హైదరాబాద్, జూన్ 17: అమెరికాకు చెందిన ఈవీల తయారీ దిగ్గజం టెస్లా..రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో తన ఐదో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
ఈ సందర్భంగా కంపెనీ రెండు మాడళ్లను ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్టు, తద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువకావడానికి వీలుపడనున్నదని కంపెనీ వెల్లడించింది.
మాడల్ వై: దేశీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని టెస్లా మాడల్ వై రూపొందించింది. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ కారు ధరను రూ.50.89 లక్షలుగా నిర్ణయించింది. రూ.6 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి రూ.39,990 నెలవారీ చెల్లింపులతో ఈ కారును కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే నెల నుంచి డెలివరీ చేయబోతున్నది. కేవలం 5.9 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోనున్నది.
మాడల్ వైఎల్: కుటుంబం మొత్తానికి సరిపడే విధంగా డిజైన్ చేసిన మాడల్ వైఎల్‌లో ఆరుగురు కూర్చోవడానికి వీలుంటుంది. 5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 681 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలుగా నిర్ణయించింది. రూ.6.50 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి, రూ.49,990 నెలవారీ చెల్లింపులతో కొనుగోలు చేసే అవకాశం సంస్థ కల్పించింది.

