Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎనిమిదేళ్లకే చెస్‌లో ప్రపంచ స్థాయి సంచలనం.. 9కి 9 గెలిచి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా సరయు!

ఎనిమిదేళ్లకే చెస్‌లో ప్రపంచ స్థాయి సంచలనం.. 9కి 9 గెలిచి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా సరయు!

యసు ఎనిమిదేళ్లు.. చదువుతున్నది మూడో తరగతి.. కానీ చెస్‌ బోర్డుపై మాత్రం ప్రపంచ స్థాయి ప్రత్యర్థులను ఓడిస్తూ దూసుకెళ్తోంది. అమెరికాలోని డల్లాస్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబానికి చెందిన చిన్నారి సరయు తలపనేని అంతర్జాతీయ చెస్‌లో అరుదైన ఘనత సాధించింది.

కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన క్లాసికల్‌ చెస్‌ పాన్‌-అమెరికన్‌ పోటీల్లో తన విభాగంలో 9కి 9 పాయింట్లు సాధించి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

తొమ్మిది రౌండ్లు.. తొమ్మిది విజయాలు

వారం రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సరయు తొమ్మిది రౌండ్లు ఆడింది. ఉత్తర, దక్షిణ, మధ్య అమెరికాలకు చెందిన ఏడు దేశాల క్రీడాకారులతో తలపడింది. ఒక్క గేమ్‌లోనూ ఓటమి లేకుండా పర్ఫెక్ట్‌ స్కోర్‌తో టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ విజయంతో అమెరికా తరఫున పాల్గొన్న అత్యంత పిన్న వయస్కులైన బాలికల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే యూత్‌ చెస్‌ వరల్డ్‌ కప్‌లో అమెరికాస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. ఫిడే విమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ (WCM) టైటిల్‌కు అవసరమైన అర్హతను తాత్కాలికంగా సాధించిన అతి పిన్న వయస్కుల్లోనూ సరయు ఒకరిగా నిలిచింది.

పోటీలు ముగించుకుని డల్లాస్‌కు చేరుకున్న సరయుకు కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఫాక్స్‌ 4 న్యూస్‌తో పాటు ఇర్వింగ్‌, ఫ్రిస్కో నగరాల మేయర్లు ఆమెను అభినందించారు. అమెరికా మహిళల చెస్‌ ఛాంపియన్‌గా నాలుగుసార్లు నిలిచిన కారిస్సా యిప్, ప్రముఖ చెస్‌ క్రీడాకారుడు, విశ్లేషకుడు సాగర్‌ షా కూడా సరయుకు అభినందనలు తెలిపారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన 'చెక్‌మేట్‌' కార్యక్రమంలో సరయు వీరిద్దరినీ కలిసింది.

ఐదేళ్లకే చెస్‌ ప్రస్థానం

ఐదేళ్ల వయసులో కాపెల్‌ చెస్‌ క్లబ్‌లో గ్రూప్‌ క్లాసులతో సరయు చెస్‌ నేర్చుకోవడం ప్రారంభించింది. అప్పట్లో కూచిపూడి, పియానో, ఆర్ట్‌, జిమ్నాస్టిక్స్‌ వంటి ఇతర కార్యకలాపాలతో పాటు చెస్‌ కూడా ఓ సరదా హాబీగానే ఉండేది. ఓ స్థానిక టోర్నమెంట్‌లో ఆమె ఆటను గమనించిన అనిల్‌ గుట్ల.. సరయులో మంచి ప్రతిభ ఉందని, వ్యక్తిగత శిక్షణ అవసరమని తల్లి శ్రీలక్ష్మికి సూచించారు.

దీంతో ఆమె కుటుంబం ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ సాక్షం రౌటెలాను సంప్రదించింది. సరయు సామర్థ్యాన్ని గుర్తించిన ఆయన.. ఏకాగ్రతతో శిక్షణ ఇస్తే మంచి స్థాయికి చేరుకుంటుందని సూచించారు. అనంతరం గత వేసవి నుంచి మరో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ వద్ద వ్యక్తిగత శిక్షణ తీసుకుంటోంది. పాఠశాల తర్వాత చెస్‌ సాధన, వారాంతాల్లో టోర్నమెంట్లు ఆమె దినచర్యగా మారాయి.

2025 డిసెంబరు నాటికి అమెరికాలో 7 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికల టాప్‌-100 జాబితాలో సరయు నంబర్‌ వన్‌గా నిలిచింది. 2026 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అండర్‌-8 విభాగానికి అర్హత ఉన్న బాలికల్లో ఫిడే రేటింగ్‌ పరంగా ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా కొనసాగింది. అయితే చెస్‌ కోసం చదువును మాత్రం ఆమె పక్కన పెట్టలేదు. డల్లాస్‌లోని గ్రేట్‌ హార్ట్స్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతూ.. ప్రతిరోజూ పాఠశాల తర్వాత చెస్‌ సాధన చేస్తోంది. సమయాభావంతో కూచిపూడికి విరామం ఇచ్చినా పియానోను కొనసాగిస్తోంది. వేసవి సెలవుల్లో టైక్వాండో కూడా నేర్చుకుంటోంది.

సరయు తండ్రి హైదరాబాద్‌, తల్లి గన్నవరం పట్టణానికి చెందినవారు. తమ కుమార్తె ఎదుగుదలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లు అందిస్తున్న సహకారమే ప్రధాన కారణమని వారు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana