కడివి అక్కడే ఉన్నయ్‌. లారీ ఎప్పుడు రావాలే, ఆ వడ్లు ఎప్పుడు పోవాలే అర్థమైతలేదు. కాంటా పెట్టిన 20 రోజులకు కూడా లారీ రాకపోతే ఎట్లా బతుకుడు. వర్షం వస్తదేమో అని గాబరైతున్నాం. పొద్దున ఆరబోసుడు, సాయంత్రం కుప్ప చేసి పరదా కప్పుడు, రోజూ ఇదే పనైపోయింది. రైతులను ఎంతకు ఇంత గోస పెడుతున్నరు. గోనె సంచులు అయిపోయినయ్‌ అని చెప్తున్నారు. ఐదు రోజుల సంది ఆర్డర్‌ పెట్టినం వస్తయని కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు చెప్తున్నడు. మా ఊరిలో ఉన్న గోదామును ఇప్పటికే పక్క ఊరి వడ్లతో నింపేసిండ్రు. మా వడ్లు ఎక్కడికి పోతాయో చెప్పడం లేదు. లారీ ఎందుకు వస్తలేదో, లోడ్‌ ఎందుకు చేస్తలేరో సరిగా చెప్పడం లేదు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలే. కేసీఆర్‌ ఉన్నప్పుడు మాయిశ్చర్‌ అచ్చినయంటే కల్లంలో వడ్లు ఆగకనేపోయేది. రెండు రోజుల్లో డబ్బులు మా ఖాతాలో పడేవి. ఇప్పుడు రోజుల తరబడి కల్లంలోనే కాపలా ఉంటున్న. ధాన్యం కొనే దిక్కులేకుండా పోయింది.

25 రోజులైనా వడ్లకు కాంటా పెడుతలేరు..

నాపేరు ఓంకూరి వెంకట్రాంనర్సయ్య. మాది మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 25 రోజులు దాటింది. మూడు కుప్పలుగా వడ్లు పోసిన. 350 బస్తాల వడ్లు అయినయ్‌. కేంద్రం నిర్వాహకులు వడ్లు మాయిశ్చర్‌ చూసి పోయిన్రు. పీఏసీఎస్‌ నుంచి బస్తాలు తీసుకొచ్చి ట్రాక్టర్‌ రెడిగా పెట్టుకుంటే కాంటా పెడుతామంటున్నరు. నాకు 78 ఏండ్లున్నయ్‌. వయస్సు సహరించడం లేదు. ఎండలో ఎక్కడకు పోవాలో అర్థం కావడం లేదు. జర ఇబ్బంది లేకుండా మాలాంటి ముసలి రైతులను ఓకంట కనిపెట్టాలి. ఎక్కడికి పోయి ట్రాక్టర్‌ కిరాయి మాట్లాడుకోవాలి. నాకు ఓపికలేదు. 25 రోజుల సంది ఈడనే ఉంటున్న. గతంలో తొందరగ కాంటా పెట్టి మిల్లులకు తరలించేది. పోయిన వానకాలం నుంచి ఇబ్బంది అయితున్నది. ఇట్లయితే వ్యవసాయం చేసుడు కష్టమే. సర్కార్‌ మమ్ములను ఇబ్బంది పెట్టుడు మంచిది కాదు. వెంటనే వడ్లకు కాంటా పెట్టి పైసలు వేస్తే మళ్లా వానకాలం పంటలు మొదలు పెట్టుకుంటం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana