Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
DK Shivakumar | జూన్‌ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం..!

DK Shivakumar | జూన్‌ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం..!

DK Shivakumar : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) పేరు దాదాపు ఖరారైంది. జూన్‌ 3న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ (శనివారం) సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డీకేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే బుధవారం శివకుమార్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని సదరు వర్గాలు వెల్లడించాయి. ఇక, కొత్త మంత్రి వర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి చోటుదక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. సిద్ధరామయ్య ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్‌ శుక్రవారం ఆమోదించారు. దాంతో ఈ రోజు జరిగే సీఎల్పీ సమావేశంలో డీకేను ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మినహా కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.

ఇక రాజీనామా అనంతరం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య.. కొత్త క్యాబినెట్‌లో తన తరఫున మంత్రుల జాబితాను పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేల పరిశీలన కోసం అందించారు. తన కుమారుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ యతీంద్రకు కీలక శాఖలతోపాటు ఉపముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రుల్లో దాదాపు సగం మందికి కొత్త మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చని తెలుస్తున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana