Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gurugram | వరద నీటిలో గురుగ్రామ్‌.. రూ. 1,400 కోట్ల ఖర్చుతో డ్రైనేజీ వ్యవస్థ

Gurugram | వరద నీటిలో గురుగ్రామ్‌.. రూ. 1,400 కోట్ల ఖర్చుతో డ్రైనేజీ వ్యవస్థ

  • రూ. 1,400 కోట్ల ఖర్చుతో డ్రైనేజీ వ్యవస్థ
  • మురికివాడగా మారిన స్మార్ట్‌ సిటీ

గురుగ్రామ్‌: బీజేపీ పాలిత హర్యానా ఆదాయంలో గురుగ్రామ్‌ వాటా సుమారు 65శాతం.

అందుకే గురుగ్రామ్‌.. హర్యానాకు బంగారు బాతు అయ్యింది. రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు వర్షం కురిస్తే ఏమాత్రం ఉపయోగం లేనిదిగా మారింది. మొన్నటి సోమవారం నాడు గురుగ్రామ్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు నదులుగా మారగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాజీవ్‌ చౌక్‌ వద్ద విద్యార్థులు నీటిలో ఈదుకుంటూ వెళుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

భారతదేశ కార్పొరేట్‌ షోపీస్‌గా పేరొందిన మిలీనియం సిటీ వర్షం కురిస్తే 'స్వాంకీ స్లమ్‌'(విలాసవంతమైన మురికివాడ)గా మారిపోతున్నదని అంటుంటారు. రాజకీయ విశ్లేషకుడు సుశాంత్‌ సరీస్‌ నగర పరిస్థితి గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంగారు గుడ్లను పెట్టే బాతు లాంటి గురుగ్రామ్‌ను చంపేస్తున్నదని ఆరోపించారు. ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ను అడ్డుకోవడంలో, సరైన రోడ్లను నిర్మించడంలో నగర డ్రైనేజీ అవసరాలను అర్థం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. గురుగ్రామ్‌ నివాసి హిందోల్‌ సేన్‌ గుప్తా మాట్లాడుతూ తాము ఇకపై గురుగ్రామ్‌లో ఉండాలనుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి అధిక పన్నులు, భారీ అద్దెలు చెల్లిస్తున్నప్పటికీ తాము ప్రతియేటా నరకాన్ని అనుభవిస్తున్నామన్నారు.

వర్షాలు పడినప్పుడు ఇంటికి చేరుకునేందుకు ఐదు కిలోమీటర్ల దూరానికి మూడు గంటలకు పైగా సమయం పడుతున్నదన్నారు. పూడుకుపోయిన డ్రైనేజీలు, సరిపోని సామర్థ్యం, గురుగ్రామ్‌ విస్తరణకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడంలో విఫలం కావడం మొదలైనవన్నీ ప్రస్తుత దుస్థితికి కారణమని స్థానికుడు అభిషేక్‌ బోస్‌ అన్నారు. గురుగ్రామ్‌ మౌలిక సదుపాయాలు కుప్పకూలడానికి బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఆరోపించారు. మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసినట్లుగా చెబుతున్న రూ.1,400 కోట్లతో నగరానికి ఏమి లభించిందని ఆయన ప్రశ్నించారు. కాగా గురుగ్రామ్‌లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, నీరు నిలవడం వల్ల సెక్టార్‌ 9లో సిమెంట్‌ బస్తాలతో కూడిన ఒక ట్రక్కు రోడ్డులోకి కుంగిపోయింది. ఇది ఇక్కడి ఇంజినీరింగ్‌ అద్భుతాలకు రోడ్ల దుస్థితికి అద్దం పడుతున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana