- అమరుల త్యాగాలకు ప్రతీకే దేశ గౌరవం
- భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో జాతి చిహ్నాలను అవమానిస్తే సహించేది లేదు
- ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ తేవాలి
- జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నిరోధక చట్టం' సవరణ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు: ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్, జూలై 29 ( నమస్తే తెలంగాణ): 'నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టాలూ మారాలి. సోషల్ మీడియా, ఏఐ ద్వారా నేడు కొన్ని నిమిషాల్లోనే సమాచారం కోట్లాది మందికి చేరుతున్నది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నియంత్రణ అవసరం' అని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో బుధవారం 'జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నిరోధక చట్టం' సవరణల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో, వాణిజ్య ప్రకటనల్లో జాతీయ చిహ్నాలను దుర్వినియోగం చేసే చర్యలను అడ్డుకోవడానికి దేశ గౌరవ పరిరక్షణకు కఠిన చట్టాలు అవసరమని ఉద్ఘాటించారు. దేశ గౌరవం అంటే కేవలం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం మాత్రమే కాదని, సార్వభౌమత్వానికి, స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కోట్లాది మంది అమరుల త్యాగాలకు ప్రతీకలని స్పష్టం చేశారు. మన త్రివర్ణ పతాకం సాధారణ వస్త్రం కాదని, గాంధీ, నేతాజీ, వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేదర్ వంటి మహనీయుల ఆశయాలను అది మోస్తున్నదని అభివర్ణించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకొన్నారు.
భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కాదు
జాతీయ గౌరవానికి అవమానం నిరోధక సవరణ బిల్లు భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి కాదని, ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు ఇది అవసరమని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించే హకు ప్రతి ఒకరికీ ఉన్నదని, కానీ దేశ గౌరవాన్ని అవమానించే హకు మాత్రం ఎవరికీ లేదని పేర్కొన్నారు. కేవలం శిక్షలు కఠినతరం చేయడమే కాకుండా, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ చిహ్నాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత భారత్-2047 లక్ష్యసాధన దిశగా పయనిస్తున్న తరుణంలో దేశ గుర్తింపును కాపాడే ఇలాంటి బిల్లులకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ప్రధాని మోదీ దీనిపై చొరవ తీసుకోవాలని వద్దిరాజు రవిచంద్ర కోరారు. స్వయంగా ప్రధాని చొరవ తీసుకొని ఆ వర్గాల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని సూచించారు. ఇది సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని పేరొన్నారు.

