- ఉండలేక.. వెళ్లలేక జీవితాలు ఆగమాగం
- దుర్వాసన, ఈగలు, దోమలతోనే సహవాసం
- చర్మ, శ్వాసకోశ వ్యాధులతో బతుకు దుర్భరం
- ఇండ్లు అమ్ముకుందామంటే కొనేవారు లేరు
- జవహర్‌నగర్ డంపింగ్‌తో బతుకులు ఛిద్రం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు లక్షలాది మంది జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నది. నింగి.. గాలి.. నీరు విషత్యులం.. ఈగలు.. దోమలతో సహవాసం..చేయాల్సిన నిస్సహాయక స్థితి వారిది. విషపు గాలులు, దుర్గంధభరితమైన వాతావరణంతో ఊళ్లకు ఊళ్లే మంచాన పడుతున్నాయి. 20కి పైగా గ్రామాల్లో నిత్యం ఎంతో మంది ఆస్పత్రి పాలవుతున్నారంటే.. కాలుష్య ప్రభావం ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.
కష్టపడి సంపాదించిన డబ్బంతా రోగాలకే వెచ్చించాల్సి వస్తున్నదని జనం వాపోతున్నారు. ఎప్పుడు ఎవరికీ ఓ రోగం వస్తుందోనన్న భయం ఇక్కడి ప్రజలను నిత్యం వెంటాడుతున్నది. మునుపెన్నడూ చూడని, సోకని వ్యాధుల బారిన పడుతూ..ఆర్థికంగా చితికి పోతున్నారు. 'విష వలయాలు' కబళిస్తున్నా.. ఏమీ చేయలేక.. ఉండలేక.. వెళ్ల లేక..కలుషిత నీరు తాగలేక..కంటి మీద కునుకు లేక.. వేదనకు గురవుతున్నారు. ఇల్లు అమ్ముకొని వలస పోదామన్నా.. కొనేవారు దిక్కులేక.. నిత్యం నరకం అనుభ విస్తున్నారు.

సిటీ బ్యూరో, మేడ్చల్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): విషపు గాలులు, దుర్గంధభరిత వాతావరణంతో ఊళ్లకు ఊళ్లే అవస్థలు పడుతున్నాయి. 20కి పైగా గ్రామాల్లో నిత్యం ఎవరో ఒక్కరు ఆస్పత్రి పాలవుతున్నారు. మునుపెన్నడూ చూడని, సోకని వ్యాధుల బారిన పడుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో తెలియని దయనీయమైన దుర్భర జీవనం సాగిస్తున్నారు. తమకు సంబంధం లేకపోయినా.. తమ ప్రమేయం లేకపోయినా దుర్గంధం, కాలుష్యం కాటేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
ఇదీ జవహర్‌నగర్ పరిసరాల్లోని గ్రామాల ప్రజల దుస్థితి. నిత్యం ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ శారీరకంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి తెచ్చిన చెత్తతో వ్యాధులు ప్రబలుతున్నాయి. దుర్గంధం, కాలుష్యం వల్ల తాగునీటిని కూడా కొనుక్కుని తాగుతున్నారు. కలరా, మలేరియా, టైఫాయిడ్, చర్మ, శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక రోగంతో బాధపడుతూ రోగనిరోధక శక్తిని కోల్పోయి వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఇండ్లకు చుట్టాలు కూడా రాని దుర్బర జీవనాన్ని సాగిస్తున్నారు. జవహర్‌నగర్ పరిసర ప్రజలు అనధికార వెలివేతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వాసన భరించలేకపోతున్నాం
డంపింగ్ యార్డు నుంచి వచ్చే వాసన భరించలేకపోతున్నాం. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలంతా రోగాల బారిన పడుతున్నారు. దమ్మాయిగూడ పరిధిలో ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు పసుపు పచ్చగా వస్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. బోర్ల నీరు దుర్వాసన వస్తుండంతో అవసరాలకు కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. దుర్గంధమైన వాసన వల్ల శ్వాస పీల్చుకోలేకపోతున్నాం. డంపింగ్ యార్డు నుంచి రోజురోజుకూ దుర్వాసన పెరిగిపోతున్నది. ప్రభుత్వానికి డంపింగ్ యార్డును తొలగించాలని ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా చర్యలు తీసుకోవడం లేదు.
– రమేశ్‌గౌడ్, దమ్మాయిగూడ
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. మా ప్రాణాలు పోతున్నా అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును తొలగించి మా ప్రాణాలను కాపాడాలి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల డంపింగ్ యార్డు నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా చెత్తను గుట్టలుగా పోస్తూనే ఉన్నారు.
