- 70 వేల మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది మోహరింపు
- పలు ఐరోపా దేశాలకు విస్తరించిన యువత ఆందోళనలు
ప్యారిస్: జీవన వ్యయాలు, విద్యకు సంబంధించిన సమస్యలపై ఫ్రాన్స్‌లో యువత చేపట్టిన నిరసనలు వరుసగా మూడో వారాంతానికి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 70 వేలమంది పోలీసులు, ఆర్మీ సిబ్బందిని మోహరించారు. ప్యారిస్‌లో ర్యాలీ మార్గాన్ని నగరశివార్లకు మార్చారు. మరోవైపు యువత నేతృత్వంలోని నిరసనలు ఐరోపాలోని పలు దేశాలకు విస్తరించాయి. నగర కేంద్రంలో కార్మిక సంఘాలు, ఎల్లో వెస్ట్ ఉద్యమకారుల ర్యాలీలను పోలీసులు నిషేధించారు.
ప్రభుత్వ ఆంక్షలను కార్మిక, విద్యార్థి సంఘాలు కోర్టులో సవాలు చేశాయి. అయితే వాటికి అనుకూలంగా తీర్పు రాలేదు. అక్టోబర్ 17న అల్లర్లు, దోపిడీలు జరిగిన ప్లాస్ డి లా రిపబ్లిక్, లెస్ హాలెన్ ప్రాంతాల్లో శనివారం, ఆదివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రవేశాన్ని నిషేధించారు. జర్మనీలో 'జెన్ జెడ్ రెగెల్ట్’ పేరుతో యువత చేపట్టిన కార్యక్రమంలో సుమారు 30 నగరాల్లో నిరసనలకు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో 1.4 లక్షల మంది తమ పేర్లు నమోదుచేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిరసనల నేపథ్యంలో 'బ్లూకస్’ పేరుతో గుర్తు తెలియని టిక్‌టాక్ నెట్‌వర్క్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇటలీలోని మిలాన్, టూరిన్, బొలోగ్నా నగరాల్లో ఘర్షణలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోర్చుగల్‌లలోనూ టిక్‌టాక్ ద్వారా నిరసనలకు పిలుపులు వెలువడ్డాయి.

