- తొలిరోజే 350మందికి అందజేత
- రెండ్రోజుల్లో కరోనా బాధితులందరికీ..
- త్వరలో 500మందితో కలెక్టర్, ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్
- జిల్లాకు చేరిన మరో 4500 ర్యాపిడ్ కిట్లు
నీలగిరి : కరోనా వైరస్ బారినపడి ఇంటివద్దే ఉంటూ చికిత్స పొందుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ నల్లగొండ జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలోని శివాజీనగర్, ఆర్జాలబావి ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ అన్నిమళ్ల కొండల్‌రావు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 32 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని పాజిటివ్ బాధితులకు తొలిరోజు 350కిట్లను అందజేశారు.
నెగెటివ్‌లు ఎక్కువగా వస్తే చర్యలు..
జిల్లాలో అన్ని ప్రాథమిక, అర్బన్ హెల్త్‌సెంటర్లలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని నిబంధన ఉన్నా పీహెచ్‌సీ స్థాయిలో అధికారులు ఇష్టానుసారంగా చేస్తున్నట్లు సమాచారం. కిట్లు వారి వద్ద ఉండడంతో బంధువులకు, స్నేహితులకు టెస్టులు చేస్తుండడంతో నెగెటివ్ రిపోర్టులు రావడంతోపాటు నిజమైన రోగికి కిట్లు అందకుండా పోతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. టెస్టులు చేసిన వాటిలో ఎక్కువశాతం పాజిటివ్‌లు ఉండాలని, తక్కువగా పాజిటివ్‌లు ఉంటే తగినచర్యలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా పీహెచ్‌సీ, యూహెచ్‌సీలకు ఇచ్చిన కిట్లు, వాటి రిపోర్టులను తెప్పించే పనిలో ఉన్నారు.
రెండ్రోజుల్లో బాధితులతో వీడియో కాన్ఫరెన్స్..
కరోనా పాజిటివ్ రావడంతో భయంతో ఉన్న బాధితులకు జిల్లా యంత్రాంగం అంతా వారి వెంటే ఉన్నట్లు భరోసా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తరుఫున కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్యశాఖ సిబ్బందితో కలిసి రెండ్రోజుల్లో సుమారు 500మంది పాజిటివ్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధైర్యం చెప్పనున్నారు. అంతేకాకుండా లైవ్‌లోనే బాధితులు అడిగిన ప్రశ్నలకు, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో వైద్య సలహాలు అందిస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇవ్వనున్నారు.

