Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Harish Rao | వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డి కుప్పకూల్చారు.. కాంగ్రెస్ వెయ్యి రోజుల దగాపై హరీశ్‌రావు ధ్వజం

Harish Rao | వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డి కుప్పకూల్చారు.. కాంగ్రెస్ వెయ్యి రోజుల దగాపై హరీశ్‌రావు ధ్వజం

Harish Rao | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని ఇస్తే..

రేవంత్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్ ఎంతో కష్టపడి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా కుప్పకూలుస్తోందని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ వైఫల్యాలపై ‘ఛార్జ్ షీట్’ విడుదల చేశామని తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ ఘోర వైఫల్యాలను ఎండగడుతూ ఈ ఛార్జ్ షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల పేరుతో బాండు పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఒక కొత్త రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో కష్టపడి అద్భుతంగా నిర్మించారని తెలిపారు. అనేక కార్యక్రమాలతో దేశం నేర్చుకునే విధంగా తొమ్మిదిన్నర ఏళ్లు గొప్ప పాలనను అందించారన్నారు. అది తాగునీటి రంగం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు.. ఏ రంగం చూసినా తెలంగాణను దేశానికే ఆదర్శంగా, తలమానికంగా కేసీఆర్ తయారు చేశారని అన్నారు. వ్యవసాయంలో అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు.

కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అద్భుతమైన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయని హరీశ్‌రావు అన్నారు. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, విద్యుత్, తాగునీరు, శాంతిభద్రతలు.. ఇలా ప్రతీ వ్యవస్థా కుప్పకూలిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఉంటే.. ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో కరెంట్ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితి చూస్తున్నామని అన్నారు.

దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం.. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా దొరకని దీన స్థితికి దిగజారిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పజెబితే.. దాన్ని మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చారని అన్నారు. పురోగమనం వైపు వేగంగా ప్రయాణం చేయాల్సిన రాష్ట్రం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో తిరోగమనం వైపు పయనిస్తోందని అన్నారు.

ఆరు గ్యారంటీల అమలులో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల అన్ని శాఖల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. వ్యవస్థలను కాపాడాలని, ఆరు గ్యారంటీలు అమలు కావాలని, ప్రజల కష్టాలు తొలగిపోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను ప్రకటించిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి మా ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana