Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hemp Hearts | శాకాహారులకు ప్రోటీన్లను అందించే అత్యుత్తమ ఆహారం ఇది.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు..

Hemp Hearts | శాకాహారులకు ప్రోటీన్లను అందించే అత్యుత్తమ ఆహారం ఇది.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు..

Hemp Hearts | శాకాహారులు, వీగన్లు రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ పొందేందుకు ఎన్నో మొక్కల ఆధారిత ఆహారాలను ఎంచుకుంటారు. అయితే ప్రోటీన్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు వంటి పలు పోషకాలను ఒకేసారి అందించే చిన్న విత్తనం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది.

అదే హెంప్ హార్ట్స్. పొట్టు తొలగించిన హెంప్ విత్తనాలు తినడానికి సులభంగా ఉండటంతోపాటు, తక్కువ పరిమాణంలోనే పలు ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. హెంప్ హార్ట్స్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. సుమారు రెండు టేబుల్ స్పూన్ల హెంప్ హార్ట్స్‌లో 8.4 గ్రాముల వరకు మొక్కల ఆధారిత ప్రోటీన్ లభిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన మొత్తం తొమ్మిది ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు ఇందులో ఉంటాయి. అందువల్ల వీటిని కంప్లీట్ ప్రోటీన్ అందించే ఆహార వనరుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా శాకాహారులు, వీగన్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అమైనో యాసిడ్లు అధికం..

హెంప్ హార్ట్స్‌లో అర్జినైన్ అనే అమైనో యాసిడ్ కూడా సహజంగా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు సడలించడంలో, రక్తప్రసరణ సక్రమంగా ఉండటంలో, సాధారణ రక్తపోటు నియంత్రణకు తోడ్పడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
వీటిలో ప్రోటీన్ మాత్రమే కాకుండా మెగ్నిషియం, ఒమెగా-3 వంటి పోషకాలు కూడా లభిస్తాయి. సుమారు 25 గ్రాములు లేదా రెండు టేబుల్ స్పూన్ల హెంప్ హార్ట్స్‌లో దాదాపు 175 మిల్లీగ్రాముల మెగ్నిషియం, 2.5 గ్రాముల ఏఎల్ఏ ఒమెగా-3 లభిస్తుంది. ఇందులో ఏఎల్ఏ, ఎల్ఏ, జీఎల్ఏ వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. హెంప్ హార్ట్స్‌లో ఒమెగా-6 నుంచి ఒమెగా-3 నిష్పత్తి సుమారు 2.5:1 నుంచి 3:1 వరకు ఉంటాయి. హెంప్ హార్ట్స్‌లోని పోషకాల కలయిక వాటిని చిన్న పరిమాణంలోనే ఎక్కువ పోషకాలను అందించే ఆహారంగా మారుస్తుంది. ప్రోటీన్, మెగ్నిషియం, ఏఎల్ఏ, జీఎల్ఏ, అర్జినైన్ వంటి పోషకాలు ఇందులో ఉండటం వల్ల రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవచ్చు.

శరీరంలోని వాపులు తగ్గేందుకు..

హెంప్ హార్ట్స్‌లోని కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వాపు సంబంధిత ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా జీఎల్ఏ వాపును నియంత్రించే మార్గాల్లో భాగస్వామ్యం అవుతుందని, వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మం, గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. హెంప్ విత్తనాలకు భారతీయ సంస్కృతి, పురాణాలతో కూడా ఒక ఆసక్తికరమైన సంబంధం ఉంది. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని లోకరక్షణ కోసం పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుకున్న కథ తెలిసిందే. ఈ కారణంగానే శివుడిని నీలకంఠుడిగా పిలుస్తారు. హెంప్ మొక్కకు సంబంధించిన విత్తనాలపై కూడా ఈ పురాణగాథతో ముడిపడిన సాంస్కృతిక ప్రస్తావనలు ఉన్నాయి.

పెద్ద మొత్తంలో అవసరం లేదు..

రోజువారీ ఆహారంలో హెంప్ హార్ట్స్‌ను పెద్ద మొత్తంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మొదట ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారు 12 నుంచి 13 గ్రాములతో ప్రారంభించాలి. వీటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, సలాడ్లు వంటి ఆహారాల్లో కలుపుకోవచ్చు. అలాగే పప్పు, చిల్లా పిండిలో లేదా గోధుమ పిండిలో కూడా హెంప్ హార్ట్స్‌ను కలిపి తీసుకోవచ్చు. ఇలా సాధారణంగా తీసుకునే ఆహారాల్లోనే వీటిని చేర్చుకోవడం ద్వారా అదనంగా మొక్కల ఆధారిత ప్రోటీన్‌తో పాటు మెగ్నిషియం, ఒమెగా-3 తదితర పోషకాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే ఏదైనా కొత్త ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకునే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, ఆహార అలవాట్లను పరిగణనలోకి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana