Friday, 24 Sep, 4.06 am నమస్తే తెలంగాణ

జాతీయం
ఎగిరే కారు రాబోతున్నది!

  • ఆసియాలోనే తొలి హైబ్రిడ్‌ 'వీటీవోఎల్‌’ కారు ఇదే
  • పెట్రోల్‌తోనే కాకుండా విద్యుత్తుతోనూ ప్రయాణం
  • చెన్నైకి చెందిన 'వినతా' స్టార్టప్‌ కంపెనీ ఆవిష్కరణ
  • వచ్చే నెల 'లండన్‌ ఎక్స్‌పో'లో నమూనా కారు ప్రదర్శన

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23: రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. వర్షాలు, రహదారి మరమ్మత్తుల వంటి సందర్భాల్లో పరిస్థితి మరింత జటిలం అవుతుంది. ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా ఎంచక్కా ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా? హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే 'ఎగిరే కారు' త్వరలో నిజంగానే భారత్‌లో విహారం చేయనున్నది.

ఏమిటీ ఎగిరే కారు?
చెన్నైకి చెందిన స్టార్టప్‌ కంపెనీ 'వినతా ఏరోమొనిలిటీ' ఈ 'హైబ్రీడ్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (వీటీవోఎల్‌)' ఎగిరే కారును తయారుచేసింది. దీని ప్రొటోటైప్‌ను పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే ఆవిష్కరించారు. వచ్చే నెల మొదటివారంలో లండన్‌లో జరిగే 'హెలీటెక్‌ ఎక్స్‌పో 2021'లో అధికారికంగా ఈ కారు మోడల్‌ను కంపెనీ ప్రదర్శించనున్నది. గాలిలోనే కాకుండా రోడ్డు మీద కూడా ఈ కారు ప్రయాణిస్తుంది. జీవ ఇంధనం, శిలాజ ఇంధనంతో (పెట్రోల్‌, డీజిల్‌) పాటు విద్యుత్తుతో కూడా ప్రయాణించే ఇలాంటి హైబ్రిడ్‌ కారు ఆసియాలోనే మొట్టమొదటిదిగా కంపెనీ చెప్తున్నది.

ఎలా నడుస్తుంది?
కృత్రిమ మేధ సాయంతో నడిచే ఈ కారులోని డిస్ట్రిబ్యూటెడ్‌ ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ, బహుళ మోటార్లు, ప్రొపెల్లర్లు, ఫ్యాన్లు కారును నిర్ణీత ఎత్తులో ముందుకు, వెనక్కి ప్రయాణించేలా సాయపడుతాయి. ఉన్నచోటునే పైకి ఎగురడంతో పాటు నిటారుగా కిందకు కూడా ఈ కారు దిగగలదు.

భద్రత భేష్‌
ఈ హైబ్రీడ్‌ కారులో ఒకటి కంటే ఎక్కువ ప్రొపెల్లర్లు, మోటార్లు ఉన్నాయి. ప్రయాణ సమయంలో ఏదైనా ప్రొపెల్లర్‌, మోటార్‌లో సాంకేతిక సమస్య ఏర్పడితే మిగిలిన ప్రొపెల్లర్లు, మోటార్ల సాయంతో కారు ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్‌ చేయగలదు. ఒకవేళ జనరేటర్‌లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే, బ్యాకప్‌ పవర్‌ మోటార్‌ విద్యుత్‌ను అందిస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ అయిపోయిన సందర్భాల్లో కూడా బ్యాకప్‌ పవర్‌ మోటార్‌ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అనుకోని ప్రమాదం జరిగితే.. ఎగురుతున్న కారు నుంచి ప్రయాణికులు నేలమీదకు రావడానికి ఎయిర్‌ బ్యాగ్స్‌ ఎనేబుల్డ్‌ కాక్‌ పిట్‌ పారాచూట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక, జీపీఎస్‌ ట్రాకర్‌, ఆన్‌లైన్‌ ఎంటైర్టెన్‌మెంట్‌ సిస్టమ్‌ కారులో ప్రధాన ఆకర్షణలు.

ఎగిరే కారు ఫీచర్లు ఇవే..
పేరు: వీటీవోఎల్‌ ఫ్లైయింగ్‌ కార్‌
మోయగల బరువు: 1,300 కిలోలు (కారు బరువు 1,100 కిలోలు)
ప్రయాణికుల గరిష్ఠ సంఖ్య: ఇద్దరు (పైలట్‌తో కలిపి)
ఏకబిగిన ఎగరగలిగే వ్యవధి: 60 నిమిషాలు
వేగం: గంటకు 100 కిలోమీటర్లు (గరిష్ఠంగా 120 కిలోమీటర్లు)
ఎగరగలిగే గరిష్ఠ ఎత్తు: 3,000 అడుగులు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top