Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈదురుగాలుల వర్షం

ఈదురుగాలుల వర్షం

  • భద్రాద్రి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం
  • కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిపోయిన ధాన్యం
  • కాంగ్రెస్‌ సర్కార్‌పై అన్నదాతల ఆగ్రహం
  • నేలకొరిగిన పండ్ల తోటలు
  • పలుచోట్ల పడిపోయిన చెట్లు, కరెంట్‌ స్తంభాలు

భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూరుపాడు, పాల్వంచ తదితర మండలాల్లోని మామిడి, అరటి తోటలు నేలకొరిగాయి. అక్కడక్కడా చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలువురి ఇంటి రేకులు ధ్వంసమయ్యాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తూ ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు రోజులుగా ఈదురుగాలుల బీభత్సానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రనష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల రైతులు పరదాలు కప్పుకొని పంటలను రక్షించుకున్నప్పటికీ చాలామంది రైతుల ధాన్యం తడిసిపోయింది. పాల్వంచ మండలం సోములగూడెంలో కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటూ ఆరబెట్టుకున్నారు. తడిసిన ధాన్యం రంగుమారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చండ్రుగొండ, జూలూరుపాడు, ఇల్లెందు, చుంచుపల్లి, బూర్గంపాడు మండలాల్లో రైతుల ధాన్యం అక్కడక్కడా తడిసిపోయింది.

చుంచుపల్లి మండలంలో రెండుసార్లు అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు. గత 20 రోజులుగా కాంటాల కోసం ఎదురుచూస్తున్నా పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పంటలకు రేయింబవళ్లు కాపలా ఉండలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పగలు మొత్తం కాపలా ఉండడం, రాత్రివేళ పరదాలు కప్పుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎంత కష్టపడి పంట పండించినా చివరికి రైతులు కల్లాల్లో కొనుగోలు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

20 రోజులుగా కల్లంలోనే ధాన్యం

తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారు. గత 20 రోజులుగా ధాన్యం బస్తాలు కల్లంలోనే ఉన్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంభయంగా గడిపాం. పెద్ద వర్షం వస్తే తీవ్రంగా నష్టపోకతప్పదు. నిన్ననే బస్తాలు కాంటాలు వేశారు. ఇంకా లారీలకు లోడు చేయలేదు. పంట పండించే వరకు చాలా కష్టపడుతున్నాం. పంటను అమ్ముకునేందుకు అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. రోజుల తరబడి కల్లాల్లో ఎదురుచూడాల్సి వస్తున్నది.

– కట్ల సతీశ్‌, రాంపురం, చుంచుపల్లి మండలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana