Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hydraa | హైడ్రాకు ఎదురుదెబ్బ.. హైకోర్టు తీర్పును తామే అమలు చేసిన బాధితులు

Hydraa | హైడ్రాకు ఎదురుదెబ్బ.. హైకోర్టు తీర్పును తామే అమలు చేసిన బాధితులు

Hydraa | హైదరాబాద్‌ సిటీబ్యూరో/అల్లాపూర్‌, జూన్‌ 1(నమస్తే తెలంగాణ): నిర్మాణాల కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. కూకట్‌పల్లిలో గతవారం చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను పాటించకపోవడంతో బాధితులే రంగంలోకి దిగారు.

హైడ్రా స్వాధీనం చేసుకున్న త మ భూమిని వారు తిరిగి స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది.

హైడ్రా గత నెల 25న కూకట్‌పల్లిలోని ఎన్‌వీఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు చెందిన 13.17ఎకరాల భూమిలో నిర్మాణాలను తొలగించి అక్కడి రేకుల షెడ్లను పూర్తిగా నేలమట్టం చేసింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై ఎన్‌వీఎన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ కోర్టు ధిక్కరణ కింద మరో కేసు వేశారు.

హైడ్రాను తీవ్రంగా మందలించిన కోర్టు.. తమ ఉత్తర్వులు అందిన 24గంటలలోగా ఆ స్థలంలో యథాతథ స్థితిని కల్పించి పిటిషనర్లకు అప్పగించాలని ఆదేశించింది. అయితే హైడ్రా ఉత్తర్వులు అందిన 48 గంటల వరకూ స్పందించకపోవడంతో సోమవారం కూకట్‌పల్లిలోని ఎన్‌వీఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ప్రతినిధులు తమ సిబ్బందితో కలిసి హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమి వద్దకు వచ్చారు.

అప్పటివరకు అక్కడే ఉన్న హైడ్రా సిబ్బంది, డిజాస్టర్‌ వాహనం.. ఎన్‌వీఎన్‌ ప్రతినిధులతోపాటు మీడియా కూడా వస్తున్నదని తెలుసుకొని అక్కడినుంచి జారుకున్నారు. ఆ తర్వాత ఎన్‌వీఎన్‌ ప్రతినిధులు మీడియా సమక్షంలో కోర్టు తీర్పును అనుసరించి తమ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ హైడ్రా వేసిన ఫెన్సింగ్‌తోపాటు వారు పెట్టిన బోర్డులను కూడా తీసేశారు. ఆ తర్వాత ఆ స్థలం తమదేనని పేర్కొంటూ బోర్డు పెట్టారు.

ఈ సందర్భంగా హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ సంస్థ సభ్యులతోపాటు అదే స్థలంలో తమ భూములున్న కనకదుర్గ సొసైటీ ప్రతినిధులు కూడా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. గత సంవత్సరం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తమ భూమి వద్దకు వచ్చి ఈ భూమి ఈదులకుంటదని చెప్పి బెదిరిస్తే తాము హైకోర్టును ఆశ్రయించి అన్ని ప్రభుత్వశాఖలు ఇచ్చిన అనుమతులు సమర్పించామని, దీనిపై హైడ్రా జోక్యం చేసుకోవద్దని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అవేవీ లెక్కచేయకుండా హైడ్రా సామాన్యులనే టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana