- ఆర్థిక శాఖ తొలగిస్తారని ప్రచారం
- హుటాహుటిన అధిష్ఠానం వద్దకు
- అక్కడే రంగారెడ్డి జిల్లా రెడ్డి నేతలు
- 'అసలు కాంగ్రెస్’ సెంటిమెంట్ తెరమీదికి తెస్తున్న నాయకులు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యనేత వేసిన స్కెచ్ గురించి 'నమస్తే తెలంగాణ'లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కేరళ సీఎం వీడీ సతీషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాత్రి తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం మళ్లీ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'స్వచ్ఛభారత్ మిషన్ 2.0 జాతీయ సమీక్ష'కు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు హాజరైతే సరిపోతుందని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అవసరమే లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కానీ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణలో తనకు పదవీగండం పొంచి ఉన్నదనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో భట్టి ఉలిక్కిపడ్డట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ముఖ్యనేత పంపిన ప్రతిపాదనలను అధిష్ఠానం అంగీకరిస్తే స్పీకర్ పదవి తీసుకోకతప్పదనే సమాచారం అందిందని, అందుకే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారనే చర్చ జరుగుతున్నది. మంగళవారం ప్రయత్నించినా అధిష్ఠానం నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన రాత్రి అక్కడే ఉన్నారని, బుధవారం మరోసారి ప్రయత్నిస్తారని సమాచారం. ముఖ్యనేత తనతో సన్నిహితంగా ఉంటూనే, తన సీటు కిందికే నీళ్లు తెచ్చారని భట్టి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రంగారెడ్డి జిల్లా నేతల మకాం
భట్టికి స్పీకర్ పదవి కట్టబెట్టి, ప్రస్తుత స్పీకర్ ప్రసాద్‌ను క్యాబినెట్‌లోకి తీసుకొనే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దళిత నేతను పదవి నుంచి తొలిగించి, మరో దళిత నేతకు క్యాబినెట్ పదవి ఇస్తే ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా తప్పించుకోవచ్చని ముఖ్యనేత ప్రతిపాదించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారని సమాచారం. ఈ మేరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు తెలిసింది.
భట్టి ఆర్థిక శాఖ ఊస్ట్!
రాష్ట్రంలో నేతలు అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్‌గా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగిస్తే అసలు కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే జీవన్‌రెడ్డి అంశంలో అసలు కాంగ్రెస్ నేతలను విస్మరిస్తున్నారనే సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్లిందని, ఇప్పుడు భట్టిని తప్పిస్తే సెంటిమెంట్ మరింత బలపడి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భట్టి నుంచి ఆర్థికశాఖను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆర్థికశాఖకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
పెండింగ్ కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని, ఇందులో మంత్రి ప్రమేయం ఉన్నదని సివిల్ కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆరోపించారు. గత ఏడాది మార్చిలో దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయంలో భట్టి విక్రమార్క చాంబర్ వద్ద నిరసనకు దిగారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ స్వయంగా విచారించి ఏఐసీసీకి నివేదిక పంపినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికితోడు సింగరేణి పరిధిలోని నైనీ బ్లాక్ కోల్‌మైన్ టెండర్లపై ఆవినీతి ఆరోపణలు గుప్పుమనడం, టెండర్లను రద్దు చేయడం తెలిసిందే. ఈ రెండు శాఖల్లోని అవినీతిపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విచారణ ద్వారా ముఖ్యనేత సమాచారం తెప్పించుకొని అధిష్ఠానానికి చేరవేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భట్టి చేతిలో ఉన్న ఆర్థికశాఖ తొలిగింపునకు ఢిల్లీ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

