Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గట్టెక్కిన జ్వెరెవ్‌

గట్టెక్కిన జ్వెరెవ్‌

  • యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో చెమటోడ్చి గెలిచిన టాప్‌ సీడ్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మరో భారీ సంచలనం తృటిలో తప్పింది. టోర్నీ టాప్‌ సీడ్‌, ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తొలి రౌండ్‌లోనే అనామక ఆటగాడి చేతిలో ఓటమి అంచుల్లోంచి తేరుకొని గట్టెక్కాడు.

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన ప్రపంచ 89వ ర్యాంకర్‌ లోరెంజో సోనెగో.. జ్వెరెవ్‌కు చుక్కలు చూపెట్టాడు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ పోరులో జ్వెరెవ్‌ 6-4, 3-6, 6-7(7/9), 7-5, 6-4తో అతి కష్టమ్మీద విజయం సాధించాడు.

నాలుగో సెట్‌లో సోనెగో రెండు మ్యాచ్‌ పాయింట్లపై నిలిచిన దశలో జ్వెరెవ్‌ అసాధారణ పోరాట పటిమతో తిరిగి పుంజుకుని సెట్‌ను గెలుచుకోవడమే కాకుండా నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం అందుకున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. 2003 వింబుల్డన్‌లో లెటన్‌ హెవిట్‌ తర్వాత గ్రాండ్‌స్లామ్‌ తొలి రౌండ్‌లోనే వెనుతిరిగిన తొలి టాప్‌ సీడ్‌ ప్లేయర్‌గా జ్వెరెవ్‌ చెత్త రికార్డు మూటగట్టుకునేవాడు. ఈ పోరులో 16 ఏస్‌లతో హడలెత్తించిన సెనెగో 5 బ్రేక్‌ పాయింట్లతో మూడు నెగ్గాడు. 12 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్‌ 8 డబుల్‌ ఫాల్ట్స్‌ చేసినా.. 5 బ్రేక్‌ పాయింట్లు నెగ్గి 61 విన్నర్లతో ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో అతను ఫ్రాన్స్‌కు చెందిన క్వెంటిన్‌ హాలీస్‌తో తలపడనున్నాడు.

40వ ఏట మోన్‌ఫిల్స్‌ రికార్డు విక్టరీ
ఫ్రాన్స్‌ ప్లేయర్‌ మోన్‌ఫిల్స్‌ తన 40వ పుట్టినరోజు వేళ తొలి రౌండ్‌లో 2-6, 6-1, 6-2, 6-0తో అడోల్ఫో డేనియల్‌ వల్లెజోని ఓడించాడు. ఈ విజయంతో 1992లో జిమ్మీ కానర్స్‌ (40 ఏండ్ల్ల వయసులో) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా మోన్‌ఫిల్స్‌ రికార్డుకెక్కాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ ప్లావియో కొబోలి (ఇటలీ) తొలి రెండు సెట్లు కోల్పోయినా పుంజుకొని 3-6, 2-6, 6-3, 6-4, 6-4తో కొమెసనా (అర్జెంటీనా)పై నెగ్గగా, తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 6-3, 6-2, 6-4తో అమెరికాకే చెందిన బ్లాంచ్‌ను ఓడించాడు.

మూడో రౌండ్‌కు పెగులా, పౌలిని
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ అమెరికా స్టార్‌ జెస్సికా పెగులా, 19వ సీడ్‌ జాస్మిన్‌ పౌలిని మూడో రౌండ్‌ చేరారు. రెండో రౌండ్‌లో పెగులా 6-3, 6-1తో తన దేశానికే చెందిన కెనిన్‌ను ఓడించింది. ఇటాలియన్‌ పౌలిని కూడా 6-4, 6-1తో తోటి ప్లేయర్‌ స్టెఫానినిపై గెలిచింది. తొలి రౌండ్‌ పోటీల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ రిబకినా (కజకిస్థాన్‌) 6-3, 6-2తో అమెరికా టీనేజర్‌ థియా ఫ్రోడిన్‌ను ఓడించింది. విల్‌ స్మిత్‌ నటించిన ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం 'కింగ్‌ రిచర్డ్‌’ సినిమాలో సెరెనా విలియమ్స్‌ చిన్ననాటి పాత్రకు బాడీ డబుల్‌ (డూప్‌)గా చేసిన ఫ్రోడిన్‌, రిబకినాలాంటి అగ్రశ్రేణి ప్లేయర్‌తో మ్యాచ్‌లో 11 ఏస్‌లు సంధించి తన ప్రతిభ చాటుకుంది.నాలుగో సీడ్‌ గాఫ్‌ (అమెరికా) 6-3, 6-4తో సొన్మెజ్‌ (తుర్కియే)ను ఓడించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ విన్నర్‌, ఐదో సీడ్‌ ఆండ్రీవా (రష్యా) 6-2, 6-2తో జానిస్‌ త్జెన్‌ (ఇండోనేషియా)పై, 22వ సీడ్‌ కీస్‌ 7-5, 6-4తో కోర్నీవాపై గెలిచారు. 17వ సీడ్‌ అలెగ్జాండ్రా ఇయాలా (ఫిలిప్పీన్స్‌) 6-1, 6-2తో స్టోయియానా (అమెరికా)ను
ఓడించగా.. 12వ సీడ్‌ బెన్సిచ్‌ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana