Dailyhunt
గల్ఫ్‌ సంక్షోభం చమురు ధరలు కీలకం..!

గల్ఫ్‌ సంక్షోభం చమురు ధరలు కీలకం..!

మెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, గ్యాస్‌ ధరలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావం.. దేశీయ స్టాక్‌ మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది.

దీంతో మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్లకు మధ్య ఊగిసలాటకు గురవుతున్నారు. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 30.96 పాయింట్లు పడిపోయి 74,532.96 వద్ద నిలిచింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 36.60 పాయింట్లు దిగజారి 23,114.50 దగ్గర ఆగింది. దీన్నిబట్టి గత వారం భారతీయ ఈక్విటీల్లో ఏ స్థాయి ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఇరాన్‌పై దాడుల్ని ఉద్దృతం చేసే దిశగా వెళ్తుండటం, ఇందుకు ప్రతిగా అగ్రరాజ్యానికి మద్దతునిస్తున్న పొరుగు దేశాలపై ఇరాన్‌ విరుచుకుపడే యోచనలో ఉండటం.. గల్ఫ్‌ దేశాల్లో చమురు మంటల్ని రేపుతున్నది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా పెద్ద ఎత్తునే ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు సెల్లింగ్‌ ప్రెషర్‌ను ఎదుర్కొంటారన్న అభిప్రాయాలు మెజారిటీ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధానంగా చమురు-గ్యాస్‌, మెటల్‌, ఆటో, రిటైల్‌ రంగ షేర్లు పెట్టుబడుల ఉపసంహరణకు గురికావచ్చంటున్నారు.

ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 93 మార్కును దాటి ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది. ఇది కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. మరోవైపు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల కదలికలు, విదేశీ మదుపరుల పెట్టుబడులూ కీలకమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కొనసాగితే నిఫ్టీకి 22,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగి స్తే 22,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,500-23,700 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.

గమనిక..

స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్‌ పల్స్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana