Monday, 10 May, 4.20 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
ఈశ్వర నాగాస్త్రం!

ఒకరు బ్యాటింగ్‌లో పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలిసిన అభిమన్యుడైతే.. మరొకరు బౌలింగ్‌లో ప్రత్యర్థి పాలిట నాగాస్త్రం. లీగ్‌ల జోరులోనూ సంప్రదాయ క్రికెట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన ఇద్దరు యువ ఆటగాళ్లను బీసీసీఐ ఇంగ్లండ్‌ పర్యటనకు స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. వారే.. రెండేండ్ల క్రితమే టీమ్‌ఇండియా పిలుపు ఆశించిన ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ అభిమన్యు ఈశ్వరన్‌, ఇండో పర్శియన్‌ లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌ అర్జాన్‌ నాగ్వస్‌వాలా. స్టార్‌ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోనున్న ఈ నయా తారలపై ప్రత్యేక కథనం..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌ కోసం భారీ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నలుగురు స్టాండ్‌బై ప్లేయర్లను కూడా ఎంపిక చేసింది. అందులో ఇటీవల భారత జట్టు తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్‌ కృష్ణ, తాజా ఐపీఎల్‌ సీజన్‌లో సత్తాచాటిన అవేశ్‌ ఖాన్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్‌, అర్జాన్‌ నాగ్వస్‌వాలా పేర్లు ఉన్నాయి. గతంలోనే టీమ్‌ఇండియా ఎంపికకు చేరువైన అభిమన్యుకు 64 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవం ఉండగా.. అర్జాన్‌ 16 మ్యాచ్‌లాడాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు కూడా స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న అభిమన్యు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నానంటుంటే.. అనూహ్యంగా వచ్చిన పిలుపుతో నాగ్వస్‌వాలా ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

అనూహ్య పిలుపు
కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్‌-14వ సీజన్‌ అర్ధాంతరంగా వాయిదా పడటంతో.. ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్‌ నెట్‌ బౌలర్‌ అర్జాన్‌ నాగ్వస్‌వాలా ఫోన్‌ రింగైంది.. అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న బీసీసీఐ కార్యదర్శి జై షా 'నువ్వు టీమ్‌ఇండియా స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యావు' అని చెప్పడంతో.. అర్జాన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గుజరాత్‌కు చెందిన ఇండో పర్శియన్‌ మీడియం పేసర్‌ అయిన 23 ఏండ్ల అర్జాన్‌.. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 62 వికెట్లు పడగొట్టాడు. పాత బంతితో రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగల నాగ్వస్‌వాలా తాజా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ నెట్‌ బౌలర్‌గా సేవలందించాడు. 'చాలా ఆనందంగా ఉంది. ముంబై ఇండియన్స్‌ నెట్‌బౌలర్‌గా దిగ్గజ జహీర్‌ ఖాన్‌ నుంచి విలువైన సలహాలు అందుకున్నా. ఇప్పుడు టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోనున్నా' అని అర్డాన్‌ సంతోషం వ్యక్తంచేశాడు.

నిలకడ లేకే..
2018-19 రంజీ సీజన్‌లో 95.66 సగటుతో 861 పరుగులు చేసిన అభిమన్యు ఈశ్వరన్‌.. ఒక దశలో భారత జట్టుకు ఎంపికవడం దాదాపు ఖాయమే అనిపించింది. అయితే నిలకడలేమి అతడి అవకాశాలను దెబ్బతీసింది. ఆ మరుసటి సీజన్‌లోనే అతడు 17.20 సగటుతో కేవలం 258 పరుగులే చేశాడు. అదే సమయంలో మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, గిల్‌, రోహిత్‌ శర్మ సత్తాచాటడంతో టీమ్‌ఇండియాలో ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం పోటీ తీవ్రమైంది. 'స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా రిజర్వ్‌ ఆటగాడిగా ఉన్నాను. జట్టుతో కలిసి ఉండటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కోహ్లీ, రోహిత్‌, పుజారా వంటి వారితో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడం గొప్ప విషయం.తుదిజట్టులో అవకాశం వస్తే సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంటా' అని అభిమన్యు పేర్కొన్నాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top