Thursday, 22 Apr, 11.10 pm నమస్తే తెలంగాణ

తాజావార్తలు
హిందుస్థానీ సంగీత శిఖరం

  • నేడు ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ వర్ధంతి

దేశ విభజన తర్వాత లాహోర్‌ వదలి భారత్‌కు వచ్చిన సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత కళాకారుడు ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ ఈ దేశ సర్వాంగ సుందర సంస్కృతికి ప్రతీక. హిందుస్థానీ సంగీత ప్రపంచంలో మేరునగధీరుడు. పాటియాలా ఘరానా సంగీత సంప్రదాయాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయుడు. పాటియాలా ఘరానాలో ఖయాల్‌ గానంతోపాటు టుమ్రీలు పాడే సంప్రదాయం కూడా ఉన్నది. బడే గులాం అలీఖాన్‌ పాడిన.. యాద్‌ పియాకి ఆయే, కా కరూ సజనీ ఆయే న బాలం తదితర టుమ్రీలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. ఆయనకు తెలంగాణలో హైదరాబాద్‌ చిరపరిచితమే. బోథ్‌లో కొంతకాలం పక్షవాతానికి చికిత్స తీసుకోగా, చివరికి హైదరాబాద్‌లోనే 1968 ఏప్రిల్‌ 23న మరణించారు.

ఉస్తాద్‌ బడేఖాన్‌ సాహెబ్‌ గళంలో నుంచి వెలువడిన హంసధ్వని రాగం అనితరసాధ్యం. ఆ రాగం వినడం ఒక అద్భుతమైన అనుభవం. ఆఫ్ఘనిస్థాన్‌ రాజు ఈ సంగీతానికి ముగ్ధుడై తన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉండిపోవలసిందిగా కోరితే- భారత్‌ పట్ల ప్రేమతో ఆ పదవిని నిరాకరించాడు ఉస్తాద్‌. తాను జన్మించినది భారతదేశంలో (విభజనకు పూర్వం), సంగీత విద్యలో పాండిత్యాన్ని గడించింది భారతదేశంలో. దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఉస్తాద్‌ సంగీత ప్రావీణ్యత సంగీత రసజ్ఞులకు తెలిసింది. ఒకసారి మద్రాస్‌ నగరంలో ఆయన సంగీత కచేరీ జరిగినప్పుడు కార్యక్రమ నిర్వాహకుడైన కర్ణాటక సంగీత విద్వాంసుడు జీఎన్‌ బాలసుబ్రమణ్యం ఉస్తాద్‌కు సన్మానం చేసి పాదాభివందనం చేశాడట. సద్బ్రాహ్మణుడైన ఆయన ఒక ముసల్మాన్‌కు పాదాభివందనం చేయడం పట్ల విమర్శలు చెలరేగినవి. నేను ఆయనలో మూర్తీభవించిన సంగీత సరస్వతికి పాదాభివందనం చేశానని వినమ్రంగా జవాబిచ్చాడట జీఎన్‌బీ. ఉస్తాద్‌ సంగీత కచేరీ ముగిసిన తర్వాత ఆయన గానానికి పరవశం చెందిన సభాసదులు కూడా ఉస్తాద్‌లోని సంగీత సరస్వతికి నమస్కారం చేశారట. ఈ ఉదంతాన్ని సామల సదాశివ స్వరలయలు పుస్తకంలో ప్రస్తావించారు. కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్‌. సుబ్బులక్షి ఉస్తాద్‌ను తన సోదర సమానుడిగా భావించేది. ఆయన మద్రాస్‌ నగరం వచ్చిన ప్రతిసారీ తప్పక సుబ్బులక్ష్మి ఆతిథ్యం స్వీకరించేవాడు.

ముంబైలో నివసించే ఉస్తాద్‌ 1967లో పక్షవాతానికి గురైనప్పుడు పక్షవాతానికి మూలికా వైద్యం చేసే హకీం ఉన్నాడని తెలిసి చికిత్స కోసం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ గ్రామానికి వచ్చాడు. బోథ్‌ నాటికి తాలూకా కేంద్రమైనా ఒక కుగ్రామమే. బోథ్‌ డాక్‌ బంగ్లాలో ఉస్తాద్‌ మూడునెలలున్నాడు. మూలికా వైద్యం చేయించుకున్నాడు. ఆయన బోథ్‌లో ఉన్న రోజుల్లోనే వినాయక నవరాత్రులు వచ్చాయి. మండపంలో మూడుగంటలపాటు సంగీత రాగాలు, భజనలు, టుమ్రీలు వినిపించాడు ఉస్తాద్‌. 1902 ఏప్రిల్‌ 2న పంజాబ్‌ రాష్ట్రంలో పుట్టిన బడేఖాన్‌ సాహెబ్‌ భారతదేశానికి సేవచేస్తూ ఈ నేల మీదనే కన్ను మూయాలని భావించాడు. 1968 ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌లో పక్షవాతం ముదిరి తనువు చాలించాడు. ఆయన పార్థివ శరీరాన్ని హైదరాబాద్‌లోనే పాయెగాల అధికారిక శ్మశానవాటికలో ఖననం చేశారు. కోఠిలో ఒక రోడ్డుకు ఆయన పేరు కూడా పెట్టారు.

ఆయన మరణించినప్పుడు హిందూ, ముస్లిం సంస్కృతులపై ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు రాసిన సంపాదకీయంలో మాటల ప్రాసంగికత ఇప్పుడు మరింత పెరిగింది. 'హిందూ మహమ్మదీయ మతాలు భిన్నమైనవి కాబట్టి, ఆ సంస్కృతులు భిన్నమైనవి కాకతప్పదని వాదించింది ఒక్క మహమ్మదలీ జిన్నా మాత్రమే కాదు, ఒక వినాయక్‌ దామోదర్‌ సావర్కార్‌ మాత్రమే కాదు, అట్టివారు పెక్కుమంది ఇదివరలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ వాద తిరస్కృతికి ప్రధానంగా పేర్కొనదగింది హిందుస్తానీ సంగీతమే. కర్ణాటక సంగీతం అన్య ప్రభావాలను కొన్నింటిని అంతర్లీనం చేసుకొనడం ద్వారా రూపొందినట్టిదే హిందుస్తానీ సంగీతం. హిందువుల వలె మహమ్మదీయులు భక్తి శ్రద్ధలతో పరిపోషించడం ద్వారా పరిఢవిల్లినట్టిదే హిందుస్తానీ సంగీతం. కేవలం సంగీతంలోనే కాదు చిత్ర వాస్తు కళల్లో కూడా హిందూ ముస్లిం ప్రభావాల సమ్మేళనం ద్వారా కొత్త బాణీలు తలయెత్తాయి. ఇట్టి పరిణామాలకు దోహదం కూర్చినప్పుడే జాతి, మత, కుల, విభేదాలకు అతీతమైన సర్వాంగ సుందర భారతీయ సంస్కృతి పెంపొందుతుంది. మనం లక్షించవలసిన, సాధించవలసిన ఈ సర్వాంగ సుందర భారతీయ సంస్కృతి పరిపోషణకై తన జీవితాన్ని సంగీత కళా రంగంలో ధారవోసిన మహనీయుడు ఉస్తాద్‌ బడే గులాం అలీ ఖాన్‌’. ఇప్పుడు విశాల భావనతో అసలైన భారతీయ సంస్కృతి పరిరక్షణను పెంపొందించాలి.

శ్రీధర్‌రావు దేశ్‌పాండే

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top