-నరహరిగౌడ్, దమ్మాయిగూడ
నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్
జవహర్‌నగర్ డంపింగ్ యార్డును రాంకీ సంస్థ నిబంధలు పాటించకుండా నిర్వహిస్తున్నది. చెత్త వినియోగం, రీసైక్లింగ్ ప్రణాళికబద్ధంగా చేపట్టడం లేదు. రీసైక్లింగ్ వేగవంతంగా జరగకపోవడం వల్ల చెత్త గుట్టగుట్టలుగా పేరుకుపోతున్నది. నగరంలోని చెత్త మొత్తం ఇక్కడే డంపు చేయడంతో తీవ్రమైన దుర్వాసన, కాలుష్యంతో పరసర గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసిన సమయంలో 2,500 మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే వచ్చేది. ఇప్పుడు 10 వేల మెట్రిక్ టన్నులు దాటుతుండటంతో దుర్వాసన, కాలుష్యం తీవ్రత పెరిగిపోతున్నది. డంపింగ్ యార్డును తొలగించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం.
-సమ్మిరెడ్డి, డంపింగ్ యార్డు బాధిత జేఏసీ కో కన్వీనర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీ
పరిసరాలన్నీ విషపూరితమే
డంపింగ్ యార్డు సమీపంలోని ప్రాంతాలన్నీ విషపూరితంగా మారాయి. శ్వాసకోస వ్యాధులతో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురువుతున్నారు. గాలి పీల్చుకుందామన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. చెత్తను తరలించే క్రమంలో రాంకీ యజమాన్యం నిబంధనలు పాటించడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకొస్తున్నారు. చెత్త, దుమ్ము, చెడు గాలి ఇండ్లలోకి చేరి ఇబ్బందులు పడతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలి. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం క్యాపింగ్ వేసిన ప్రాంతంలో చెత్త వేయవద్దని స్పష్టంగా సూచించినా ప్రభుత్వం, రాంకీ సంస్థ పట్టించుకోవడం లేదు.
-సందీప్, కార్మిక్‌నగర్
బంధువులు మా ఇంటికి రావడం లేదు
విపరీతమైన దుర్వాసన, కాలుష్యం వల్ల మా ఇండ్లలోకి బంధువులు రావడమే మానేశారు. ఎవరైనా ఒక్కసారి వస్తే మళ్లీ రావడం లేదు. ఎంత దగర్గి బంధువు ఇంటికి వచ్చినా భోజనం చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంత దుర్వాసనలో ఎలా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం చెప్పలేకపోతున్నాం. ఈ బాధల నుంచి మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిరుపేదల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడటం సరికాదు. ఇకనైనా దుర్వాసన, కలుష్య బాధల నుంచి విముక్తి కల్పించండి.
-పద్మ, కార్మికనగర్
ప్రజల ప్రాణాలతో చెలగాటం
నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్తను ఒకేదగ్గర పోగు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. డంపింగ్ యార్డు కెపాసిటీకి మించి చెత్త తెస్తున్నారు. చెత్తను డంపింగ్ చేయడం తప్ప, నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేరకు కాలుష్యం ఏర్పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దుర్వాసన రాకుండా క్యాపింగ్ చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోడంతో క్యాపింగ్ మీద చెత్తను వేయడంతో దుర్వాసన మరింత పెరిగింది. దీంతో ఇక్కడి ప్రజలు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును తరలించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– మేకల కావ్య, మాజీ మేయర్, జవహర్‌నగర్
మా బాధలు పట్టడం లేదు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమీప గ్రామాల ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు, మంత్రులకు ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన కరవైంది. కాలుష్యం, దుర్వాసనలో మా బతుకులు చితికిపోతున్నా వేడుక చూస్తున్నారు. వేలాది మంది అనారోగ్యాల బారిన పడి శారీరకంగా, మానసింగా, ఆర్థికంగా నష్టపోతున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి ఇంట్లో నిత్యం ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. మా ఇండ్లకు ఎవరూ రావడం లేదు. ఇప్పటికైనా డంపింగ్ యార్డును తొలగించి మమ్మల్ని ఆదుకోవాలి.
-రాజు, బండ్లగూడ
ఎటు చూసినా రోగాలే..
డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కాలుష్యం, దుర్వాసన వల్ల అనేక వ్యాధుల భారిన పడుతున్నారు. కలుషితమైన గాలి, నీటితోపాటు దుర్వాసన వల్ల కలరా, టైఫాయిడ్, మలేరియా, అలర్జీ వంటి వ్యాధులు వస్తున్నాయి. దుర్వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులతోపాటు ఉపిరితిత్తులు చెడిపోయో ప్రమాదం ఉంది. ప్రతిరోజూ కాలుష్యం ఉన్న గాలిని పీల్చడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముంది. నీటి కాలుష్యంతో పాటు దుర్వాసన వల్ల చర్మవ్యాధులు వస్తాయి. కలుషిత గాలిని పీల్చడం వల్ల వచ్చే రోగాలకు మందులు వాడినా ఉపయోగం ఉండదు. చర్మ వ్యాధులు వస్తే శరీరం అంతటా వ్యాపించి తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. డంపింగ్ యార్డు నుంచి సుమారు 8 కిలోమీటర్ల వరకు ఈ కాలుష్య ప్రభావం ఏర్పడింది.
-డాక్టర్ వేణుగోపాల్, జనరల్ ఫిజీషియన్

